Pages

Oct 28, 2021

Rebecca Protten | రెబెకా ప్రోటెన్

రెబెకా ప్రోటెన్ | Rebecca Protten 




  • జననం: 1718
  • మహిమ ప్రవేశం: 1780
  • స్వదేశం: ఆంటిగ్వా
  • దర్శన స్థలము: కరేబియన్ దీవులు; జర్మనీ; ఘనా

 'మదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్' (ఆధునిక మిషన్లకు తల్లి) అని పిలువబడుతారు రెబెకా ప్రోటెన్. ఒకప్పుడు ఒక బానిసగా ఉన్న ఆమెను దేవుడు తన మహిమ కొరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో బలముగా వాడుకున్నాడు. తనకు కేవలం ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె ఆంటిగ్వా నుండి అపహరించబడి, సెయింట్ థామస్ దీవులలోని ఒక తోట యజమానికి బానిసగా విక్రయించబడ్డారు. తన యజమాని గృహములో ఆమె క్రైస్తవ నీతినియమాలను గురించి నేర్చుకున్నారు. ఆమెకు పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమె యొక్క యజమాని మరణించగా ఆమె బానిస బ్రతుకు నుండి విముక్తిని పొందారు.

ఆమె ఒక క్రైస్తవురాలిగా బాప్తిస్మము పొందినప్పటికీ, సెయింట్ థామస్‌కు మొరావియన్ మిషనరీలు వచ్చే సమయం వరకు కూడా ఆమె తన యవ్వనంలో క్రైస్తవ సంఘ కార్యకలాపాలపై ఎటువంటి ఆసక్తి చూపలేదు. ఈ మిషనరీలు ఇతర శ్వేతజాతీయుల వలె కౄరమైనవారు కారు. వారి పరిచర్యలో చేరిన రెబెకా, తదుపరి తాను కూడా ఒక మిషనరీ కావాలని కోరుకున్నారు.

సెయింట్ థామస్‌లోని మిషనరీ పరిచర్యలో రెబెకా ఒక ముఖ్యమైన భాగమయ్యారు. బానిసల సమాజాలను చేరుకొనుటకు ఆమె ప్రతి దినమూ పర్వత మార్గాలలో అనేక మైళ్ళు నడిచి వెళ్ళి, వారికి, మరి ముఖ్యముగా స్త్రీలకు సువార్తను బోధించేవారు. ఆమె వారి శారీరక గాయాలను కట్టుటయే కాకుండా వారి హృదయాలను కూడా ఆదరించారు. డచ్, జర్మన్ మరియు క్రియోల్ భాషలను బాగుగా ఎరిగియున్న ఆమె, స్థానికుల కొరకు బైబిలు పఠనాలను నిర్వహించేవారు. ఆమె పరిచర్య ద్వారా అనేక మంది క్రీస్తు పాదాల చెంతకు నడిపించబడ్డారు మరియు ఆ ద్వీపంలోని మహిళలకు రెబెకా ఒక మాదిరిగా మారారు. బానిసలపై ఆమె చూపుతున్న ప్రభావమును గ్రహించి అప్రమత్తమైన బానిసల యజమానులు బానిసలు తిరుగుబాటు చేస్తారేమోయని భయపడినవారై, దొంగతనం మరియు దేవదూషణ వంటి తప్పుడు ఆరోపణలతో ఆమెను అరెస్టు చేయించారు. ఆమె ఏడుమార్లు న్యాయస్థానమునకు తీసుకురాబడగా, వచ్చిన ప్రతిసారీ ఆమె దానిని క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుటకు ఒక అవకాశముగా ఉపయోగించుకున్నారు. 

జైలు నుండి విడుదలైన తరువాత, ఆమె సెయింట్ థామస్ వదిలి వెళ్ళులాగున అధికారులు ఆమెను బలవంతం చేశారు. కావున, ఆమె అప్పటిలో మొరావియన్ సంఘము యొక్క ప్రధాన కార్యాలయముగా ఉన్న జర్మనీలోని హెర్న్‌హట్‌ ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఆమె స్త్రీల పరిచర్యకు నాయకత్వం వహించారు. తరువాత 1765వ సంll లో ఆమె తన భర్తతో కలిసి ఘనాలోని అక్రా అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఈ దంపతులు డచ్ మిషనరీ పాఠశాలలో బోధించారు మరియు గోల్డ్ కోస్ట్ అంతటా అనేక మిషన్ కేంద్రాలను స్థాపించారు. తన దేహం ఆఫ్రికా యొక్క వాతావరణానికి అలవాటు పడలేక పోయినప్పటికీ, 1780వ సంll లో తాను మరణించే వరకు కూడా అనారోగ్యం మరియు శారీరక బాధను అనుభవిస్తూనే దేవుని సేవలో ముందుకు సాగిపోయారు రెబెకా ప్రోటెన్.

ప్రియమైనవారలారా, ఇప్పుడు మీరు ఏమాత్రం పాపమునకు బానిసలు కారు, ఇతరుల ఆత్మీయ స్వాతంత్ర్యం కొరకు మీరు పని చేస్తున్నారా?

"ప్రభువా, ఇతరుల ఆత్మీయపరమైన స్వేచ్ఛకు నేను బాధ్యత వహించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment