Pages

Jul 25, 2022

Hana Catherine Mullens | హనా కాథరిన్ ముల్లెన్స్

హనా కాథరిన్ ముల్లెన్స్ జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: 01-07-1826
  • మహిమ ప్రవేశం: 21-12-1861
  • స్వస్థలం: కలకత్తా
  • దేశం: భారతదేశం
  • దర్శన స్థలము: భారతదేశం


ఐరోపా ఖండమునకు చెందినవారైన హానా కాథరిన్ ముల్లెన్స్, జెనానా మిషన్లకు మార్గదర్శకురాలిగా పరిగణించబడే మిషనరీ. ఈ జెనానా పరిచర్య బహిరంగంగా కనిపించుటకు అనుమతించబడని అప్పటి భారతీయ మహిళలకు సువార్తను అందించుటకు మహిళా మిషనరీలను పంపేదిగా ఉంది. హానా ఒక పరిష్కారమును కనుగొనేంత వరకూ బంధకాలలో ఉన్నటువంటి ఈ మహిళలను చేరుకోవడం మిషనరీలకు జవాబు దొరకని ఒక గొప్ప చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.


కలకత్తాలోని ఒక మిషనరీల కుటుంబంలో జన్మించిన హానా, ఆమె తల్లిదండ్రుల పరిచర్య ద్వారా ప్రేరణ పొందారు. మంచి తెలివితేటలు గలిగిన ఆమె, పన్నెండేళ్ళ వయసుకు ముందే తరగతులు నిర్వహించుటలో తన తల్లికి సహాయం చేసేవారు. ఆమె పదిహేనేళ్ళ ప్రాయంలో యేసు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు తన ఇంటిని సందర్శించిన ప్రతి ఒక్కరితో ఎంతో ఆసక్తి ఉత్సాహములతో సువార్తను పంచుకునేవారు. అవిశ్వాసులను క్రీస్తు వద్దకు తీసుకురావడంలో ఇతర ప్రసంగాల కంటే వారితో ఆమె కలిగియుండే సంభాషణలే వారిని బహుగా ప్రభావితం చేసివి. 19 సంll ల వయసులో రెవ. డాక్టర్ ముల్లెన్స్‌తో ఆమెకు వివాహం జరుగగా, వారిరువురు కలిసి బెంగాల్‌లో సంతోషముతో ప్రభువుకు సేవ చేశారు. బెంగాలీ భాషలో మంచి వాక్పటుత్వము కలిగియున్న ఆమె, స్థానిక మహిళల కొరకు క్రైస్తవ రచనలనలు వ్రాశారు మరియు అనువదించారు. ఆమె వ్రాసిన పుస్తకాలలో ఒకటి భారతదేశంలోని పన్నెండు భాషా మాండలికాలలో ప్రచురించబడింది. 


భారతీయ మహిళలు దయనీయమైన స్థితిలో అజ్ఞానులుగాను, ఒంటరిగా ఏ పనీ లేకుండా, సంతోషము లేక యున్నారని ఎరిగియున్న హానా, వారి కొరకు ఏమైనా చేయాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. అటువంటి అవకాశం అనుకోని విధంగా ఆమె తలుపు తట్టింది. ఎంబ్రాయిడరీ మరియు కుట్టుపనిలోని అల్లికలలో నైపుణ్యము కలిగియున్న హానా, ఒకసారి ఒక జత చెప్పుల పై అల్లిక పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దానిని చూచి ఆశ్చర్యముతో "నా భార్య కూడా అటువంటి పనిని నేర్చుకోవాలని కోరుకుంటున్నారు" అని అన్నాడు. హానా వెంటనే ఆ అవకాశమును అందిపుచ్చుకొని, కావాలంటే ఆ పనిని అతని భార్యకు నేర్పించగలనని చెప్పారు. ఆ విధంగా, భారతీయ మహిళలకు అటువంటి నైపుణ్యాలను నేర్పించుటకే కాక, ఆత్మీయ విషయములను కూడా వారికి నేర్పించుటకు వారిని కలుసుకొనగలుగునట్లు ద్వారములు తెరువబడ్డాయి. త్వరలోనే ఆమె అటువంటి మహిళలను అనేకమందిని కలుసుకుంటూ, సువార్తను చెప్పి వారిని క్రీస్తు వద్దకు నడిపించారు.


అయితే 35 సంll ల లేత వయస్సులోనే హానా ఈ లోకమును విడిచి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ, ఆమె చేతి వ్రేళ్ళతో నిరంతరాయంగా పనిచేసిన కుట్టు సూది జెనానా పరిచర్యకు ద్వారములు తెరిచింది. అనేకమంది ఇతర మహిళా మిషనరీలు పరిచర్య చేయుటకు ఆమె అవలంబించిన పద్ధతులను అనుసరించారు. తత్ఫలితముగా వేలాది మంది భారతీయ మహిళలు నిజమైన దేవుని యొద్దకు నడిపింపబడ్డారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీకు కలిగిన అవకాశములను సువార్త పంచుకొనుటకు ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటున్నారు? 


ప్రార్థన :

"ప్రభువా, నా విశ్వాసమును చురుకుగా ఇతరులతో పంచుకొనుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment