Pages

Sep 30, 2021

Irene Eleanor Verita Petrie | ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ

ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ  | Irene Eleanor Verita Petrie




  • జననం: అక్టోబరు 1864
  • మహిమ ప్రవేశం: 06-08-1897
  • స్వస్థలం: కెన్సింగ్టన్ పార్క్
  • దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము: పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్

ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ ఎల్లప్పుడూ వేసవిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ శీతాకాలంలో మాత్రం అది నివసించుటకు ఈ భూమిపైని అత్యంత కఠినమైన ప్రదేశాలలో ఒకటి అన్నట్లు ఉంటుంది. ఆ సమయంలో సంపన్నులైనవారు మనుగడ కొరకు తాత్కాలికంగా మైదాన ప్రాంతములకు వలస వెళుతారు. అక్కడే మిగిలిపోయినవారు చివరికి అనారోగ్యంతో మరణించేవారు. ఆ విధంగానే 1894వ సంll శీతాకాలంలో కూడా అనేకమంది ప్రజలు మైదానాల వైపు వెళుతుండగా ఒక యువతి మాత్రం అక్కడే ఉండిపోయిన వారికి సహాయం చేయుటకు కాశ్మీర్ దిశగా పయనిస్తోంది. ఆమె పేరు ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ.

ఐరీన్ కేవలం 2 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమెను దేవుని సేవకు సమర్పించారు. ఎంతో చురుకుగా మరియు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె సహజముగానే మంచి ప్రతిభావంతురాలు. ఆమె వారి నగరంలో ఒక నిష్ణాతురాలైన గాయని కూడా. లోకానుసారముగా తన జీవితమును ఆస్వాదించుటకు ఆమెకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆమె వాటి వైపు మొగ్గు చూపక ఒకరోజున తాను మిషనరీ అవ్వాలనే ఆలోచనను తనలో అభివృద్ధిపరచుకున్నారు. కాగా ఆమె ‘చర్చి మిషనరీ సొసైటీ’ లో చేరగా, ఆ సంస్థ ఆమెను భారతదేశంలో సేవ చేయుటకు నియమించింది.

1893వ సంll లో లాహోర్‌కు చేరుకున్న ఐరీన్, అక్కడి ప్రజల హృదయ విదారక స్థితిని చూచి విలపించారు. మహిళా వైద్య సిబ్బంది లేకపోవడంతో అనేక మంది యువతులు మరణిస్తున్నారు. ఈ లోకంలో కాకపోయినా, కనీసం నిత్యరాజ్యంలో వారు కలిగియుండే జీవితమును గురించి అయినా ఆ ప్రజలకు ఒక నిరీక్షణను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. కొంతకాలం పాటు లాహోర్‌లోని ఒక స్వచ్ఛంద గృహంలో సేవలందించిన తరువాత, 1894వ సంll లో ఆమె శ్రీనగర్‌కు వెళ్ళారు. ఒక శిక్షణ పొందిన నర్సు కావడంతో ఆమె తానే స్వచ్చందంగా మరికొంతమందితో కలిసి ఇంటింటికీ వెళ్ళి మహిళలకు వైద్య సేవలను అందించి, అనేక మంది ప్రాణాలను కాపాడారు. వారిని ఉత్సాహపరిచేందుకు ఆమె పాటలు పాడి, బైబిలు కథలను చెప్పేవారు. ఆమె రోగులు ఆమెకు స్నేహితులు అయ్యారు మరియు క్రమక్రమంగా దేవుని బిడ్డలు కూడా అయ్యారు.

శ్రీనగర్‌లోని బాలుర పాఠశాలలో కూడా చురుకుగా సేవలందించారు ఐరీన్. పాఠశాలలో నిధుల కొరత ఏర్పడినప్పుడు, పాఠశాలను నడిపించుటకు కావలసిన ధన సహాయము కొరకు ఆమె చిత్రాలను గీసి విక్రయించారు. అక్కడి వాతావరణ పరిస్థితులు కఠినమైనవి అయినప్పటికీ, ఆమె తన ఆరోగ్యమును ఏనాడూ లెక్కచేయకుండా, కాశ్మీరీలు మరియు ఆఫ్ఘన్‌ల శ్రేయస్సు కొరకు అంకితభావంతో పనిచేశారు. లేహ్‌ ప్రాంతమునకు తాను చేసిన ఒక ప్రయాణంలో టైఫాయిడ్‌ బారిన పడి అనారోగ్యానికి గురైన ఐరీన్ పెట్రీ, 33 సంll ల లేత ప్రాయములోనే ఈ లోకము విడిచి తన ప్రభువును చేరుకున్నారు.

ప్రియమైనవారలారా, ఈ లోకములో నిరాశానిస్పృహలతో ఉన్న ప్రజలకు పరమ నిరీక్షణను అందించే సాధనముగా మీరు ఉన్నారా?

"ప్రభువా, ద్వేషమున్న చోట ప్రేమను, నిరాశ ఉన్న చోట నిరీక్షణను మరియు దుఃఖమున్న చోట సంతోషమును నేను విత్తుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment