Pages

Sep 21, 2021

Faye Edgerton | ఫేయ్ ఎడ్జర్టన్

 ఫేయ్ ఎడ్జర్టన్ | Faye Edgerton


  • జననం: 26-03-1889
  • మహిమ ప్రవేశం: 04-03-1968
  • స్వస్థలం: నెబ్రాస్కా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శనము: నవాజో మరియు అపాచీ ప్రజలు


 ఫేయ్ ఎడ్జర్టన్ ఒక మిషనరీ మరియు బైబిలు అనువాదకురాలు. ఆమె పాఠశాలలో చదువుకునే రోజులలో లోకానుసారమైన జీవితమును జీవించారు. అయితే, 12వ తరగతి పూర్తయిన తరువాత, ఆమె స్కార్లెట్ ఫీవర్‌తో తీవ్రంగా బాధపడ్డారు మరియు తాత్కాలికంగా చెవిటితనం కూడా ఆమెకు కలిగింది. అనారోగ్యం నుంచి కోలుకొనిన తరువాత ఆమె తాను లోకానుసారమైన జీవితమును విడిచిపెట్టి, ఒక విదేశీ మిషనరీగా మారాలని నిర్ణయించుకున్నారు. కాగా, చికాగోలోని మూడీ బైబిల్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు ఫేయ్. అక్కడ నుండి పట్టా పొందిన తరువాత ఆమె భాషా శిక్షణను కూడా చేపట్టారు.


 తదుపరి ఆమె అమెరికా ప్రెస్బిటేరియన్ మిషన్‌లో చేరి కొరియాకు వెళ్ళారు. అయితే, దాదాపు నాలుగు సంll ల పాటు అక్కడ సేవ చేసిన తరువాత అనారోగ్యం కారణంగా ఆమె స్వదేశానికి తిరిగిరావాల్సి వచ్చింది. తరువాత ఆమె అరిజోనాలోని నవాజో తెగ స్థావరం వద్ద ఒక పాఠశాలలో పని చేయుటకు నియమించబడ్డారు. పాఠశాలలో పిల్లలు ఆంగ్లము మాత్రమే మాట్లాడుటకు అనుమతించబడేవారు, నవాజో భాష అక్కడ నిషేధించబడింది. అయితే, నవాజో ప్రజలకు బోధించేటప్పుడు వారికి దేవుని వాక్యమును నవాజో భాషలోనే అందించవలసిన ఆవశ్యకతను గ్రహించారు ఫేయ్. కాగా, ఆమె తానే స్వయంగా ఆ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు.


 చివరకు తాను ఏమి చేయాలని దేవుడు సంకల్పించాడో అది చేయుటకు తనకు మార్గమును తెరుస్తున్నాడని చూచిన ఆమె, 1944వ సంll లో క్రొత్త నిబంధనను నవాజో భాషలోకి అనువదించుటకు 'విక్లిఫ్ బైబిలు అనువాదకుల' లో చేరారు. జెరోనిమో మార్టిన్ అనే నవాజో తెగకు చెందిన ఒక అంధుడు మరియు రోజర్ డీల్ అనే మరొక అనువాదకుని సహాయంతో ఆమె క్రొత్త నిబంధనను అనువదించడం ప్రారంభించారు. ప్రజలు చదవలేకపోతే అనువదించిన బైబిలు నిష్ప్రయోజనమని ఎరిగియున్న ఫేయ్, అనువదించుటకును మరియు నవాజో ప్రజలకు చదువు నేర్పించుటకును తన సమయమును విభజించారు. 10 సంll ల పాటు తీవ్రంగా చేసిన కృషి ఫలితముగా చివరికి 1956వ సంll లో నవాజో భాషలో క్రొత్త నిబంధన గ్రంథం ప్రచురించబడింది. తదుపరి ఆమె పాత నిబంధనలోని కొన్ని పుస్తకాల నవాజో అనువాదాలను కూడా సవరించారు.


 పిమ్మట అరిజోనాలోని శాన్ కార్లోస్ వద్దనున్న అపాచీ తెగ స్థావరమునకు వెళ్ళి, అపాచీ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు ఫేయ్. మరొక అనువాదకురాలైన ఫెయిత్ హిల్ సహాయంతో ఆమె క్రొత్త నిబంధనను అపాచీ భాషలోకి అనువదించారు. అది మరో పది సంవత్సరాల నిరంతర కృషి. 70 ఏళ్ళు పైబడిన వృద్ధాప్యంలో కూడా ఆమె హోపి మరియు ఇనుపియాట్ భాషలలో క్రొత్త నిబంధన యొక్క అనువాదంలో సహాయపడ్డారు మరియు నవాజో క్రొత్త నిబంధనను సవరించారు. తన చివరి శ్వాస వరకు కూడా ఏనాడూ దేవుని వాక్యమును అనువదించుటను ఆపని అలుపెరుగని దేవుని సేవకురాలు ఫేయ్ ఎడ్జర్టన్.


ప్రియమైనవారలారా, మీ తలాంతులు దేవుని సేవలో వాడబడుటకు మార్గములను మీరు వెతుకుతున్నారా?

"ప్రభువా, మీ సేవలో వాడబడులాగున నాకున్న తలాంతులను వృద్ధి పరచుకొనుటకు నేను కృషి చేసెదను. ఆమేన్!"

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


No comments:

Post a Comment