Pages

Aug 20, 2021

Samuel J. Mills | శామ్యూల్ జె. మిల్స్

 శామ్యూల్ జె. మిల్స్ |  Samuel J. Mills


  • జననం: 12-04-1783
  • మహిమ ప్రవేశం: 16-06-1818
  • స్వస్థలం: కనెక్టికట్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


శామ్యూల్ జాన్ మిల్స్ కనెక్టికట్‌లోని ఒక పాదిరి కుమారుడు. ఒక క్రైస్తవ భక్తురాలైన అతని తల్లి అతనిని దేవుని పరిచర్యకు సమర్పించారు మరియు ఎంతో శ్రద్ధగా అతనిని ఆ దిశలో నడిపించారు. జాన్ ఎలియట్ మరియు డేవిడ్ బ్రెయినర్డ్ జీవితాల నుండి ప్రేరణ పొందిన మిల్స్, మిషనరీ పరిచర్య కొరకై తన జీవితమును సమర్పించుకున్నారు. కాగా పరిచర్య కొరకు సిద్దపడుటకుగాను 1806వ sసంllలో అతను విలియమ్స్ కళాశాలలో చేరారు.


మిల్స్ ఒక తెలివైన విద్యార్థి, చురుకైనవారు, ఎంతో ఉత్సుకతను కలిగి ఉండేవారు, త్యాగపూరితమైన స్వభావం గలవారు మరియు మంచి పనులు చేయుటకు అంకితభావం గలవారు. ప్రతి శనివారం అతను భక్తి గలిగిన తన నలుగురు స్నేహితులను కళాశాలలోని ఏకాంతముగా ఉండే పొదల మధ్య కలుసుకొని మిషనరీ పనుల కొరకు ప్రార్థించడం ఆనవాయితీ. కాగా అటువంటి ఒక శనివారం వారి కలయికకు ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం వలన అంతరాయం కలిగింది. అందువలన వారు ఒక గడ్డివాము క్రింద దాగుకొని ప్రార్థించుట కొనసాగించారు. ఆ ప్రార్థన యొక్క ఫలమే విదేశీ మిషన్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పడిన ‘సొసైటీ ఆఫ్ బ్రదరన్’. అనేకమంది విద్యార్థులు ఈ సంస్థలో భాగస్థులయ్యారు. వారిలో శామ్యూల్ న్యూవెల్ మరియు అడోనిరామ్ జడ్సన్ వంటి వారు కూడా ఉన్నారు. 1801వ సంll లో మిల్స్‌తో సహా ఆ సంస్థలోని నలుగురు ‘కాంగ్రెగేషనల్ జనరల్ అసోసియేషన్ ఆఫ్ మసాచుసెట్స్’ ముందు హాజరయ్యి తమను తాము విదేశీ మిషనరీలుగా సమర్పించుకున్నారు. ఆ విధంగా ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమీషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) ఉనికిలోకి వచ్చింది.


1812వ సంll లో ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ నుండి పట్టభద్రులైన పిమ్మట పశ్చిమ మరియు దక్షిణ అమెరికాలో రెండు మిషనరీ పర్యటనలు చేపట్టారు మిల్స్. అతని మిషనరీ పర్యటనల నివేదికలు అమెరికాలోని క్రైస్తవ సంఘముల మేల్కొలుపుకు దారితీయగా, తత్ఫలితముగా చివరికి 1826వ సంll లో ‘అమెరికన్ హోమ్ మిషనరీ సొసైటీ’ ఏర్పడింది. దేశంలో బైబిళ్ళ కొరకు తీవ్ర స్థాయిలో ఉన్న అవసరతలను గుర్తించి, స్వతంత్ర్యముగా ఉన్న బైబిలు సొసైటీలను ఏకం చేయుటకు కృషిచేసిన మిల్స్, 1816వ సంll లో ‘అమెరికన్ బైబిల్ సొసైటీ’ ఏర్పడుటలో కీలక పాత్ర పోషించారు.


అమెరికాలో తన పరిచర్య ఎంతో తీవ్రముగా ఉన్నప్పటికీ, విదేశాలలో మిషనరీగా సేవ చేయాలనే కోరిక అతనిని ఏనాడూ విడిచిపోలేదు. చివరికి ‘ది అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ’ యొక్క మిషనరీ కార్యకలాపాలను పశ్చిమ ఆఫ్రికాలో విస్తరింపజేయుటకు అతను ఎంపికయ్యారు. కాగా ఎంతో సంతోషముతో గమ్యాన్ని చేరుకొనుటకు ఓడలో ప్రయాణిస్తున్న అతను తనకు అప్పగింపబడిన మిషన్‌ను చేపట్టకముందే జ్వరం బారినపడి అనారోగ్యం పాలయ్యారు. ఈ యువ మిషనరీ 1818వ సంll జూన్ మాసం 16వ తారీఖున ఓడప్రయాణంలో ఉండగానే తన చివరి శ్వాస వదిలారు.


🚸 ప్రియమైనవారలారా, మీరు ఉన్న స్థలములో నిర్విరామముగా దేవునికి మీరు సేవ చేయుచున్నారా? 🚸


🛐 "ప్రభువా, నేను జ్ఞానము, చురుకుతనము, ఉత్సుకత, త్యాగపూరిత స్వభావము కలిగి సత్క్రియల పట్ల అంకితభావం కలిగియుండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐


🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

No comments:

Post a Comment