Pages

Aug 2, 2021

Lulu E. Garton | లులు ఇ. గార్టన్

 లులు ఇ. గార్టన్  | Lulu E. Garton 

  • జననం: - 
  • మహిమ ప్రవేశం: -
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం

అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉన్న ‘బ్రాడ్‌వే క్రిస్టియన్ చర్చి’ (‘డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్’) ద్వారా భారతదేశానికి వచ్చి, 1915-21వ సంll ల మధ్య కాలంలో సేవ చేసిన మిషనరీ లులు ఇ. గార్టన్. అలెగ్జాండర్ హామిల్టన్ మరియు మేరీ ఫ్రాన్సిస్ అనే క్రైస్తవ దంపతులకు జన్మించిన లులు, క్రైస్తవ విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగారు. చిన్నతనంలో పర్వతారోహణ పట్ల అభిరుచిని కలిగియున్న ఆమె, దేవునితో తన అనుభవమును ఇలా వివరించేవారు, “కొలరాడోలోని సిల్వర్ ప్లూమ్ అనే చిన్న గనుల క్షేత్రంలో, డెన్వర్ ప్రాంతం కంటే ఒక మైలు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండ ప్రాంతము యొక్క అరుదైన వాతావరణంలో మొట్టమొదటిగా నేను దేవుని గాలిని శ్వాసించాను."

 

ఆమె స్వభావం మరియు ఇంటి దగ్గర ఆమె పొందిన ఆత్మీయ శిక్షణ వలన ఆమె ఒక లోతైన ఆధ్యాత్మికత కలిగిన వక్తిగా ఎదిగారు. కాగా పదమూడేళ్ల వయసులోనే మిషనరీ అవ్వాలని నిర్ణయించుకున్న ఆమె, ఎంతో అవసరతలో ఉన్న ప్రదేశంగా భారతదేశాన్ని అందుకొరకై ఎంచుకున్నారు. ఆమె కళాశాల చదువును ఆరంభించవలసిన సమయంలో ఎటువంటి ధనసహాయం లభించలేదు. అందునుబట్టి ఆమె వారి పాదిరితో చర్చించి, దాని గురించి ప్రార్థించారు. తత్ఫలితముగా విద్యా ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) ఆమెకు లభించగా 1907వ సంll లో తన కళాశాల చదువును పూర్తిచేసుకున్నారు లులు. తదుపరి ఆమె అదనపు సమయమును కేటాయించి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఒక ప్రత్యేక అధ్యయనమును కొనసాగించారు. అంతేకాకుండా ఆమె కెంటకీలోని హజెల్ గ్రీన్‌లో ఉన్న ‘హోమ్ మిషన్స్ మౌంటైన్ స్కూలు’ లో బోధించారు, నర్సుగా శిక్షణను పొందారు మరియు మూడు సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగంలో నర్సుగా పనిచేశారు. మిషనరీగా భారతదేశానికి వెళ్ళుటకు ఆమె చేస్తున్న సన్నాహాలు ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్‌’ లో పొందిన శిక్షణతో ముగిసాయి. చివరికి 1915వ సంll ఆగష్టు మాసంలో భారతదేశానికి పయనమయ్యారు లులు.


భారతదేశానికి చేరుకున్న ఆమె, అక్కడ ఆరు సంవత్సరాల పాటు సంతోషంగా పరిచర్య జరిగించారు. ఆమె సేవ చేసిన ప్రదేశాలలో హర్దా, రథ్, బినా, ఝాన్సీ మరియు కుల్పహార్ ఉన్నాయి. దేవుని సేవ చేయుటకు ఆమె తన దేహమును ఎంతో కఠినముగా శ్రమపెట్టారు. కాగా బాగా దెబ్బతిన్న ఆమె ఆరోగ్యం దేవుని సేవలో ముందుకు సాగుటకు ఆమెకు సహకరించలేదు. 1921వ సంll లో ఆమె కొంతకాలం తన స్వదేశానికి తిరిగివెళ్ళగా, అక్కడి నుండి తిరిగి రావడం ఆమెకు అసాధ్యమయ్యింది. అయితే అలుపెరుగని దేవుని పరిచారకులను దేవుని సేవ చేయకుండా ఏదీ కూడా నిరోధించలేదు. కాగా ఆమె దక్షిణ కాలిఫోర్నియాలోని మహిళా మిషనరీ సంస్థల కార్యదర్శిగా ఎనిమిది సంవత్సరాల పాటు సేవలందించారు. తదుపరి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి తన సమయాన్ని వెచ్చించారు. తన మిగిలిన జీవితమును కాలిఫోర్నియాలో గడిపిన లులు గార్టన్, చివరి వరకు కూడా ఎప్పటిలాగే క్రైస్తవ సంఘము యొక్క మిషనరీ కార్యకలాపాలలో ఆసక్తిని కనుబరచినవారై వాటిలో చురుకుగా పాల్గొనేవారు.


🚸 ప్రియమైనవారలారా, అలుపెరుగని హృదయముతో దేవుని సేవ చేయకుండా ఏది మిమ్ములను అడ్డుకుంటున్నది? 🚸

🛐 "ప్రభువా, అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకై అలుపెరుగక సేవ చేయు మనస్సును నాకు దయచేయుము. ఆమేన్!" 🛐

🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

No comments:

Post a Comment