Pages

Nov 23, 2021

Robert Cotton Mather | రాబర్ట్ కాటన్ మాథర్

రాబర్ట్ కాటన్ మాథర్ గారి జీవిత చరిత్ర





  • జననం: 08-11-1808
  • మహిమ ప్రవేశం: 21-04-1877
  • జన్మస్థలం: న్యూ విండ్సర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


 ఐరోపావాడైన రాబర్ట్ కాటన్ మాథర్ ఉత్తర భారతదేశంలో తాను చేసిన పరిచర్యకును మరియు ఉర్దూ బైబిలు అనువాదమును సవరించినందుకును ప్రసిద్ధి చెందిన ఒక మిషనరీ. గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసమును పూర్తిచేసుకొనిన అతను, యార్క్‌లోని కాంగ్రిగేషనల్ చర్చిలో సేవ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో అతను లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) అనే సంస్థ ద్వారా భారతదేశంలోని వారణాసిలో (బనారస్‌) సేవ చేయుటకు అవకాశాన్ని పొందారు. ఎలిజబెత్ సెవెల్‌తో తనకు వివాహం జరిగిన ఒక వారంలోపే 1833వ సంll జూన్ మాసంలో భారతదేశానికి బయలుదేరారు మాథర్.

 కలకత్తాలోని యూనియన్ చాపల్‌లో కొన్ని నెలలు పరిచర్య చేసిన పిమ్మట మాథర్ 1834వ సంll లో వారణాసికి వెళ్ళారు. అక్కడ నాలుగు సంవత్సరాలు పరిచర్య చేసిన అతను, హిందుస్థానీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 1838వ సంll లో అతను మీర్జాపూర్‌లో క్రొత్త మిషన్ కేంద్రమును స్థాపించారు. అతని శరీరం వేడిగా ఉండే భారతదేశము యొక్క వాతావరణానికి అలవాటు పడలేక పోయినప్పటికీ, అతను ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలలో తీవ్రముగా సంచరించి పరిచర్య చేశారు. అతను క్రీస్తు కొరకు మీర్జా జాన్ మరియు జాన్ హుస్సేన్ అనే ఇద్దరు ఇస్లామీయుల ఆత్మలను సంపాదించగా, వారు అతనితో పాటు అద్భుతమైన సువార్త పరిచర్యను చేశారు.

 హిందుస్థానీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన అతని భార్య ఎలిజబెత్ కూడా మంచి సహకారం అందించడంతో రచనల ద్వారా పరిచర్య చేయవలెనని తలపెట్టారు మాథర్. కాగా ఒక ప్రాంతీయ వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించిన అతను, సువార్తను గూర్చిన చర్చల కొరకు ఒక మాధ్యమంగా దానిని సమర్థవంతంగా ఉపయోగించారు. ఆ వార్తాపత్రిక ద్వారా జరిగిన పరిచర్య ఎంతగానో విజయవంతమవ్వడంతో, అది ఉర్దూ బైబిలు అనువాదమును సవరించుటకు అతనిని ప్రేరేపించింది. అందుకుగాను లేఖనములను గ్రీకు నుండి నేరుగా ఉర్దూకు అనువదించవలెనని అతను గ్రీకు భాషను కూడా నేర్చుకున్నారు. 1860వ సంll నాటికి అతను ఉర్దూ మరియు హిందుస్థానీ బైబిలు అనువాదాలను పూర్తిగా సవరించారు. హిందీ భాషలో క్రొత్త నిబంధనపై అతను వ్రాసిన వ్యాఖ్యానం ఈ నాటికీ ఉపయోగించబడుతుంది.

  మీర్జాపూర్‌లో పాఠశాలలు, క్రైస్తవాలయాలు, అనాథాశ్రమాలు మరియు ముద్రణాలయమును కూడా నిర్మించారు మాథర్. ఎంతో చురుకుగా అతని భార్య ఎలిజబెత్ బయటికి వచ్చుటకు అనుమతించబక ఇళ్ళల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలను వారి గృహములలో దర్శించి వారికి విద్యను అందించారు. 1870వ దశకం ప్రారంభంలో మాథర్ ఎంతో బలహీనపడినప్పటికీ, పరిచర్య కొనసాగింపబడునట్లు యువకులైన సహపరిచారకులకు శిక్షణనివ్వవలెనని భారతదేశంలోనే ఉన్నారు. తదుపరి 1873వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిన అతను, 1877వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా రచనల ద్వారా పరిచర్యను కొనసాగించారు. అయితే, 1878వ సంll లో మాథర్ యొక్క భార్య ఎలిజబెత్ తనకు ప్రియమైన మీర్జాపూర్‌కు తిరిగి వచ్చి, 1879వ సంll లో తాను పరమవాసమును చేరుకొనే వరకు కూడా తన పరిచర్యను కొనసాగించారు.


ప్రియమైనవారలారా, దేవుని పని చేయ సమర్థులగునట్లు మీరు దేవుని ప్రజలను సిద్ధపరచుచున్నారా?

"ప్రభువా, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నీవే నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నావు. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment