Pages

May 13, 2023

George Muller | జార్జ్ ముల్లర్

జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్ర



  • జననం : 27-09-1805
  • మరణం : 10-03-1898
  • స్వస్థలం : క్రోపెన్‌స్టేడ్ట్, ప్రసియా (ప్రస్తుత జర్మనీలో)
  • దర్శన స్థలము : ప్రపంచ నలుమూలలు


దేవుని సేవ నిమిత్తం ఒక దైవజనుడు అట్లాంటిక్ మహాసముద్రముగుండా ప్రయాణిస్తున్నారు. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా ముందుకు సాగలేక ఆ ఓడను మధ్యలో నిలిపివేశారు. కాగా అతను ఓడ కెప్టెన్‌ వద్దకు వెళ్ళి మరుసటి రోజు మధ్యాహ్నం తాను ఖచ్చితముగా క్యూబెక్‌లో ఉండవలసిన అవసరం ఉందని చెప్పారు. అయితే అటువంటి అననుకూల పరిస్థితులలో ప్రయాణాన్ని కొనసాగించలేమని కెప్టెన్ నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. అప్పుడు ఆ దైవజనుడు కెప్టెన్‌తో తాను ప్రార్థిస్తానని, ఖచ్చితముగా దేవుడు ఒక మార్గం తెరుస్తాడని చెప్పారు. అది నమ్మలేని కెప్టెన్ అతనితో పాటు ఒక గదిలోకి వెళ్ళగా, అక్కడ ఆ దైవజనుడు పొగమంచును తొలగించమని అడుగుతూ సాధారణమైన మాటలలోనే విశ్వాసముతో  ప్రార్థించారు. ప్రార్థన ముగించిన తరువాత అతను కెప్టెన్‌తో  “నా ప్రభువును నేను యాభై సంవత్సరాలకు పైగా ఎరిగియున్నాను. రాజులకు రాజైన ఆయనను సంధించినప్పుడు ఏ ఒక్క సందర్భములో కూడా నేను విఫలము కాలేదు. లేచి వెళ్ళండి, పొగమంచు పోయింది. వెళ్ళి చూడండి, మీరే తెలుసుకుంటారు.” అని చెప్పారు. కెప్టెన్ ఓడ యొక్క వంతెన వద్దకు తిరిగి వచ్చి చూసినప్పుడు పొగమంచు తొలగిపోయి ఉంది. అటువంటి విశ్వాసవీరుడు మరియు ప్రార్థనాయోధుడు జార్జ్ ముల్లర్.


జార్జ్ ముల్లర్ ఒకప్పుడు ఇహలోక ఆనందాలలో మునిగిపోయి పాపాత్మకమైన జీవితాన్ని జీవించారు. అయితే అది అతనికి తృప్తిని ఇవ్వకపోగా, అతనిలో అపరాధ భావాన్ని కలిగిస్తుండేది. కాగా తన జీవితాన్ని మార్చుకొనవలెనని అతను ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటికి రాలేకపోయారు. అయితే 1825వ సంll నవంబరు మాసంలో అతను ఒక చిన్న క్రైస్తవ కూడికకు హాజరవ్వగా, ఎటువంటివారినైనా మార్చగలిగే క్రీస్తు ప్రేమ అతనిని మార్చివేసింది. అప్పటినుండి దేవుని మహిమ కొరకు మాత్రమే జీవించాలని అతను వాంఛించారు. 1826వ సంll లో హాలీ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత అతను యూదుల మధ్యలో సువార్త సేవ చేసే ఇంగ్లాండులోని 'లండన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ అమోంగెస్ట్ ది జ్యూస్' అనే సంస్థలో చేరారు. తదుపరి అతను బ్రిస్టల్‌కు వెళ్ళి తరువాతి కాలంలో ‘ప్లైమౌత్ బ్రదరన్’ అని పిలువబడిన బెతెస్థ మరియు గిడియన్ వద్ద ఉన్న క్రైస్తవ సంఘములలో జీతం లేకుండానే సేవ చేశారు.


ప్రధానంగా అనాధ పిల్లల సంరక్షణ కొరకు సేవ చేయుటకు తనను సమర్పించుకున్న ముల్లర్, వారి కొరకు అనాథాశ్రమాలను ఏర్పరిచారు. ఈ అనాథాశ్రమాలు కేవలం విశ్వాసము ద్వారా దేవుని పైనే ఆధారపడి నడిపించబడేవి. డెబ్బై సంవత్సరాల వయస్సులో అతను పదిహేడు మిషనరీ యాత్రలను చేపట్టి, నలభై రెండు దేశాలకు వెళ్ళి దేవుని సేవ చేశారు. ‘దేవునిలో ఉండే నిజమైన నమ్మకం పరిస్థితులకు మరియు దృశ్యమైన సంగతులకు అతీతమైనది’ అని తన జీవితము ద్వారా ఎంతో బలముగా ధృవీకరించిన జార్జ్ ముల్లర్, చివరి శ్వాస విడిచే వరకు కూడా తన యజమానుని ద్రాక్షతోటలో నమ్మకమైన సేవకునిగా పని చేశారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, స్థితిగతులన్నింటికీ పైన దేవుడు ఉన్నాడన్న దృఢ విశ్వాసమును మీరు కలిగియున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, నా అవసరతలన్నింటి కొరకు మీ పైనే ఆధారపడునట్లు నా విశ్వాసాన్ని బలపరుచుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment