Pages

Apr 7, 2022

Martin Bucer | మార్టిన్ బూసర్

మార్టిన్ బూసర్ జీవిత చరిత్ర



  • జననం : 11-11-1491
  • మరణం : 28-02-1551
  • స్వస్థలం : ష్లెట్‌స్టాడ్
  • దేశం : -
  • దర్శన స్థలము :  స్ట్రాస్‌బర్గ్, ఫ్రాన్స్


మార్టిన్ బూసర్ ష్లెట్‌స్టాడ్‌లోని ఒక పేద కుటుంబములో జన్మించారు. అతని తండ్రి పీపాలను తయారుచేసేవారు. అయినప్పటికీ, ప్రతిష్టాత్మక లాటిన్ పాఠశాలలో చదువుకున్న అతను, 15 సంll ల వయస్సులో మతపరమైన విద్యాభ్యాసం కొరకు "డొమినికన్ ఆర్డర్" ‌లో చేరారు. అక్కడ అతను ఒక ఉత్తమ విద్యార్థిగా రాణించగా, వేదాంత విద్యను కొనసాగించుటకు హైడెల్బర్గ్‌కు పంపించబడ్డారు.


1518వ సంll లో హైడెల్బర్గ్‌లో సిలువను గూర్చిన వేదాంతమును మార్టిన్ లూథర్ వివరించుచుండగా బూసర్ వినడం జరిగింది. ఆ సిలువ సందేశం బూసర్ మనస్సుపై ఎంతో ప్రభావం చూపించగా, వెంటనే అతను తన క్రైస్తవ సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టి, వేదాంత సత్యాన్ని వెదుకుటకు పయనమయ్యారు. రెండు సంవత్సరాల పాటు పలు క్రైస్తవ సంస్కరణవాదులతో తీవ్రముగా చర్చించారు. అతను చర్చించిన సంస్కరణవాదులలో మార్టిన్ లూథర్ కూడా ఉన్నారు. అటు పిమ్మట అతను ల్యాండ్‌స్టూల్ మరియు విస్సెంబర్గ్‌లలో సేవ చేయడం ప్రారంభించారు. రక్షణకు ఏకైక ఆధారం బైబిలేనని, ప్రతి ఒక్కరు కూడా వారి స్వరక్షణకు వారే బాధ్యులని అతను బోధించడం ప్రారంభించారు. వారి స్వార్థం కొరకు ప్రజలను సత్యానికి దూరముగా నడిపించిన క్రైస్తవ సన్యాసులను మరియు పోప్‌లను బూసర్ ఖండించారు. తద్వారా కాథలిక్ సంఘ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న బూసర్, విస్సెంబర్గ్‌ నుండి బహిష్కరించబడ్డారు.


ఎటువంటి జీవనాధారం లేకుండా 1523వ సంll లో బూసర్ స్ట్రాస్‌బర్గ్‌కు వెళ్ళగా, అక్కడ హల్డ్రిచ్ జ్వింగ్లీ అతనిని చేర్చుకున్నారు. కొద్ది రోజులలోనే అక్కడ బైబిలు పఠనములను నిర్వహించడం మొదలుపెట్టిన అతను, 1524వ సంll ఆగస్టు నాటికి సెయింట్ అరేలియా పారిష్ యొక్క కాపరిగా నియమించబడ్డారు. అక్కడ 1549వ సంll వరకు సేవలందించిన అతను, అక్కడి నుండే ఐరోపాలోని వివిధ ప్రాంతాలలో సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అతను లూథర్ ఉపన్యాసాల యొక్క లాటిన్ అనువాదాలను ప్రచురించారు. అంతేకాకుండా, బైబిలులోని సువార్త పుస్తకములు, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, యోహాను వ్రాసిన పత్రిక, జెఫన్యా మరియు కీర్తనలపై తన స్వంత వ్యాఖ్యానములను కూడా వ్రాశారు.


అప్పటిలో విభజనలతో కూడియున్న ప్రొటెస్టెంట్ సిద్ధాంతాలను ఐక్య పరచడంలో బూసర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతేకాక అతను మార్టిన్ లూథర్ మరియు హల్డ్రిచ్ జ్వింగ్లీల మధ్య మధ్యవర్తిగా కూడా వ్యవహరించారు. దేవునిలో మన విశ్వాసము చిన్న బిడ్డలను పోలినదై యుండవలసిన ఆవశ్యకతను గురించి అతను విశ్వాసులకు వివరించేవారు. వాక్యములోని సత్యము యొక్క వెలుగులో క్రైస్తవ సంఘమును  ప్రోత్సహిస్తూ మరియు సరిదిద్దుతూ అతను ఐరోపా ఖండమంతటా విస్తృతంగా పర్యటించారు. అతను తన జీవితపు చివరి రోజులను ఇంగ్లాండులో థామస్ క్రాన్మర్‌కు సంస్కరణ సేవలో సహాయం చేస్తూ మరియు క్రీస్తు రాజ్యమును గురించిన తన అద్భుతమైన రచన అయిన ‘డి రెగ్నో క్రిస్టి’ ని రచిస్తూ గడిపారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవునిలో మీ విశ్వాసం చిన్న బిడ్డలను పోలినదై ఉన్నదా?

ప్రార్థన :

"ప్రభువా, అన్ని విషయములను సరియైన రీతిలో గ్రహించగల వివేచనను కలిగి ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించగలుగునట్లు, మీ యొక్క వాక్య జ్ఞానములో అభివృద్ధి పొందుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment