Pages

Aug 30, 2021

Thomas Burchell | థామస్ బర్చెల్

థామస్ బర్చెల్ | Thomas Burchell


  • జననం: 25-12-1799
  • మహిమ ప్రవేశం: 16-05-1846
  • స్వస్థలం: యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము: జమైకా


 ఒక బాప్తిస్టు మిషనరీయైన థామస్ బర్చెల్ జమైకాలో బానిసల స్వేచ్ఛ కొరకు బలమైన మద్దతునిచ్చినవారిలో ఒకరు. యవ్వనదశలో అతను క్రైస్తవ వీరుల సాక్ష్యములను చదువుటను ఎంతో ఇష్టపడేవారు. అతను తన రక్షణ అనుభవమును “పాప బానిసత్వం యొక్క బంధకముల నుండి స్వేచ్ఛను పొందడం” గా వర్ణించారు. పాపము యొక్క బానిసత్వం నుండి స్వేచ్ఛను పొందిన వ్యక్తిగా జమైకన్ల ఆత్మీయ మరియు భౌతికపరమైన స్వేచ్ఛ కొరకు కృషిచేశారు థామస్.


 నెయిల్‌స్వర్త్‌లో బట్టల తయారీదారునిగా శిక్షణ పొందుతున్న సమయంలో బర్చెల్ “షార్ట్‌వుడ్ బాప్టిస్ట్ చర్చ్” సంఘము వలన ఎంతో ప్రభావితులయ్యారు. అప్పటి నుండి కూడా అతని ఆలోచనలు మిషనరీ సేవ వైపుకు త్రిప్పబడ్డాయి. అదే సంఘము నుండి మిషనరీలుగా వెళ్ళినవారి అడుగుజాడలను అనుసరించిన థామస్ కూడా మిషనరీగా జమైకాలో సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. కాగా 1822వ సంll లో జమైకాలోని మాంటెగో బేకు చేరుకున్న అతను, ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆ దేశములో సేవచేశారు.


 జమైకాలో ప్రబలంగా ఉన్న బానిసత్వమును చూసి ఎంతగానో బాధపడిన థామస్, అలాంటి సమాజమును మార్చవలెనని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. బానిసత్వం అనేది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే కాకుండా మతపరమైన స్వేచ్ఛకు కూడా ఒక అడ్డంకిగా ఉన్నదని అతను భావించారు. కాగా బానిసత్వం వలన అక్కడ నెలకొనియున్న కఠినమైన పరిస్థితుల గురించి అతను తన కుటుంబమునకు, స్నేహితులకు మరియు ఇంగ్లాండులోని మిషనరీ సొసైటీకి లేఖలు వ్రాశారు. 1827వ సంll లో అతను వ్రాసిన ఉత్తరాలలో ఒకటి ప్రముఖ బ్రిటిష్ పత్రికలో ప్రచురించబడగా, అది జమైకా అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే విద్రోహానికి పాల్పడ్డారన్న కారణంతో థామస్‌ను అరెస్టు చేశారు. ఒకవైపు అతను బానిసలచే ప్రశంసించబడినప్పటికీ, బానిసత్వమును వ్యతిరేకించే భావాలను కలిగియుండుట వలన అతని పట్ల బానిస యజమానులు ఏహ్యభావమును కలిగినవారై అతనిని ద్వేషించారు. కాగా 1831వ సంll లో జరిగిన ఒక గొప్ప బానిస తిరుగుబాటు సమయంలో ఆధిపత్యమును కోరుకునే శ్వేతజాతీయులచే థామస్ యొక్క అనేక క్రైస్తవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. బర్చెల్ కట్టిన క్రైస్తవ సంఘములలో అతను ప్రజలలోను మరియు పరిచర్యలోను సమానత్వం ఉండేలా చూశారు. అతని మొట్టమొదటి సంఘము యొక్క మొదటి డీకన్ (పరిచారకులు) పూర్వము బానిసగా ఉన్న వ్యక్తి.


  పిమ్మట బ్రిటన్‌లో కొద్దికాలం పనిచేసిన థామస్, 1833వ సంll లో జమైకాకు తిరిగి వచ్చి, అక్కడ ‘స్వేచ్ఛా గ్రామాలను’ (‘ఫ్రీ విలేజెస్’) స్థాపించుటకు కృషి చేయడం ప్రారంభించారు. అందుకొరకుగాను అతను విస్తారమైన భూమిని కొనుగోలు చేసి, వాటిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి, వాటిని మాజీ బానిసలకు ఇచ్చారు. తద్వారా బానిసలు తమను తాము యజమానులుగా మార్చుకునేందుకు వీలు కల్పించారు థామస్. శాండీ బే, బెథెల్ టౌన్ మరియు మౌంట్ కారీ స్వేచ్ఛా గ్రామాలు థామస్ బర్చెల్ చేసిన కృషి యొక్క ఫలితాలు.


🚸 *ప్రియమైనవారలారా, పాపము యొక్క బానిసత్వం నుండి మీరు స్వేచ్ఛను పొందారా?* 🚸


 *"ప్రభువా, ఇతరుల ఆత్మీయ జీవితము కొరకు నేను శ్రమించునట్లు నాకు ఆత్మ భారమును దయచేయుము. ఆమేన్!"* 

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

*******


No comments:

Post a Comment