Pages

Jul 26, 2022

George Grenfell | జార్జ్ గ్రెన్‌ఫెల్

జార్జ్ గ్రెన్‌ఫెల్ జీవిత చరిత్ర



  • జననం: 21-08-1849
  • మహిమ ప్రవేశం: 01-07-1906
  • స్వస్థలం: సాన్‌క్రీడ్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: ఆఫ్రికా


బానిసలైన ఇద్దరు బాలికలు ఒక చెట్టుకు కట్టబడి, తెగ నాయకునిచే హింసించబడబోతున్నారు. ఆ సమయంలో ఒక మిషనరీ అక్కడికి వచ్చి విమోచనా క్రయమును చెల్లించి వారిని రక్షించాడు. అతను వారి గ్రామానికి ఆ అమ్మాయిలను తీసుకువస్తుండగా, ఆ గ్రామస్థులు ఆ అమ్మాయిలను అపహరించిన వ్యక్తి మిషనరీయే అని భావించారు. కాగా అతనిని చంపుటకు ఆ గ్రామం మొత్తం ఈటెలు పట్టుకొని రాగా, ఆ బాలికలలో ఒకరు తన గ్రామస్థులను ఆపి, ఆ మిషనరీ క్రయం చెల్లించి ఎలా వారిని విడిపించి రక్షించారో వారికి వివరించి చెప్పింది. వెంటనే మిషనరీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, పాపపు బానిసత్వం నుండి వారిని రక్షించుటకు యేసు క్రీస్తు తన ప్రాణాన్నే విమోచన క్రయధనముగా ఎలా చెల్లించారో వారికి తెలియపరిచారు. ఆ రోజున ఆ గ్రామస్థులలో అనేకమంది పాపాంధకారంలో ఉన్న తమ జీవితాలలో సువార్త వెలుగును చూశారు. క్రీస్తుకు ఉన్నటువంటి హృదయమును కలిగియున్న ఆ మిషనరీ మరెవరో కాదు, చీకటిలో ఉన్న ఆఫ్రికాలో సువార్త వెలుగును ప్రసరింపజేసిన జార్జ్ గ్రెన్‌ఫెల్.


స్థానికులచే ‘టాటా’ (తండ్రి) అని ఆప్యాయంగా పిలువబడిన గ్రెన్‌ఫెల్, మధ్య ఆఫ్రికా యొక్క అన్వేషకునిగా కూడా పేరొందిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక కంటిని కోల్పోయినప్పటికీ, అతను 24 సంll ల వయస్సులో మిషనరీగా సేవ చేయవలెననిన దేవుని పిలుపుకు విధేయులై 1874వ సంll లో ఆఫ్రికాలోని కామెరూన్‌కు వచ్చారు. అక్కడ అనేక అన్వేషణాత్మక ప్రయాణాలను చేపట్టిన అతను, మిషనరీ సేవ కొరకు విస్తారమైన కాంగో ప్రాంతము యొక్క ద్వారములను తెరిచారు. అప్పటి ఆఫ్రికా ప్రజలలో నిండుకొనియున్న నీచమైన భ్రష్టత్వమును చూసి అతను బాధపడినప్పటికీ, అంధకారం, కౄరత్వం మరియు మరణముతో నిండియున్న ప్రదేశములకు సువార్త వెలుగును తీసుకువెళ్ళడంలో గొప్ప సంతోషమును కనుగొన్నారు. 


తన పెద్ద కుమార్తెను కోల్పోవడం మరియు అనేక ఇతర భయంకరమైన అనుభవాలను ఎదుర్కొనిన పరిస్థితులలో కూడా, నిజమైన దేవునిని కనుగొన్న ఆఫ్రికా ప్రజలను చూచి అతను ఓదార్పును మరియు సంతృప్తిని పొందారు. వారి ప్రాణాత్మలను ఎలా శుభ్రపరచుకొనవలెనో వారికి నేర్పించుటయే కాక, వారి భౌతిక జీవితాలలో కూడా నాగరికతను తీసుకువచ్చుటకు ప్రయత్నించారు గ్రెన్‌ఫెల్. నరమాంస భక్షకులు, హంతకులు, బానిస వ్యాపారులు మరియు మాంత్రికవిద్యలను అభ్యసించే ఆ ప్రజల జీవితాలను మార్చుటకు దేవుడు అతనిని ఒక శక్తివంతమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు.


మండుచున్న క్రొవ్వొత్తి తాను ప్రకాశిస్తున్న అదే సమయంలో కరుగుతుంది కూడా! అయినప్పటికీ, రక్షణ సువార్త యొక్క వెలుగును అంధకారమయమైన కాంగోలోకి తీసుకువెళ్ళుటకు, ప్రకాశించుచున్న క్రొవ్వొత్తి వలె గ్రెన్‌ఫెల్ కూడా తన సమస్తమునూ క్రీస్తుకు సమర్పించి, తాను కరిగిపోయారు. బ్లాక్ ఫీవర్ అనే జ్వరముతో తీవ్రముగా బాధింపబడిన తరువాత, 1906వ సంll లో తన ప్రభువు సన్నిధానమునకు చేరుకున్నారు జార్జ్ గ్రెన్‌ఫెల్.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, అంధకారమయమైన ఈ లోకములో మీరు మండుచూ ప్రకాశించుచున్న వెలుగువలె నున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, నన్ను విరుగగొట్టుము, కరిగించుము, మీ మహిమ నిమిత్తం నన్ను మలుచుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !


No comments:

Post a Comment