Pages

Oct 9, 2021

David Eubank | డేవిడ్ యూబ్యాంక్

డేవిడ్ యూబ్యాంక్ | David Eubank





  • జననం: 29-09-1960
  • మహిమ ప్రవేశం: -
  • స్వస్థలం: ఫోర్ట్ వర్త్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: బర్మా; యుద్ధ ప్రాంతాలు

 శత్రువులతో పోరాడాలా లేదా అనే విషయంలో క్రైస్తవులైన సైనికులకు ఎల్లప్పుడూ ఒక విధమైన సందిగ్ధం ఉంటుంది. జాతీయ కర్తవ్యం యుద్ధానికి పిలుపునిస్తే క్రైస్తవ కర్తవ్యం శాంతి కొరకు పిలుపునిస్తుంది. సైనికుడిగా ఉండటం, అదే సమయంలో క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చడం అనే రెండు విషయాల మధ్య తమ జీవితమును సమతుల్యం చేసుకున్న కొంతమంది క్రైస్తవులలో డేవిడ్ యూబ్యాంక్ ఒకరు.

 డేవిడ్‌కు తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు మిషనరీ పరిచర్య నిమిత్తం థాయ్‌లాండ్‌కు వెళ్ళారు. అయితే చదువు కొరకు అమెరికాకు తిరిగి వచ్చారు డేవిడ్‌. తన విద్యాభ్యాసం కొరకు ఆర్మీ ఉపకార వేతనమును అందుకున్న అతను, పిమ్మట అమెరికా సైన్యంలో కాల్బలము యొక్క అధికారిగా నియమించబడ్డారు. త్వరలోనే అతను మేజర్ స్థాయికి ఎదిగారు. శత్రు సైన్యాలను ఎదుర్కొనే ప్రతిసారీ వారితో పోరాడాలా లేదా అనే సందిగ్ధం ఎల్లప్పుడూ అతనిలో ఉండేది. తాను ఆత్మలను కాపాడాలే గానీ, ప్రాణాలను తీయకూడదని గ్రహించిన అతను, చివరికి సైన్యానికి రాజీనామా చేసి, 1992వ సంll లో ఫుల్లర్ థియోలాజికల్ సెమినరీలో చేరారు.

 అతను సెమినరీలో చదువుతున్నప్పుడు, బర్మాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాలలో సహాయం అందించవలెనని అతనికి ఆహ్వానం అందింది. కాగా, ప్రార్థనాపూర్వకంగా అతను బర్మా చేరుకున్నారు. అక్కడ అంతర్యుద్ధంలో చిక్కుకున్న గిరిజనుల మధ్య అతను పనిచేయడం ప్రారంభించారు. అక్కడ అతను దాడిని ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయము, నిరీక్షణ మరియు ప్రేమను అందించుటకై “ఫ్రీ బర్మా రేంజర్స్” (ఎఫ్.బి.ఆర్.) అనే మిషన్‌ను స్థాపించారు. అనేక ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య అతను తన సహాయక చర్యలను శాంతి సువార్త సందేశమును అందిచుటతో మిళితం చేసి, అనేకమందిని దేవుని యొద్దకు నడిపించారు.

  ప్రస్తుతం ఎఫ్.బి.ఆర్. మిషన్‌ను బర్మా సరిహద్దులు దాటి విస్తరింపజేసిన డేవిడ్, ఇరాక్ మరియు సూడాన్‌ వంటి ఇతర యుద్ధ ప్రాంతాలలో కూడా సేవలందించారు. ఇరాక్‌లో అమెరికా సైన్యం మరియు ఇస్లాం జాతీయ తీవ్రవాదుల మధ్య వివాదంలో చిక్కుకున్న అమాయక కుటుంబాలకు డేవిడ్ మరియు అతని కుటుంబం సేవ చేశారు. యుద్ధ ప్రాంతంలో మరణం సంభవించే అవకాశాలు అధికముగా ఉన్నప్పటికీ, తుపాకీ కాల్పుల మధ్య కూడా ప్రాణాలను కాపాడుతూ, సహాయాన్ని అందిస్తూ, సువార్తతో ప్రజలకు ఆదరణను అందించారు డేవిడ్.

  క్రైస్తవునికి ఉండే ప్రేమ మరియు సైనికునికి ఉండే ధైర్యం ఇతరులు చేయుటకు లెక్కచేయని వాటిని చేయుటకు అతనిని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన గాయాలు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే అపాయల మధ్య ఈ క్రైస్తవ సైనికుడు యుద్ధ ప్రాంతాలలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారని ఎవరైనా అతనిని అడిగినప్పుడు, డేవిడ్ ఇచ్చే సమాధానం “దేవుడు”!

ప్రియమైనవారలారా, మీరు చేస్తున్న పనిలో మీరు నిజమైన క్రైస్తవునిగా ఉన్నారా?

"ప్రభువా, నాకు క్రీస్తు యొక్క ఆత్మను దయచేసి, శాంతిని నెలకొల్పేవానిగా నేను ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment