Pages

Nov 17, 2021

Archibald Reekie | ఆర్చుబాల్డ్ రీకీ

ఆర్చుబాల్డ్ రీకీ గారి జీవిత చరిత్ర




  • జననం: 1862
  • మహిమ ప్రవేశం: 1942
  • స్వస్థలం: ఆర్మో
  • దేశం: కెనడా
  • దర్శన స్థలము: బొలీవియా

 కెనడాకు చెందిన ఆర్చుబాల్డ్ రీకీ బొలీవియాలో తన పరిచర్యకు ప్రసిద్ధి చెందిన ఒక మార్గదర్శక మిషనరీ. నిరుపేద కుటుంబములో పుట్టిన అతను, తన బాల్యములో పంట పొలాలలో పనివానిగా పనిచేశారు. శారీరకంగా బలహీనముగా ఉండే రీకీ, తన యవ్వనప్రాయంలో జ్వరం బారిన పడి దాదాపు మరణించినంత అనుభవం గుండా వెళ్ళారు. అయితే, మన బలహీనతయందు తన శక్తి పరిపూర్ణమగుచున్నదని సెలవిచ్చుచున్న మన దేవుడు కొన్ని కఠినమైన వాతావరణ పరిస్థితులలో ఆర్చుబాల్డ్‌ను తన సేవ కొరకు వాడుకున్నాడు.

 వారి సంఘ పాదిరి యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో, దేవుడు తనను మిషనరీ సేవ చేయుటకు పిలుచుచున్నట్లు గ్రహించారు రీకీ. కాగా అతను బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించుటకు టొరంటోలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలో చేరగా, అక్కడ బొలీవియాలో మిషనరీ పని యొక్క ఆవశ్యకత గురించి వినడం జరిగింది. తనకు ఎటువంటి ధన సహాయము లేనప్పటికీ, వేసవి సెలవులలో బొలీవియాను సందర్శించాలని నిర్ణయించుకున్నారు రీకీ. కాగా 1896వ సంll లో తన ప్రయాణమును ప్రారంభించిన అతను, మహాసముద్రాలను దాటుకుంటూ వెళ్ళారు; పనామా యొక్క భయంకరమైన వేడిని భరించారు; పెరులోని మంచుతో కప్పబడిన పర్వతాలను దాటారు; చివరకు బొలీవియాలోని లా పాజ్ నగరమును చేరుకున్నారు. అక్కడి స్థానిక భాషలలో ఒకటైన స్పానిష్ భాష అతనికి తెలియక పోయినప్పటికీ, అతను అక్కడ కరపత్రాలను పంచిపెడుతూ, బైబిళ్లను విక్రయించారు. ఒంటరిగా అతను చేసిన ఈ ప్రయాణంలో అతను ప్రాణాలతో క్షేమముగా ఉండడం అనేది అతని విషయంలో ఒక అద్భుతమే! కాగా బొలీవియాలో మిషనరీ సేవ కొరకైన తన పిలుపును ధృవీకరించుకొనుటకు రీకీకి వేరే ఆనవాలు అవసరం లేకుండా పోయింది.

 లా పాజ్‌లో అతని యొక్క ఆ చిన్న అనుభవం త్వరలోనే మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలోని అనేక విద్యార్థులకు ప్రేరణగా మారింది. ఒప్పించుటకు అతను ఎంతో తీవ్రముగా ప్రయత్నించిన తరువాత, 1897వ సంll లో ‘బాప్టిస్ట్ కన్వెన్షన్ ఆఫ్ ఓంటారియో’ సంస్థవారు రీకీ యొక్క బొలీవియా మిషనుకు తమ మద్దతును తెలియపరిచారు.

 1898వ సంll లో బొలీవియా నగరమైన ఒరురోకు వచ్చిన రీకీ, అక్కడ ఒక మిషన్ కేంద్రమును ఏర్పాటు చేశారు. అక్కడికి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికుల మధ్య అతను సేవ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా, ఒక పాఠశాలను కూడా నిర్వహించారు. త్వరలోనే క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించగలిగారు రీకీ. పైగా ధైర్యసాహసాలతో కూడుకొనిన అతని కథ అనేక మంది బాప్తిస్టు మిషనరీలను ప్రేరేపించినధై, వారు బొలీవియాకు వచ్చుటకు కారణమైంది. తత్ఫలితముగా పరిచర్య మరింతగా అభివృద్ధి చెంది ఫలభరితమైంది!

 విశ్వాసము పైనే ఆధారపడి తన పరిచర్యను జరిగించారు రీకీ. మిషన్ ఎంతో విజయవంతం అయినప్పటికీ మరియు నిధులు ప్రవాహము వలె వచ్చినప్పటికీ, అతను దీనత్వముతో మట్టి నేలను కలిగియున్న కుటీరంలో ఉండుటకే మొగ్గుచూపారు. పరిచర్య కాలంలో, అతను తన మొదటి బిడ్డను అంగుడువాపు (డిఫ్తీరియా) వ్యాధి కారణంగా కోల్పోవడం జరిగింది మరియు అతను కూడా తన భార్యతో పాటు కఠినమైన వాతావరణం కారణంగా అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ, అన్నింటినీ ఓర్చుకొనిన అతను ఏనాడూ వెనుకంజ వేయలేదు. అయితే, తీవ్రమైన అనారోగ్యం కారణంగా 1916వ సంll లో అతను కెనడాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తన మరణం వరకు కూడా ఓంటారియోలోని అనేక గ్రామాలలో క్రైస్తవ సంఘాలకు పాదిరిగా సేవలందిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయిన ఆర్చుబాల్డ్ రీకీ, 1942వ సంll లో కన్నుమూశారు. 

ప్రియమైనవారలారా, మీ బలహీన సమయములయందు దేవుని శక్తి పరిపూర్ణమగుటను మీరు అనుభవించుచున్నారా?

ప్రభువా, మీ కొరకు మరియు కేవలం మీ మహిమ కొరకు మీ శక్తితో నేను సమస్తమునూ చేయగలుగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment