షి మేయు జీవిత చరిత్ర
- జననం: 01-05-1873
- మహిమ ప్రవేశం: 30-12-1954
- స్వస్థలం: జియుజియాంగ్
- దేశం: చైనా
- దర్శన స్థలము: చైనా
మేరీ స్టోన్ అని కూడా పిలువబడే షి మేయు చైనాలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక మెథడిస్టు పాదిరిగారు మరియు ఆమె తల్లి ఒక క్రైస్తవ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్. అమెరికాకు చెందిన ఒక వైద్య మిషనరీయైన డాll కాథరిన్ బుష్నెల్ యొక్క సేవను చూసి ఆకర్షితులైన మేయు యొక్క తండ్రి, మేయు కూడా ఒక వైద్యురాలు కావాలని కోరుకున్నారు. ఆ అవకాశం మేయు యొక్క పాఠశాల ఉపాధ్యాయురాలు గెర్ట్రూడ్ హోవే ద్వారా లభించింది. ఏలయనగా అమెరికాకు చెందిన మిషనరీయైన గెర్ట్రూడ్ తన యొక్క ఉత్తమ విద్యార్థులలో ఐదుగురిని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకొనగా, ఆ ఐదుగురిలో షి మేయు మరియు ఆమె స్నేహితురాలు కాంగ్ చెంగ్ ఉన్నారు. ఒక అమెరికా విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టా పొందిన మొదటి ఇద్దరు చైనా మహిళలు వీరు.
1896వ సంll లో వైద్య పట్టా పొందిన తర్వాత మేయు మరియు కాంగ్ మెథడిస్టు ఎపిస్కోపల్ చర్చి యొక్క ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ తరఫున వైద్య మిషనరీలుగా చైనాకు తిరిగి వచ్చారు. పిమ్మట జియుజియాంగ్‌లో వారు ఒక గదిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారు ఎలిజబెత్ స్కెల్టన్ డాన్‌ఫోర్త్ మెమోరియల్ హాస్పిటల్ పేరుతో ఒక క్రొత్త ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు 1900వ సంll లో చైనాలో క్రైస్తవులు మరియు మిషనరీలకు వ్యతిరేకంగా బాక్సర్ తిరుగుబాటు లేచింది. ఆ తిరుగుబాటు సమయంలో మేయు తన తండ్రిని కోల్పోయారు మరియు ఆమె మరియు కాంగ్ చైనాను విడిచిపెట్టి జపాన్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. 1901వ సంll లో చైనాకు తిరిగి వచ్చిన తర్వాత వారు ఆసుపత్రిని ప్రారంభించారు.
ఆ ఆసుపత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉండేది. మరోవైపు, ఆమె చైనా నర్సులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు, పాశ్చాత్య వైద్య పాఠ్యపుస్తకాలు మరియు నర్సుల శిక్షణా నియమ సంపుటి పుస్తకములను (ట్రైనింగ్ మాన్యువల్) అనువదించారు మరియు నర్సుల కొరకు బైబిలు పఠనములను నిర్వహించారు. తన వృత్తిపరమైన సేవయే కాక ఆమె నలుగురు కుమారులను కూడా దత్తత తీసుకున్నారు.
‘చైనీస్ హోమ్ మిషనరీ సొసైటీ’ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో మేయు ఒకరు. ఏ క్రైస్తవ వర్గమునకు చెందని దేశీయ మిషన్ అయిన ఈ సంస్థ నైరుతి చైనా ప్రాంతములకు సువార్తను అందించే లక్ష్యముతో స్థాపించబడింది. తరువాత కొంత కాలంపాటు పై చదువుల కొరకు అమెరికా వెళ్ళారు మేయు. చైనాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె మెథడిస్ట్ మిషనరీ సొసైటీని విడిచిపెట్టి, 1920వ సంll లో షాంఘైలో బేతెల్ మిషన్‌ను స్థాపించారు. ఈ మిషన్ 17 సంవత్సరాలలో పాఠశాలలు, ఒక ఆసుపత్రి మరియు నర్సింగ్ పాఠశాల, ఒక సెమినరీ (బైబిలు వేదాంతశాస్త్ర శిక్షణాలయం), ఒక అనాథాశ్రమం మరియు ఒక ఆరాధనాలయమును స్థాపించింది. మరొకవైపు నర్సుల కొరకైన తన శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించారు మేయు. దాని ద్వారా చైనీయులకు నర్సులుగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిని క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు వారిని నర్స్-సువార్తికులుగా మార్చుటకును ఉద్దేశించారు మేయు. తరువాతి సంవత్సరాలలో కాలిఫోర్నియాకు వెళ్ళిన షి మేయు, తన మరణం వరకు అక్కడే నివసించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ వృత్తిపరమైన జీవితమును ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించుటకును మరియు వారికి సువార్తికులుగా శిక్షణనిచ్చుటకును మీరు ఉపయోగిస్తున్నారా?
"ప్రభువా, ఒక సువార్తికుని హృదయమును మరియు ఇతరులకు సువార్తికులుగా శిక్షణనివ్వవలెననే లోతైన వాంఛను నాలో కలిగించుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment