Pages

Oct 26, 2021

Liang A-Fa | లియాంగ్ ఎ-ఫా

లియాంగ్ ఎ-ఫా |  Liang A-Fa


  • జననం: 1789
  • మహిమ ప్రవేశం: 1855
  • స్వస్థలం: గులావో
  • దేశం: చైనా
  • దర్శన స్థలము: చైనా; మలేషియా

 సువార్తికుడైన లియాంగ్ ఎ-ఫా బహుశా అధికారికంగా నియామక అభిషేకం పొందిన మొదటి చైనీయుడు. అతను చైనా మరియు మలేషియాలోని కొన్ని ప్రాంతాలలో తాను చేసిన పరిచర్యకు ప్రసిద్ధి చెందారు. చైనాలో బలమైన విగ్రహారాధికులైన ఒక కుటుంబములో జన్మించిన లియాంగ్ చైనావారి సాంప్రదాయక విద్యాభ్యాసమును అభ్యసించారు. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన అతను అచ్చువేసేవానిగా ఉద్యోగం చేపట్టవలసి వచ్చింది. ఆ సమయంలోనే అతను చైనాలో స్కాట్లాండుకు చెందిన మిషనరీ అయిన రాబర్ట్ మోరిసన్‌ను కలవడం జరిగింది.

లియాంగ్ క్రైస్తవ మతంలోకి మారడం దేవుని వాక్యం సజీవమైనది మరియు క్రియ చేయగలదు అనుదానికి ఒక ఋజువు. అచ్చువేసేవాడైన అతనిని మోరిసన్ బైబిలు ముద్రించడంలో అతనికి సహాయం చేయుటకు ఉద్యోగమిచ్చి నియమించుకున్నారు. అంతేకాకుండా, చైనా భాషలో లియాంగ్ కలిగియున్న నైపుణ్యాలు కూడా బైబిలు అనువాదాలలో మోరిసన్‌కు సహాయపడ్డాయి. అయితే, చైనా భాషలో బైబిళ్ళను ముద్రించడం చైనా భూభాగంలో నిషేధించబడినందున, మోరిసన్ అతనిని మలక్కాలో సేవ చేస్తున్న బ్రిటిష్ మిషనరీ అయిన విలియం మిల్నే వద్దకు పంపారు. మిల్నే మరియు మోరిసన్‌లు అతనితో సంభాషిస్తూ అతనికి ఆలోచనలను, సలహాలు ఇస్తున్నప్పటికీ, లియాంగ్ తన జీవితంలో సువార్తకు ఏమాత్రం చోటివ్వక, కేవలం ధన సంపాదన కొరకు మాత్రమే వారి యొద్ద పనిచేశారు. అయితే, బైబిలు ముద్రించుటకు అతను అక్షరాలు చెక్కివున్న చెక్క దిమ్మెలను సిద్ధపరుస్తున్నప్పుడు దేవుని వాక్యం క్రమంగా అతని హృదయమును కరిగించడం ప్రారంభించింది. అతను ముద్రించే కొద్దీ దేవుని ప్రేమను మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నారు. చివరికి, 1816వ సంll లో వేచియున్న ఆ దినం రానే వచ్చింది. ఆ రోజున అతను మిల్నే వద్దకు వెళ్ళి తనకు బాప్తిస్మము ఇవ్వవలసినదిగా కోరారు.

నూతన ఆనందసంతోషములతో సువార్త కరపత్రాలను చేతబట్టుకొని తన స్వగ్రామానికి చేరుకున్నారు లియాంగ్. అయితే, అధికారులు అతనిని పట్టుకుని అతని వద్దనున్న కరపత్రాలన్నింటినీ తగులబెట్టారు. అతను తీవ్రముగా హింసించబడి, నలభై రోజుల పాటు చెరసాలలో బంధించబడ్డారు. కానీ, శ్రమల మధ్య కూడా లియాంగ్‌లో ఉప్పొంగుతున్న సంతోషము చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతని భార్యతో సహా అతని గ్రామస్థులు కొందరు క్రీస్తును అంగీకరించారు.

లియాంగ్ ఎక్కువగా తన పరిచర్యను మలక్కా మరియు మకావో ప్రాంతాలలో జరిగించారు. ఒక వైద్య మిషనరీ అయిన పీటర్ పార్కర్‌తో కలిసి పనిచేసిన అతను, పార్కర్‌ యొక్క ఆసుపత్రిలో ప్రార్థనాలయ నాయకునిగా (చాప్లైన్‌) పనిచేశారు. అనారోగ్యం అనేది మనుష్యుల హృదయములను మృదువు పరచుటకు దేవుడు ఏర్పరచిన ఒక మార్గమని విశ్వసించిన అతను, సువార్తను పంచుకొనుటకు రోగులను సందర్శించే అవకాశములను ఎన్నడూ జారవిడువలేదు. ప్రత్యేకముగా చైనావారి సంస్కృతికి తగిన విధముగా విశదీకరించబడిన అతని సువార్త కరపత్రాలకు కూడా లియాంగ్ పేరుగాంచారు. అతను మరణించిన 160 సంవత్సరాల తర్వాత కూడా అతను వ్రాసిన పుస్తకాలు మరియు వ్యాసాలు ఈ నాటికీ చైనీయులను దేవుని వైపుకు నడిపించే బలమైన సాధనాలుగా ఉన్నాయి.

ప్రియమైనవారలారా, మీరు రోగులను సందర్శించి, వారితో సువార్తను పంచుకుంటున్నారా?

"ప్రభువా, ప్రజల యొక్క శారీరక మరియు ఆత్మీయ గాయాలను కట్టే మంచి సమరయునిగా ఉండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment