Pages

Apr 7, 2022

Horace Underwood | హోరేస్ అండర్‌వుడ్

హోరేస్ అండర్‌వుడ్ జీవిత చరిత్ర

 


  • జననం : 19-07-1859
  • మరణం : 12-10-1916
  • స్వస్థలం : లండన్
  • దేశం   : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : కొరియా


లండన్ నగరంలో జన్మించిన హోరేస్ గ్రాంట్ అండర్‌వుడ్, 1872వ సంll లో తన కుటుంబంతో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కు వలస వెళ్ళారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ లో పట్టా పొందిన తరువాత అతను న్యూ బ్రున్స్విక్‌లో ఉన్న 'డచ్ రిఫార్మ్‌డ్ థియోలాజికల్ సెమినరీ' అనే వేదాంత కళాశాలలో చేరారు. 1884వ సంll లో సేవ చేయుటకు అర్హత పొందిన అతను, మిషనరీగా భారతదేశానికి వెళ్ళాలని ఆశించారు. అయితే, కొరియాలో సువార్త సేవ కొరకు ఎంత అవసరం ఉన్నదో దేవుడు అతనితో మాట్లాడగా, 'ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ మిషన్స్' సంస్థను ఒప్పించి, అండర్‌వుడ్ కొరియాకు పయనమయ్యారు. సిలువ సందేశాన్ని కొరియన్లకు అందించాలనే ఆతృతతో అతని ప్రయాణం సాగింది.

మిగిలిన ప్రపంచంతో సంబంధాలను మూసివేసుకున్నదిగా ‘హెర్మిట్ రాజ్యం’ అని కూడా పిలువబడే కొరియా బయటి వ్యక్తులను సులభముగా అంగీకరించలేని తత్వం, వారిని సహించలేనితత్వం కలిగి ఉండేది. అయితే కొరియావారు నేర్చుకొనుటను ఎంతో గొప్పదిగా ఎంచుతారని, పుస్తకాలు వారికి బహు విలువైనవని అర్థం చేసుకున్న అండర్‌వుడ్, అటువంటి కొంతమందికి క్రైస్తవ పుస్తకములను అవి ఏమిటో బహిరంగముగా తెలియపరచకుండా రహస్యముగా పంపించడం ప్రారంభించారు. కొన్నిసార్లు అతను రాకపోకలు అధికముగా ఉండే వీధి ప్రక్కన ఏదైనా చెట్టు క్రింద కూర్చుని, ఒక పుస్తకం తీసి చదవడం ప్రారంభించేవారు. అది చూసిన వారెవరైనా ఏమి చదువుతున్నారని అతనిని అడిగినప్పుడు, అది అవకాశంగా తీసుకొని అతను వారికి ఆ పుస్తకమును గురించి, దానిలో వ్రాయబడిన సత్యాలు మరియు వాటి భావమును గురించి వివరించి చెప్పేవారు. క్రమంగా అంధకారమయమైన కొరియాలో వెలుగు ప్రకాశించడం అతను చూడగలిగారు. 1887వ సంll లో విశ్వాసుల కొరకు అతను కొరియా యొక్క మొట్టమొదటి క్రమబద్ధమైన సంఘమును స్థాపించారు. అటు పిమ్మట అతను కొరియా అంతటా మిషనరీ ప్రయాణాలను సాగించి, సువార్త ప్రకటిచుచూ, సంఘములను స్థాపిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.

"ప్రజల చేతిలో ఉన్న బైబిలు ఉత్తమ బోధను చేయగలదు" అని విశ్వసించారు అండర్‌వుడ్. అప్పటిలో కొరియా భాషలో అందుబాటులో ఉన్న బైబిలు అనువాదం పూర్తిగా కొరియా భాషను కలిగియుండక అనేక చైనా అక్షరాలను కలిగియున్నది. కాగా అండర్‌వుడ్ ఒక అనువాద బృందంతో కలిసి ఎడతెగని కృషి సల్పి, ఖచ్చితమైన కొరియా భాషలో 1906వ సంll లో క్రొత్త నిబంధనను మరియు 1911వ సంll లో పాత నిబంధనను ప్రచురించారు. అంతేకాకుండా, కొరియా నిఘంటువును, కీర్తన పుస్తకమును మరియు అనేక క్రైస్తవ రచనలను కూడా అతను ప్రచురించారు. వేలాదిమంది కొరియా ప్రజలు క్రీస్తును అంగీకరించగా, అండర్‌వుడ్ 1900వ సంll లో సియోల్ వైఎంసిఎ ("సియోల్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్"-సియోల్ క్రైస్తవ యువకుల సంఘము)-ను స్థాపించి, భవిష్యత్ పరిచర్య కొరకై యువకులకు శిక్షణనిచ్చారు. అనేక విద్యా సంస్థలను స్థాపించడమే కాకుండా, సమాజ అభ్యున్నతి కొరకు పలు స్వచ్ఛంద గృహాలను కూడా అతను ఏర్పరిచారు. 'మండుచున్న మోపు' అని అర్ధమిచ్చే "పుల్ తోంగారి" అని పిలువబడే హోరేస్ అండర్‌వుడ్, ఎంతో మంది జీవితాలలో సత్యమనే వెలుగును నింపుతూ తన తుది శ్వాస విడిచే వరకూ క్రీస్తు కొరకు ప్రజ్వలిస్తూనే ఉన్నారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుని కొరకు మండే ప్రకాశవంతమైన జ్వాలవలె మీ స్నేహితుల మధ్యలో మీరు ప్రజ్వలిస్తున్నారా?


ప్రార్థన :

"ప్రభువా, మీ సేవ నిమిత్తమై నేను కలిగియున్న కృపావరమును ప్రజ్వలింపజేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment