Pages

Oct 1, 2021

Sarah Hall | శారా హాల్

శారా హాల్  | Sarah Hall 


  • జననం: 1803
  • మహిమ ప్రవేశం: 1845
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: బర్మా


శారా హాల్ 13 మంది పిల్లలలో జ్యేష్ఠురాలు. మంచి జ్ఞానవంతురాలైన ఆమె, నాలుగేళ్ల వయసులోనే ఏది ఇచ్చినా చదవగలిగేవారు. చాలా చిన్న వయస్సు నుండే తనకు మిషనరీ సేవ కొరకైన పిలుపు ఉన్నట్లు ఆమె భావించారు. జార్జ్ బోర్డ్‌మన్‌తో ఆమెకు వివాహం జరిగినప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఈ దంపతులు 1825వ సంll లో బర్మాకు పయనమయ్యారు. అయితే, అప్పటికి బ్రిటిష్-బర్మీస్ యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున వారు కొంతకాలం భారతదేశంలో ఉండవలసి వచ్చింది.


భారతదేశంలో ఉన్నప్పుడు వారు భాషను అధ్యయనం చేయడంలో సమయమును సద్వినియోగపరచుకున్నారు. అక్కడ జన్మించిన వారి మొదటి కుమారుడు అక్కడే మరణించి, భూస్థాపనం చేయబడ్డాడు. చివరకు 1827వ సంll లో వారు బర్మాకు వెళ్ళగలిగారు. అక్కడ మొదటిగా అమ్హెర్స్ట్‌లో వారు తమ మిషన్‌ను స్థాపించారు. తదుపరి దానిని మౌల్‌మైన్‌కు తరలించగా, అక్కడ వారికి ‘కరెన్’ అనే గిరిజన తెగవారితో పరిచయమేర్పడింది. సామాన్యమైన చిన్నపాటి వ్యవసాయదారులైన ఈ తెగ ప్రజలు దేవుని వాక్యమును వినుటకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారు. వారిలో అనేక మంది యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసించారు. ఒక వ్యక్తి జీవితమైతే ఒక ప్రత్యేక ఆశీర్వాదమని చెప్పవచ్చు. అతను ఒక పేరొందిన నేరస్థుడు. 30కి పైగా హత్యలు చేసినట్లు అంగీకరించినవాడు. కానీ, అతను యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దేవునికి బలమైన సాక్ష్యముగా అతను నిలిచాడు. అంతేకాదు, ఒక మంచి సువార్తికుడయ్యాడు.


బోర్డ్‌మన్ దంపతులు తరువాత టావోయ్‌కు వెళ్ళగా, అక్కడ బోర్డ్‌మన్ యొక్క ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అంతేకాక, ఆ దంపతులు తమ రెండవ బిడ్డను కూడా కోల్పోయారు. కష్టాలలోనైనా, సంతోషంలోనైనా వారు ఆత్మలను రక్షించవలెననిన గొప్ప లక్ష్యము పైనే గురియుంచి సమర్పణతో శ్రమించారు. బోర్డ్‌మన్ దంపతులు నిజమైన మార్గదర్శకులైన మిషనరీలు. వారు కాలినడకన పర్వత ప్రాంతాలలో విస్తృతంగా ప్రయాణించి అక్కడి ఆదివాసీలకు సువార్తను అందించారు. వారు అనేక లేఖన భాగములను అనువదించారు. శారా అనేక పాఠశాలలను ప్రారంభించి, వాటి ద్వారా బైబిలును బోధించారు. పిల్లల కారణంగా ఆమె మిషనరీ పనిలో ఎక్కువ సమయం గడపలేకపోయినప్పుడు ఆమె పాటలను వ్రాశారు. అన్యదేవతలను పూజించే మరొక తెగ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆమె వారి భాషను నేర్చుకొని, క్రైస్తవ రచనలను ఆ భాషలోకి అనువదించారు. 1845వ సంll లో తాను మహిమనందు ప్రవేశించు వరకు కూడా క్రీస్తు కొరకు శ్రమించి, ఎంతో సాధించిన ఒక అద్భుతమైన స్త్రీ శారా హాల్.


ప్రియమైనవారలారా, ఈ భూమిపై దేవుని రాజ్యమును విస్తరింపజేయుటకు మీరు మీ తలాంతులను ఉపయోగిస్తున్నారా?

 "ప్రభువా, ఎటువంటి పరిస్థితులలోనైనా నేను మీకు సేవ చేయగలుగునట్లు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!" 

 దేవునికే మహిమ కలుగునుగాక! 

No comments:

Post a Comment