Pages

Apr 7, 2022

Henry Martyn | హెన్రీ మార్టిన్

హెన్రీ మార్టిన్ జీవిత చరిత్ర




  • జననం : 18-02-1781
  • మరణం : 16-10-1812
  • స్వస్థలం : కార్న్‌వాల్
  • దేశం  : ఇంగ్లాండు 
  • దర్శన స్థలము : భారతదేశం, పర్షియా (ప్రస్తుత ఇరాన్)


ఒక ఆంగ్లేయ పాదిరియైన హెన్రీ మార్టిన్ భారతదేశం మరియు పర్షియా దేశాలలో మిషనరీగా సేవలందించారు. అతని తండ్రియైన జాన్ మార్టిన్ గనులలో పనిచేసేవారు. పుట్టిన కొద్దికాలానికే తల్లిని కోల్పోయిన హెన్రీని అతని తండ్రే పెంచారు. తన యవ్వనప్రాయంలో కోపస్థునిగా హింసాత్మక స్వభావాన్ని హెన్రీ కలిగియున్నారు. కాగా ఒకసారి అతను కోపంతో అతని స్నేహితుని పైకి కత్తిని విసిరి దాదాపు ఆ వ్యక్తిని చంపినంత పనిచేశారు. అయితే, అతని తండ్రి మరణం అతని వైఖరిని పూర్తిగా మార్చివేసింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్ కళాశాలలో చదువుకున్న అతను గణితశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో సువార్తికునిగా సేవచేస్తున్న చార్లెస్ సిమియోన్‌తో హెన్రీ కలిగియున్న సహవాసం అతను విశ్వాసములో ఎదుగుటకు తోడ్పడింది.


డేవిడ్ బ్రైనర్డ్ మరియు విలియం కేరీల సాక్ష్యాలతో ప్రేరణ పొందిన హెన్రీ, విద్యారంగంలో కీర్తి సంపాదించాలనే తన ఆశయాలను పక్కన పెట్టి, క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించిన సందేశాన్ని విదేశాలకు మోసుకువెళ్ళే రాయబారిగా మారారు. కావున ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింద ప్రార్థనాలయ అధికారిగా పనిచేయుటకు అంగీకరించి, 1806వ సంll లో భారతదేశానికి వచ్చారు. మొదట సెరాంపూర్ చేరుకున్న అతను, తరువాత దానాపూర్ వెళ్ళారు. అతిత్వరలోనే అతను స్థానిక భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలను నేర్చుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తోటి మిషనరీల ప్రోత్సాహంతో బైబిలు అనువాదాన్ని తన ప్రధాన కర్తవ్యముగా ఎంచుకున్నారు హెన్రీ. భారతీయ ముస్లింలకు సువార్తను అందించుటకు ఏదైనా మంచి ప్రయత్నం చేయవలెనని తలంచిన అతను, క్రొత్త నిబంధనను మరియు ఆంగ్లికన్ ప్రార్థన పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించారు. అంతేకాకుండా పిల్లలకు కూడా తన సేవలనందించి, వారి కొరకు పాఠశాలలను ఏర్పాటు చేశారు.


అటు పిమ్మట ముస్లిం ప్రజలకు సువార్తను అందించుటకు మరింతగా సేవ చేయవలెనని సంకల్పించి 1810వ సంll లో అతను పర్షియా (ఆధునిక ఇరాన్) కు వెళ్ళారు. తన ఆరోగ్య స్థితి మరింత దిగజారుతున్నప్పటికీ లెక్కచేయకుండా అతను క్రొత్త నిబంధనను పర్షియా మరియు అరబిక్ భాషలలోకి అనువదించారు. తదుపరి అర్మేనియావారి మధ్య సేవ చేయాలని వాంఛించిన అతను 1812వ సంll లో గుర్రంపై కాన్‌స్టాంటినోపుల్‌కు బయలుదేరారు. అయితే 1300 మైళ్ల ఆ దూర ప్రయాణం ముగియబోతుందనగా అతను పూర్తిగా కృశించి పోవడంతో 31 సంll ల అతి చిన్న వయస్సులోనే అతను తుది శ్వాస విడిచారు. హెన్రీ మార్టిన్ ఒక ప్రార్థనా యోధులు. అతను తన జీవితమంతా లేఖనములపైనే ఆధారపడి దేవుని వాక్యములోనే తనకు విశ్రాంతిని ఆదరణను వెతికారు. తాను నిర్వర్తించవలసిన పనుల పట్ల అతను కలిగియున్న శ్రద్ధ మరియు దేవుని గురించిన కార్యముల పట్ల ఉన్న ఆసక్తి ఆ కాలపు అత్యంత గొప్ప మిషనరీలలో ఒకరిగా అతనిని నిలిపాయి.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ యవ్వనంలో ప్రభువు కొరకు మీరేమి సాధించారు? 


ప్రార్థన :

"ప్రభువా, నా పూర్ణ శక్తిని మరియు బలమును మిమ్ములను సేవించుట కొరకే ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!



No comments:

Post a Comment