Pages

Feb 12, 2022

Helen Roseveare Life History

హెలెన్ రోజ్‌వేర్ జీవిత చరిత్ర





  • జననం: 21-09-1925
  • మహిమ ప్రవేశం: 07-12-2016
  • స్వస్థలం: హెర్ట్‌ఫోర్డ్‌షైర్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: ఆఫ్రికా

 కాంగో దేశ చరిత్రలో ఒక గొప్ప అంతర్యుద్ధం నెలకొన్న సమయంలో హెలెన్ రోజ్‌వేర్ ఒక వైద్య మిషనరీగా అక్కడికి వెళ్ళి సేవలందించారు. ఒకసారి వారి సండే స్కూలు ఉపాధ్యాయురాలు భారతదేశం గురించి వారికి చెప్పినప్పుడు ఆ చిన్న వయస్సులోనే మిషనరీ అవ్వాలనే కోరిక ఆమెలో తలెత్తింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అక్కడ విద్యార్థుల కొరకు ఏర్పరచబడిన ఒక కూడికలో ఆమె యేసు క్రీస్తును అంగీకరించారు. ఆ కూడికల చివరి రోజున ఆమె తన సాక్ష్యాన్ని పంచుకొనగా, గ్రాహం స్క్రోగ్గీ అనే వాక్య ఉపదేశకులు ఆమె యొక్క క్రొత్త బైబిలులో ఫిలిప్పి 3:10వ వచనమును వ్రాసి, "ఈ రాత్రి నీవు ఈ వచనము యొక్క మొదటి భాగమైన 'ఆయనను ఎరుగు నిమిత్తము' అనే ఘట్టంలోనికి ప్రవేశిస్తున్నావు. అయితే నీవు ఈ వచనంలో ఇంకా ముందుకు సాగి 'ఆయన పునరుత్థానబలమును' మరియు 'ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తము' అనే అనుభవములలో కూడా ప్రవేశింపవలెనని నిన్ను గూర్చిన నా ప్రార్థన." అని చెప్పారు. తదుపరి ఆమెలో మిషనరీ సేవకైన పిలుపును గూర్చి మిగుల భారం ఏర్పడటంతో ఒకసారి దేవునితో "నన్ను క్రీస్తువలె చేయుము, అందుకొరకు ఎంతటి క్రయము చెల్లించుటకైనా సిద్ధమే" అని చెప్పారు.

 1953వ సంllలో ఈశాన్య కాంగోలోకి అడుగుపెట్టిన 28 సంllల హెలెన్ అక్కడ ఒక వైద్యశాలను మరియు నర్సుల కొరకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తరువాత 1955వ సంllలో నెబోబోంగోలోని విడిచిపెట్టబడిన ఒక ప్రసూతి మరియు కుష్ఠు వ్యాధి కేంద్రానికి ఆమె బదిలీ చేయబడగా, ఆమె ఆ కుష్ఠు రోగుల కేంద్రాన్ని ఒక వైద్యశాలగా అభివృద్ధిపరిచారు. బైబిలు గ్రంథములో వైద్యునిగా పేర్కొనబడిన లూకాను బట్టి ఆమె 'మామా లూకా' (లూకా అమ్మ) అని పిలువబడ్డారు. 

 కాంగో స్వాతంత్య్రం పొందిన తరువాత, 1964వ సంllలో అక్కడ ఒక అంతర్యుద్ధం విజృంభించింది. ఆ సమయంలో హెలెన్ చెరసాలలో వేయబడి కౄరంగా కొట్టబడటమే కాకుండా దారుణమైన అత్యాచారానికి కూడా గురయ్యారు. ఐదు నెలల తర్వాత విడుదల పొందిన ఆమె అతి త్వరలోనే లైంగిక వేధింపులకు గురైన అవమానాన్ని అధిగమించారు. పైగా, ఆమె తన యొక్క అనుభవాలను అటువంటి పరిస్థితుల గుండా వచ్చిన వారిని ప్రోత్సహించుటకు ఉపయోగించారు. ఆమె చేసిన పరిచర్య ద్వారా అనేకులు శారీరక, మానసిక మరియు ఆత్మీయ స్వస్థతను పొందుకున్నారు.

1966వ సంllలో తిరిగి కాంగోకు వచ్చిన హెలెన్ 1973వ సంll వరకు అక్కడ సేవలందించారు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిన తరువాత తన మిగిలిన జీవితాన్ని ఒక మిషనరీ ఆలోచనకర్తగా సేవలందిస్తూ గడిపిన ఆమె అనేక పుస్తకాలను కూడా రచించారు. కల్వరి సిలువలోని గొప్ప త్యాగానికి ముందు తన శ్రమలు ఎన్నతగినవి కావని భావించిన హెలెన్ రోజ్‌వేర్ క్రీస్తు యొక్క శ్రమలలో కొంచెమైనా పాలిభాగస్థురాలవటం ఒక గొప్ప భాగ్యముగా ఎంచారు.

ప్రియమైనవారలారా, క్రీస్తు నిమిత్తమై శ్రమలను అనుభవించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

ప్రభువా, క్రీస్తు శ్రమలలో పాలుపంచుకునే భాగ్యాన్ని అపేక్షించులాగున నన్ను సిద్ధపరచుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment