Pages

Feb 2, 2022

Lizzie Johnson Life History

లిజ్జీ జాన్సన్ గారి జీవిత చరిత్ర






  • జననం: 1869
  • మహిమ ప్రవేశం: 14-09-1909
  • స్వస్థలం: కేసీ
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

“...బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” (1 కొరింథీ 1:27). ఈ వచనం లిజ్జీ లారా జాన్సన్ యొక్క జీవితంలో ఎంతో నిజమైనది. పదమూడు సంవత్సరాల వయస్సులో లిజ్జీకి వెన్ను గాయం ఏర్పడగా, అది క్రమంగా తీవ్రమవుతూ, చివరికి ఆమెను పూర్తిగా కదలలేని స్థితికి తీసుకువచ్చింది. ఆ గాయం ఆమె వెన్నుపాము పై తీవ్ర ప్రభావమును చూపగా ఆమె జీవితం ఎంతో బాధాకరంగా మారింది. ఒక్కోసారి చిన్నపాటి శబ్దం కూడా ఆమెకు చాలా బాధను, నొప్పిని కలిగించేది.

అటువంటి కఠినమైన పరిస్థితిని కలిగియున్నప్పటికీ, ఆమె ఎప్పుడూ ఇతరుల సానుభూతిని కోరుకోలేదు మరియు తన అనారోగ్యం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆమె మాట్లాడటానికి ఎంతగానో ఇష్టపడే ఒక విషయం ఏమంటే మిషనరీ సేవ. 1885వ సంll లో ఆమె తండ్రి ఆఫ్రికాలోని విలియం టేలర్ యొక్క మిషనరీ కథను చదివి వినిపించినప్పుడు ఆమెకు మిషన్లపై ఆసక్తి ఏర్పడింది. చీకటి ఖండంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆమె ప్రగాఢమైన కోరిక. అయితే నిజమైన స్థితి ఏమిటంటే ఆమె తన మంచం మీద నుండి కదలటమే ఎంతో కష్టతరం.

ప్రేమ ఎల్లప్పుడూ తన వ్యక్తీకరణకు మాధ్యమాన్ని కనుగొంటుంది. అదేవిధంగా నశించుచున్న ఆత్మల పట్ల లిజ్జీకి ఉన్న ప్రేమ కూడా ఒక మార్గమును కనుగొంది! తన చేతులను మాత్రమే కదిలించగల పరిస్థితి ఆమెది. కాగా ఆమె వాటినే దేవుని కొరకు ఉపయోగించడం ప్రారంభించారు. ఒక వైపు శారీరక బాధను భరిస్తూనే ఆరునెలల పాటు ఆమె మెత్తని బొంత కుట్టడం ప్రారంభించారు. దానిని అమ్మి, వచ్చిన  డబ్బును మిషనరీ పనికి ఇవ్వాలని ఆమె భావించారు. కానీ దానిని ఎవరూ కొనలేదు. కొంచెం నిరుత్సాహానికి గురైనప్పటికీ, తిరిగి ఆమె ఆదరణనిచ్చే బైబిలు వచనాలు వ్రాయబడియున్న సిల్క్ పుటసూచీలను (సిల్క్ బుక్‌మార్క్‌లు) తయారు చేయడం ప్రారంభించారు. ఆమె వాటిని ఒక్కొక్కటి పదిహేను సెంట్లకు (ఒక సెంటు ఇంచుమించు డెబ్బై ఒక్క పైసలు) అమ్మి, వచ్చిన మొత్తాన్ని మిషనరీ పనికి కానుకగా ఇచ్చారు. ఆమె హృదయపూర్వక ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించారు. ఆమె తయారుచేసిన పుటసూచీలు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయి.

భారతదేశానికి వచ్చిన ఒక మిషనరీయైన ఫ్రాన్సిస్ వార్న్ లిజ్జీ యొక్క ప్రయత్నాల గురించి విని, ఆమె కుట్టిన ఆ మెత్తని బొంతను అరువు తెచ్చుకుని, దానితో ప్రపంచమంతటా తిరిగి ఆమె కథను అందరికీ తెలియజేశారు. తద్వారా అతను మిషనరీ పని కొరకు ఒక మిలియన్ డాలర్ల (పది లక్షల డాలర్లు) నిధిని సేకరించగలిగారు. అంతకంటే ముఖ్యంగా అది చాలా మంది భవిష్యత్ మిషనరీలను ప్రేరేపించింది. సేకరించిన నిధులలో కొంత భాగం భారతదేశంలోని కాన్పూర్‌లో ఒక మెథడిస్టు క్రైస్తవాలయమును నిర్మించుటకు ఉపయోగించబడింది. ఆ ఆలయం నేటికీ నిలిచియుంది.

1909వ సంll సెప్టెంబరు 14న ఈ లోకములో తన జీవితయాత్ర ముగియబోతుందని గ్రహించిన లిజ్జీ జాన్సన్, “ఓ ఎంత మధురం, ఎంత మధురం!” అని పలికి ఎటువంటి ప్రయాస కానీ కష్టం కానీ లేకుండా క్రీస్తునందు నిద్రించారు.

ప్రియమైనవారలారా, దేవుడు మీకు సంపూర్ణమైన మంచి శరీర భాగాలను ఇచ్చాడు. వాటిని మీరు మిషనరీ పని కొరకు ఉపయోగిస్తున్నారా?

ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నప్పటికీ నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనములు. ఆరోగ్యమైనా అనారోగ్యమైనా మీ కొరకు పని చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment