Pages

Sep 27, 2021

Vivienne Stacey | వివియెన్ స్టేసీ

వివియెన్ స్టేసీ | Vivienne Stacey



  • జననం: 12-07-1928
  • మహిమ ప్రవేశం: సెప్టెంబర్ 2010
  • స్వస్థలం: రూయిస్లిప్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శనము: ముస్లిం ప్రపంచం

 “ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.” (లూకా 12:48). “దేవుడు నాకు ఎంతో దయచేశాడు–కొత్త జీవితమును మరియు మంచి విద్యను ఇచ్చాడు. కాబట్టి, నేను ఆయనకు ఎంతో తిరిగి ఇవ్వవలెను.” అని అనుకున్నారు వివియెన్.

 వివియెన్ స్టేసీ ఒక నామమాత్రపు క్రైస్తవ కుటుంబములో జన్మించారు. లండన్‌లోని ‘యూనివర్శిటీ కాలేజ్’ లో చదువుతున్నప్పుడు, వివియెన్ తన క్రైస్తవ స్నేహితురాలు బార్బరా కలిగియున్న హృదయ శాంతి తనకు లేదని గ్రహించారు. ఒకసారి, బార్బరా ఆమెను ఒక యవ్వనస్థుల కూడికకు తీసుకువెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు వివియెన్ మోకరిల్లి ప్రార్థించగా, ఆమెకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనం కలిగింది. చివరికి హృదయ మార్పు నొంది మారుమనస్సును పొందారు వివియెన్. అటు తరువాత ఆమె మరొక కూడికకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక మిషనరీ భారతదేశంలోని కుష్టు రోగుల మధ్య పనిచేయుటకు దేవుడు తనను ఎలా పిలిచాడో అన్న దాని గురించి క్లుప్తముగా వివరించడం జరిగింది. ఆ కూడిక ముగిసే సమయానికి, విదేశాలలో సేవ చేయుటకు తనను కూడా దేవుడు పిలుస్తున్నాడని వివియెన్ గ్రహించారు. అది లూకా 12:48 ద్వారా ఆమెకు మరింతగా దృఢపరచబడింది.

 ముస్లింలకు సువార్త చెప్పడం ఎంతో క్లిష్టమని తెలుసుకున్న వివియెన్, తన పిలుపు ముస్లింల కొరకు పని చేయడమే అని గ్రహించారు. తరువాత ‘జెనానా బైబిల్ మరియు మెడికల్ మిషన్‌’ లో (ఈ సంస్థ తరువాత ‘ఇంటర్‌సర్వ్’ గా మార్చబడింది.) చేరిన ఆమె, ముస్లింల మధ్య సాక్షులుగా ఎలా ఉండాలో పాకిస్తానీ క్రైస్తవ మహిళలకు బోధించి, శిక్షణనిచ్చుటకు తనను పాకిస్తాన్‌కు పంపమని అభ్యర్థించారు. కాగా 1955వ సంll లో ఆమె పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఉన్న ‘యునైటెడ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్’ (యు.బి.టి.సి.) లో పనిచేయుటకు నియమితులయ్యారు.

 యు.బి.టి.సి. లో ఉన్నప్పుడు ఆమె బోధనలోను మరియు ఇతర కార్యక్రమాలలోను ఎంతో విస్తృతంగా తన సేవలనందించారు. ఆమె పాకిస్థాన్‌లో ‘థియోలాజికల్ ఎడ్యుకేషన్ బై ఎక్స్‌టెన్షన్’ పరిచర్య యొక్క వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. తరువాత, ఆమె గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న పాకిస్తానీ క్రైస్తవుల పరిస్థితిని అర్థం చేసుకొనుటకుగాను ప్రతి సంవత్సరం సెలవు దినములలో ఆ దేశాలను సందర్శించడం ప్రారంభించారు. వాటిని గురించిన ఆమె నివేదికలు మరియు ఆమె ఇచ్చిన శిక్షణ అక్కడ సేవ చేయుటకు ఇతరులకు సహాయపడ్డాయి. 1975వ సంll లో ‘ఇంటర్‌సర్వ్’ ఆమెను పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉన్న బన్ను అనే ప్రాంతములో సేవ చేయుటకు నియమించింది. అదే సమయంలో ఆమె మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరియు ఉత్తర ఆఫ్రికాల కొరకు సేవ చేయుటకు ‘ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్’ (IFES) తో కూడా కలిసి పనిచేశారు. ఆమె ఇస్లాం దేశాలకు, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాలకు, ఆఫ్రికా దేశాలకు మరియు భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలకు విస్తృతంగా ప్రయాణించి, ముస్లిం ప్రజల మధ్య పరిచర్య చేయుటకు క్రైస్తవ నాయకులకు బోధించి, శిక్షణనిచ్చారు. అంతేకాకుండా ఆమె ఆంగ్లం మరియు ఉర్దూ భాషలలో అనేక పుస్తకాలను మరియు వ్యాసాలను కూడా వ్రాశారు. 1993వ సంll లో ‘ఇంటర్‌సర్వ్’ నుండి పదవీ విరమణ పొందినప్పటికీ, తన రచనలను మరియు సంచార పరిచర్యను కొనసాగిస్తూ దేవుని సేవలో చివరి వరకూ ముందుకు సాగిపోయారు వివియెన్ స్టేసీ.

*ప్రియమైనవారలారా, మీ యొక్క పిలుపు ఏమిటో మీరు గ్రహించారా?*

"ప్రభువా, నీవు నాకు ఎంతో ఇచ్చావు. దానికి తగినట్లుగా నేను నీకు తిరిగి ఇచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

*******
దేవునికే మహిమ కలుగునుగాక!
*******

No comments:

Post a Comment