Pages

Oct 3, 2021

John Flynn | జాన్ ఫ్లిన్

జాన్ ఫ్లిన్  | John Flynn



  • జననం: 25-11-1880
  • మహిమ ప్రవేశం: 05-05-1951
  • జన్మస్థలం: మోలియాగుల్
  • దేశం: ఆస్ట్రేలియా
  • దర్శన స్థలము: ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాలు

 “... మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 25:40). 

 ‘రాయల్ ఫ్లయింగ్ డాక్టర్ సర్వీస్’ అనునది ఆస్ట్రేలియాలో ఎటువంటి వైద్య సేవలు లేదా సమాచార సంబంధాలు గానీ అంతగా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు విమానాల ద్వారా వైద్య సేవలను అందించే ఒక పద్ధతి. దాని ఆవిర్భావమునకు వెనుక ఉన్నది ఎవరు?

 జాన్ ఫ్లిన్ ప్రెస్బిటేరియన్ సంఘ పరిచారకులు. అతను బైబిలు వేదాంతశాస్త్రములో శిక్షణ పొందారు మరియు శిక్షణ పొందుతున్న కాలంలో కొంతమంది ప్రెస్బిటేరియన్ పరిచారకులకు ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాలలో వారు చేస్తున్న మిషనరీ పనిలో సహాయం చేస్తూ వచ్చారు. 1911వ సంll లో నియామక అభిషేకం పొందిన తరువాత అతను దక్షిణ ఆస్ట్రేలియాలోని బెల్టానా దగ్గర ఉన్న ‘స్మిత్ ఆఫ్ డ్యూనెస్క్ మిషన్‌’ లో సేవ చేయుటకు నియమించబడ్డారు. అక్కడ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా అంతర్భూభాగాలలో నివసిస్తున్న ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేవని ఫ్లిన్‌ గ్రహించారు.

 మరుసటి సంవత్సరం అతను ఆస్ట్రేలియా ఉత్తర భూభాగమంతటా పర్యటించి విచారణ చేసి, అక్కడి ప్రజల జీవితాలపై నివేదికలు సిద్ధపరచి, 1912వ సంll లో వాటిని ప్రెస్బిటేరియన్ సంఘమునకు సమర్పించారు. తత్ఫలితంగా, ఆస్ట్రేలియా అంతర్భూభాగములో మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఆధ్యాత్మిక, సామాజిక మరియు వైద్య సేవలను అందించే లక్ష్యముతో ‘ఆస్ట్రేలియన్ ఇన్‌లాండ్ మిషన్’ (ఎ.ఐ.ఎమ్.) స్థాపించబడింది. ఈ నూతన సంస్థకు ఫ్లిన్ నాయకునిగా నియమించబడ్డారు. అతని పర్యవేక్షణలో ఎ.ఐ.ఎమ్. సంస్థ పలు చోట్ల వైద్య సేవలను ఏర్పాటు చేసింది. ఉత్తర ఆస్ట్రేలియాలోని ప్రజల దుస్థితిని మరియు అవసరతలను అందరికీ తెలియపరచుటకు ఫ్లిన్ తన పత్రికయైన ‘ఇన్లాండర్’ ను ఉపయోగించారు. ఒకసారి అతను వ్రాసినదేమనగా “దీని గూర్చి సంచలనం సృష్టించుటకు కాదు పిలుపు... మాకు అవసరమైనది చర్య.”

  1917వ సంll లో, ఫ్లిన్ యొక్క పని నుండి ప్రేరణ పొందినవారిలో ఒకరైన ఆస్ట్రేలియా సైన్యములో పనిచేస్తున్న లెఫ్టినెంట్ క్లిఫోర్డ్ పీల్, మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలను అందించుటకు విమానాలను ఉపయోగించమని సూచిస్తూ ఫ్లిన్‌కు ఒక లేఖ వ్రాశారు. దానిని సాధించుటకు తరువాతి పది సంవత్సరాల పాటు ఫ్లిన్ ఎంతో కృషిచేశారు. చివరికి 1928వ సంll మే మాసంలో, “ఎ.ఐ.ఎమ్. ఏరియల్ మెడికల్ సర్వీస్” (1955వ సంll లో రాయల్ ఫ్లైయింగ్ డాక్టర్ సర్వీస్ (ఆర్.ఎఫ్.డి.ఎస్.) గా మార్చబడింది) ఉనికిలోకి వచ్చింది. అత్యవసర పరిస్థితులలో రోగులు వైద్యుడిని సంప్రదించగలిగేలా మారుమూల ప్రాంతాలకు రేడియో సమాచార సాధనములను ఏర్పాటు చేయుటలో కూడా విజయవంతులయ్యారు ఫ్లిన్. ప్రారంభించబడిన మొదటి సంవత్సరంలో 26 ప్రాంతాలలో 225 మంది రోగులు ఈ సేవ ద్వారా చికిత్స పొందారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా యొక్క 3 వ అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఆర్.ఎఫ్.డి.ఎస్., ప్రతి ఏటా 3,50,000 పైగా రోగులకు చికిత్సనందిస్తుంది.

  తన చివరి శ్వాస వరకు నిర్విరామంగా పనిచేసిన జాన్ ఫ్లిన్, 1951వ సంll లో క్యాన్సర్‌తో మరణించారు.

ప్రియమైనవారలారా, అవసరతలలో ఉన్న వారి పట్ల మీరు పలుకుతున్న దయగల మాటలు 
క్రియలుగా మారుతున్నాయా?

"ప్రభువా, అవసరతను చూచినపుడు క్రియారూపకముగా ఎలా సహాయమందింవలెనో నాకు నేర్పుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment