Pages

Jul 4, 2022

Eleanor Chesnut Biography

ఎలెనోర్ చెస్నట్  గారి జీవిత చరిత్ర


జననం: 08-01-1868

మహిమ ప్రవేశం: 29-10-1905

స్వస్థలం: అయోవా

దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

దర్శన స్థలము: చైనా 


 "ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము." అని 1 యోహాను 3:16లో వ్రాయబడిన రీతిని దైవ ప్రేమను రుచిచూచిన ఎలెనోర్ చెస్నట్ క్రీస్తు అడుగుజాడలను అనుసరించి చైనా ప్రజల కొరకు తన ప్రాణమునే కోల్పోయారు.


 అమెరికాకు చెందిన ఎలెనోర్ చెస్నట్ చైనాలో సేవ చేసిన ఒక వైద్య మిషనరీ. బాల్యములోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె, తన యొక్క బంధువుల యొద్ద పెరిగారు. ఆమె చదువు కొరకు సహాయం చేసెడివారెవరూ లేకపోవడంతో, తానే స్వయంగా పనిచేసి డబ్బు సంపాదించుకొని చదువుకున్నారు చెస్నట్. ఆ విధంగా ఆమె చికాగోలోని 'ఉమెన్స్ మెడికల్ కాలేజీ' (మహిళా వైద్య కళాశాల) నుండి పట్టభద్రురాలయ్యారు. పిమ్మట ఆమె మిషనరీ సేవ కొరకు సిద్ధపడుటకుగాను 'మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్' లో చేరారు.


 1894వ సంll లో చైనాకు ప్రయాణించిన ఆమె, లియాన్‌జౌలో క్రొత్తగా ప్రారంభించబడిన మహిళా ఆసుపత్రి యొక్క బాధ్యతలు చేపట్టారు. కాగా ఆ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కొరకు ఆమె తన సమస్తమునూ ధారపోశారు. గుర్రముపై ఆమె పొరుగు గ్రామాలకు ప్రయాణించి అనారోగ్యముతో ఉన్నవారికి వైద్యం అందించారు మరియు స్థానిక మహిళలకు నర్సులుగా శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా మత్తయి సువార్తతో పాటు పలు పుస్తకములను ఆమె లియాన్‌జౌ మాండలికంలోనికి అనువదించారు. ఆమె కలిగియున్న దయాకనికరములను బట్టి ఆమె ఎంతగానో ప్రేమించబడ్డారు.


 1900వ సంll నాటి "బాక్సర్ తిరుగుబాటు" ప్రారంభమైనప్పుడు వేలాది మంది మిషనరీలు మరియు చైనా క్రైస్తవులు తమ ప్రాణములను కోల్పోతున్నప్పటికీ, చెస్నట్ తన యొక్క పిలుపులో స్థిరముగా నిలబడ్డారు. రాజకీయ అశాంతి పెరగుతుండడంతో ఆసుపత్రి పనితీరుకు భంగం కలిగించే పరిస్థితులను నివారించుటకు ఆమె తగిన జాగ్రత్తలను తీసుకున్నారు. అయితే, 1905వ సంll అక్టోబరు మాసం 29వ తారీఖున ఆసుపత్రి ప్రాంగణంలో అల్లర్లు చెలరేగాయి. మిషనరీలను వీధులలోకి లాక్కొనివచ్చి కొట్టారు. చెస్ట్నట్‌కు తప్పించుకొని వెళ్ళుటకు అవకాశం ఉన్నప్పటికీ, ఆ అల్లర్లలో గాయపడిన పిల్లలకు చికిత్స చేస్తూ ఆమె అక్కడే ఉండిపోయారు. చివరికి డాll ఎలెనోర్ చెస్నట్‌ కూడా పొలములో పనిచేయుటకు ఉపయోగించే త్రిసూలం వంటి పంగలకర్రతో (పిచ్‌ఫోర్క్‌) కొట్టబడి చంపబడ్డారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మిషనరీలు మరియు పదేళ్ల చిన్నారి కూడా చంపబడ్డారు.


 చెస్నట్ యొక్క ధైర్యం, విశ్వాసముతో ముందడుగు వేసి చైనాలోను మరియు ఇతర ప్రాంతములలోను సువార్త సేవ కొరకై జీవించునట్లు అనేక మంది యువ మిషనరీలను ప్రేరేపించింది.


ప్రియమైనవారలారా, మీ దైనందిత జీవితములలో మీరు క్రీస్తు యొక్క త్యాగసహితమైన ప్రేమను కనుబరచుచున్నారా?


"ప్రభువా, మీరు సిలువపై చూపించిన ఆ త్యాగసహితమైన ప్రేమను అనుభవించిన నేను, అటువంటి ప్రేమతో ఇతరులను ప్రేమించగలుగునట్లు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment