Pages

Sep 15, 2021

Mary Manson | మేరీ మాన్సన్

 మేరీ మాన్సన్ | Mary Manson

  • జననం : 1878
  • మరణం : 1962
  • స్వదేశం : నార్వే
  • దర్శన స్థలం : చైనా

చైనాలో సేవ చేసిన అత్యంత ప్రియమైన విదేశీ మిషనరీలలో మేరీ మాన్సన్ ఒకరు . మంచి విద్యాభ్యాసం కలిగియుండి , ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందియున్న ఆమె , తదుపరి మిషనరీ సేవ కొరకైన తన పిలుపును గ్రహించారు . అనేక మంది విదేశీ మిషనరీలు చంపివేయబడుతున్న ' బాక్సర్ ' తిరుగుబాటుతో చైనాలో పరిస్థితులు ఎంతో అశాంతియుతంగా ఉన్న సమయంలో 1901 వ సం ll ఆమె ఆ దేశంలో అడుగుపెట్టారు . అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొనియున్ననూ , దేనికీ జడియకుండా సువార్తను ప్రకటించుటకును , తన రక్షకుని నుండి తాను పొందిన ప్రేమను ఇతరులకు చూపించుటకును ఆమె ధైర్యముగా ఆ భూభాగంలోకి ప్రవేశించారు .

ప్రారంభ సంవత్సరాలలో చైనా స్త్రీల కొరకు ఆమె బైబిలు తరగతులను నిర్వహిస్తూ , నాన్యాంగ్ అనే ప్రాంతములో ఒక చిన్న బాలికల పాఠశాలను నడుపుతూ తన మిషనరీ సేవను సాగించారు . అయితే , రాజకీయపరంగా అక్కడ నెలకొనియున్న అశాంతి మరింత ప్రమాదకరంగా మారడంతో , ఆమె మంచూరియా మరియు ఉత్తర చైనాలను పర్యటించి , అక్కడి మిషనరీలు మరియు క్రైస్తవ సంఘ నాయకులలో ఆత్మీయ మేల్కొలుపును కలిగించారు . వారు ఏ క్రైస్తవ వర్గానికి చెందినవారు , సాధారణ విశ్వాసియా లేక దేవుని పరిచర్య చేసే సేవకులా అనే వాటితో నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరినీ ఆమె సాధారణంగా అడిగే ప్రశ్న ఏమిటంటే " మీరు తిరిగి జన్మించారా ? " షాంటుంగ్ పరిధి ప్రాంతమంతటా ఆమె యొక్క కూడికలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలముగా పనిచేయగా , 1930 లలో అక్కడ గొప్ప ఉజ్జీవం నెలకొంది . ఎల్లప్పుడూ ప్రార్థనలో తన ప్రభువుతో సన్నిహిత సహవాసం కలిగియుండుట వలన ప్రభువు ఆమెను ఎక్కడకు నడిపిస్తున్నాడో మాన్సన్ గ్రహించగలిగేవారు . కాగా సువార్తను ప్రకటించుట కొరకై ఆమె బందిపోటు దొంగలతో నిండియున్న ప్రాంతముల గుండా నిర్భయంగా వేలాది మైళ్ళు ప్రయాణించారు .

ఒకసారి ఆమె షాంటుంగ్ లో జరిగే ఒక కూడికకు వెళ్ళవలెనని సముద్రపు దొంగలచే హైజాక్ చేయబడియున్న ఒక ఓడలోకి ఎక్కారు . అయినప్పటికీ , ఓడలో ఉన్నవారితో పాటు సముద్రపు దొంగలకు కూడా సువార్త ప్రకటించుటకు ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు . ఆమె చెరపట్టబడి యున్నప్పటికీ , సువార్త కరపత్రాలను పంచిపెట్టి , వాటిని బిగ్గరగా చదివి వినిపించుట ద్వారా నిజమైన ఏకైక దేవునిని ఎరుగులాగున అక్కడ ఉన్న అనేకమందిని నడిపించారు .

దేవుని సేవలో ఎంతో పట్టుదలతో ముందుకు సాగిపోయిన విశ్వాస యోధురాలు మాన్సన్ . చైనాకు వచ్చిన తరువాత తన తలకు గాయం కావడంతో ఆమె చైనా భాషను చదివి నేర్చుకొనలేకపోయినప్పుడు , ఆమె తన చుట్టూ ఉన్నవారు మాట్లాడుటను విని ఆ భాషను నేర్చుకున్నారు . అనారోగ్యం కారణంగా ఆమె ఎక్కడికీ వెళ్ళలేకపోయినప్పుడు , ఆమె ప్రార్థనలో తన సమయాన్ని గడిపారు . చైనా ప్రజలు పశ్చాత్తాపపడరు , వారి మధ్య ఉజ్జీవం కలుగుట అసాధ్యమని ఇతరులు ఎంతో నిక్కచ్చిగా చెప్పినప్పుడు , ఆమె అంతకంటే గొప్ప కార్యములు జరుగుతాయని దేవునిలో విశ్వాసముంచారు .

ప్రియమైనవారలారా , మీరు తిరిగి జన్మించారా ?

No comments:

Post a Comment