Pages

May 13, 2023

James the Just | నీతిమంతుడైన యాకోబు

నీతిమంతుడైన యాకోబు (జేమ్స్ ది జస్ట్) గారి జీవిత చరిత్ర


Pictures shown are for illustration purpose only


  • జననం : 1 వ శతాబ్దం ప్రారంభం
  • మరణం : ~ క్రీ.శ. 62
  • స్వదేశం : ప్రస్తుత ఇశ్రాయేలు
  • దర్శన స్థలము : యెరూషలేము, యూదయ


బైబిలులో ముగ్గురు వ్యక్తులు యెరూషలేములోని ఆది సంఘమునకు స్థంభములుగా ఉన్నారు. వారిలో అపొస్తలులైన పేతురు, యోహానులతో పాటు యాకోబు ఒకరు. ఈ యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరులలో ఒకరిగా బైబిలులో పేర్కొనబడ్డారు. కానీ, యేసుక్రీస్తు ప్రభువు భూమిపై జీవించిన కాలంలో యాకోబు ఆయనను దేవుని కుమారునిగా విశ్వసించలేదు. అయితే, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై లేచిన తరువాత ఆయనను విశ్వసించిన యాకోబు, ఆయన సేవ చేయుటకు తనను సమర్పించుకున్నారు. పునరుత్థానం తరువాత యేసుక్రీస్తు ప్రభువు తనను కనుపరచుకొనిన వారిలో యాకోబు కూడా ఒకరు.


పడ్రెండు మంది ఆది అపొస్తలులలో ఒకరు కానప్పటికీ యాకోబు‌ కూడా ఒక అపొస్తలుడుగా చెప్పబడతారు. అతని సమర్పణ యూదుల మధ్య సేవ చేయటం. ఆది సంఘములో ప్రముఖ వ్యక్తిగా ఉన్న అతను, యెరూషలేము ఆలోచనా సభలో కీలక పాత్ర పోషించారు. మారుమనస్సు పొందిన అన్యజనులు కూడా సున్నతి మరియు మోషే ధర్మశాస్త్రములోని ఇతర కట్టడలను అనుసరించవలెనా అన్న విషయముపై అంతియొకయలో గందరగోళం తలెత్తినప్పుడు, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను శాంతముగా వినిన పిమ్మట యాకోబు‌ తన అభిప్రాయాన్ని తెలియజేసి, స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించారు. అతని సమాధానం లేఖనములలో అతను కలిగియున్న జ్ఞానం మరియు అవగాహన, అతని వివేచన, సంఘములో శాంతి కొరకు అతను కలిగియున్న వాంఛ మరియు పక్షపాతంలేని అతని బలమైన నాయకత్వాన్ని వెల్లడిపరిచేదిగా ఉంది. అతను సూచించినదాని ప్రకారం పారంపర్యాచారములతో తమకు అధిక భారం కలుగజేసికొనక, విగ్రహారాధన మరియు వ్యభిచారానికి సంబంధించిన విషయాలకు మాత్రం దూరముగా ఉండమని సూచిస్తూ అన్యజనులైన క్రైస్తవులకు ఒక లేఖ వ్రాయబడింది.


బైబిలులో చేర్చబడిన యాకోబు వ్రాసిన పత్రికను వ్రాసినది ఈ యాకోబే అగుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు భావించబడుతుంది. ఈ పత్రిక పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అపేక్షిస్తూ, దైనందిత జీవితాలలో విశ్వాసమునకు తగిన క్రియలను కనుపరచవలెననియు, ప్రాపంచిక ఇచ్ఛలను విడిచిపెట్టవలెననియు మరియు పేదల పట్ల శ్రద్ధ వహించవలెననియు విశ్వాసులకు సూచించేదిగా ఉంది. లోతైన అతని ప్రార్థన జీవితం వలన అతని మోకాళ్ళు ఎంతో కఠినముగా మారినదానిని బట్టి అతనికి ‘ఓల్డ్ కామెల్ నీస్' అనగా 'వృద్ధ ఒంటె మోకాళ్ళు' అనే పేరు వచ్చింది. నీతిన్యాయములతో కూడిన తన యొక్క యథార్థ జీవితమును బట్టి  ‘జేమ్స్ ది జస్ట్’ (నీతిమంతుడైన యాకోబు) అని పిలువబడే ఈ యాకోబు, తన ప్రభువు కొరకు హతసాక్షిగా మరణించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుని వాక్యములో మీరు ఎటువంటి జ్ఞానమును మరియు అవగాహనను కలిగియున్నారు?

ప్రార్థన :

 "ప్రభువా, మీ సంఘములో శాంతి కొరకు నేను కృషి చేయగలుగునట్లు ప్రార్థనలోను మరియు మీ వాక్యములోను నేను లోతుగా వేరుపారియుండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment