Pages

Aug 17, 2021

Ruatoka | రుయాతోకా

Ruatoka | రుయాతోకా


  • జననం: 12 September 1846
  • మహిమ ప్రవేశం: 1903
  • స్వస్థలం: మంగైయా ద్వీపం
  • దర్శన స్థలము: పాపువా న్యూ గినియా


 రుయాతోకా దక్షిణ కుక్ దీవులలోని మంగైయా ద్వీపానికి చెందినవారు. కౄరమైన నరమాంస భక్షకులైన అతని పూర్వీకులు సస్సెక్స్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ ద్వారా క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు. కాగా రుయాతోకా యేసు క్రీస్తు ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించిన పిమ్మట క్రీస్తును గురించి ప్రకటించుటకు కౄర స్వభావులును నరమాంస భక్షకులునైయున్న న్యూ గినియా ప్రజల వద్దకు వెళ్ళారు.


 రుయాతోకా మరికొంత మందితో కలిసి పోర్ట్ మోర్స్‌బీకి వచ్చినప్పుడు అక్కడి స్థానికులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. వారు దేవుళ్లు లేదా దుష్టశక్తులై యుంటారని ఆ ప్రజలు భావించారు. రుయాతోకాకు అక్కడ నివసించడం మనుగడ కొరకు పోరాటంగా మారింది. అతని సహచరులు ఒకరి తరువాత ఒకరు మలేరియాతో మరణిస్తున్నారు మరియు ఆహారం మరియు ఔషధాలు కొరతగా ఉన్నాయి. భాష ఒక అవరోధంగా మారడం వలన క్రీస్తు గురించి ప్రజలకు బోధించడం కష్టతరమైంది. అయినప్పటికీ అక్కడి స్థానికుల మధ్య పరిచర్యను కొనసాగించారు రుయాతోకా.


 అక్కడి ద్వీపవాసుల మధ్య రుయాతోకా యొక్క సాక్ష్యం ఎటువంటిదంటే వారు అతనిని ‘యేసుని మనుష్యుడు’ అని పిలిచేవారు. అతను వారి మధ్య నడిచేటప్పుడు వారు ఈటెలు మరియు కర్రలతో అతనిని బెదిరించినప్పటికీ అతను భయపడక సాగిపోయేవారు. కొన్నిసార్లు స్థానికులు ఈటెలు పట్టుకొని అతనిని చంపుటకు పరిగెత్తినప్పుడు కూడా అతను తన బైబిలును పైకెత్తి పట్టుకుని, “నేను జీవ పుస్తకమును కలిగియున్నాను. నా జీవితం క్రీస్తులో భద్రపరచబడియుంది” అని పలికేవారు. అతని మాటలకు ఆశ్చర్యపడిపోయే స్థానికులు అతని మీద దాడిచేయక అతను చెప్పే ప్రసంగమును ఆలకించేవారు. అధికారికంగా ఉండే అతని మాటలు వారు వారి పాపాల కొరకు పశ్చాత్తాపపడేలా చేసేవి.


  ఒక రోజు రుయాతోకా తన ఇంటి తలుపు తట్టిన చప్పుడుకి మేల్కొన్నారు. తలుపు తెరచి చూడగా అక్కడ భయముతో నిండుకొనిన కొందరు పాపువాన్లు ఉన్నారు. వారు దారి ప్రక్కన ఒక శ్వేతజాతీయుడు గాయములతో పడియున్నాడని, అయితే అతను దురాత్మను కలిగియున్నాడేమోయని భయపడి తాము అతని దగ్గరికి వెళ్ళలేదని అతనికి తెలియజేశారు. భయపడుటకు అక్కడ ఎటువంటి ఆత్మలూ లేవని పాపువాన్లకు చూపించుటకుగాను రుయాతోకా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కాగా అతను ఆ శ్వేతజాతీయుని కనుగొని, అతనికి కొన్ని నీళ్ళిచ్చి, అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటి వద్ద రుయాతోకా యొక్క భార్య పరిచర్య చేసి అతనికి తిరిగి జీవం పోసింది. ఆ విధముగా విశ్వాసమును ఆచరణాత్మకముగా చూపించే అతని క్రియల ద్వారా అతను క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించగలిగారు.


  మంచి కాపరి వంటి హృదయముతోను, మంచి సమరయుని వంటి మనస్సుతోను పాపువా తెగల మధ్య చివరి వరకూ తన సేవను కొనసాగించారు రుయాతోకా.


 *ప్రియమైనవారలారా, క్రీస్తు యేసు కలిగియున్న అదే మనస్సును మీరును కలిగియున్నారా?* 


 *"ప్రభువా, నా విశ్వాసమును క్రియారూపకముగా కనుపరచుట ద్వారా మీ కొరకు ఆత్మలను సంపాదించగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 

*******

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏

No comments:

Post a Comment