Pages

Oct 22, 2021

A. Macdonald Westwater | ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్

ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్ | A. Macdonald Westwater జీవిత చరిత్ర




  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • స్వదేశం: స్కాట్లాండు
  • దర్శన స్థలము: ఉత్తర చైనా


పంతొమ్మిదవ శతాబ్దపు ఆఖరి సంవత్సరాలలో చైనాలో ప్రారంభమైన బాక్సర్ తిరుగుబాటు సమయంలో క్రైస్తవ మిషన్లు మరియు స్థానిక క్రైస్తవులు చైనా సైనికుల కౄరమైన ద్వేషానికి గురయ్యారు. ఈ తిరుగుబాటు క్రమంగా తగ్గుముఖంపడుతుండగా, రష్యావారు తమ సామ్రాజ్యమును విస్తరింపజేసికొనుటకు ఉత్తర చైనాపై దాడి చేశారు. చైనాలో పరిస్థితులు అల్లకల్లోలముగా ఉన్న సమయాలలో అక్కడే ఉండుటకు ఎంచుకున్న అతి కొద్దిమంది మిషనరీలలో డాll ఎ. మెక్‌డొనాల్డ్ వెస్ట్‌వాటర్ ఒకరు.


స్కాట్లాండుకు చెందిన డాll వెస్ట్‌వాటర్ చైనాలోని మంచూరియన్ ప్రాంతంలో సేవ చేసిన ఒక ప్రెస్బిటేరియన్ వైద్య మిషనరీ. ప్రారంభంలో హైచెంగ్‌లో సేవ చేసిన అతను, తరువాత లియోయాంగ్‌కు వెళ్ళి “ఫ్రీ హీలింగ్ హాల్” (ఉచిత స్వస్థత ప్రాంగణం) అనే ఆసుపత్రిని స్థాపించారు. అక్కడ గ్రుడ్డివారు చూపుపొందారు, కుంటివారు నడవగలిగారు, చెవిటివారు వినికిడి శక్తిని పొందారు, మరియు మంచి విలువలతో జీవించుటకు వారందరికీ సలహాలు, సూచనలు ఇవ్వబడ్డాయి.


కానీ, బాక్సర్ తిరుగుబాటు వలన అతని పనిని తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. అయితే, చైనాను విడిచిపెట్టి వెళ్ళుటకు బదులుగా అతను రష్యన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరి, వైద్య సహాయం కొరకు మరింత అవసరతలో ఉన్న చైనా మరియు రష్యా దేశాలకు చెందిన బాధితులకు వైద్య సేవలను అందించారు. లియోయాంగ్ చేరుకున్న రష్యా దళాలు దానిని ధ్వంసం చేయుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, డాll వెస్ట్‌వాటర్ జోక్యం చేసుకొని, శాంతియుతంగా లొంగిపోవుటకు లియోయాంగ్ పౌరులను ఒప్పించేందుకు తనను అనుమతించమని రష్యన్ జనరల్‌ని అభ్యర్థించారు. లియోయాంగ్ పౌరులు డాll వెస్ట్‌వాటర్ వచ్చుటను చూసినప్పుడు, శత్రువుల పక్షం వహించినందుకు వారు అతనిపై ఆగ్రహముతో ఉన్నప్పటికీ, గతంలో అతను వారికి చేసిన నిస్వార్థమైన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. కాగా, వారు అతని మాటకు అంగీకరించి రష్యావారికి శాంతియుతంగా లొంగిపోయారు.


డాll వెస్ట్‌వాటర్ గనుక జోక్యం చేసుకొని యుండకపోయినట్లయితే ఆ రోజున వేలాది మంది ప్రాణాలు కోల్పోయి యుండేవారు. కావున, లియోయాంగ్ పౌరులు అతనిని ‘లియోయాంగ్ యొక్క రక్షకుడు’ అని ప్రశంసించారు. తక్షణమే ఆ పరిస్థితిని ఉపయోగించుకొని, డాll వెస్ట్‌వాటర్, దుర్బలులు మరియు పాపాత్ములైన మానవులకు మరియు న్యాయవంతుడైన దేవునికి మధ్య శాంతిదూతగా యేసు ప్రభువు ఏ విధముగా సమాధానమును ఏర్పరచారో వారికి వివరించారు. తద్వారా అక్కడి చైనీయులు నిజమైన రక్షకుని కనుగొన్నారు మరియు అక్కడ నెలకొనియున్న యుద్ధ వాతావరణం అనేక మందికి రక్షణ దినముగా మారింది.


తాను కలిగియున్న వైద్య నైపుణ్యం మరియు దేవుని ప్రేమలతో సమాజములో ఉన్నతలైనవారు మరియు డాకోట్‌లనే సాయుధులైన దొంగల సమూహమునకు చెందిన వారితో సహా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించారు డాll వెస్ట్‌వాటర్. అటువంటి ఫలవంతమైన పరిచర్య అతని యొక్క ఆరోగ్యముపై తీవ్ర ప్రభావమును చూపింది. కాగా, కోలుకొనుటకు అతను స్కాట్లాండుకి తిరిగి వెళ్ళారు గానీ, 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో అతనిని తన పరమ వాసస్థలములో చేర్చుకొనుట దేవుని చిత్తమైయున్నది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, కనికరముతో కూడిన మీ క్రియల ద్వారా మీ రక్షకుడు మహిమపరచబడుతున్నాడా?

ప్రార్థన :

"ప్రభువా, ఇతరులకు మీ శాంతిని అందించే ఒక మాధ్యమముగా నన్ను చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment