Pages

Oct 22, 2021

Susan Higgins | సూసన్ హిగ్గిన్స్

సూసన్ హిగ్గిన్స్  | Susan Higgins జీవిత చరిత్ర




  • జననం: 1842
  • మహిమ ప్రవేశం: 03-07-1879
  • స్వస్థలం: మెయిన్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: యోకోహామా, జపాన్

అమెరికాకు చెందిన సూసన్ హిగ్గిన్స్ జపాన్‌లో ఒక ప్రముఖ మహిళా మిషనరీ. క్రైస్తవ బోధకుల కుటుంబంలో జన్మించిన ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన బాలికగా ఎదిగారు. సూసన్ యొక్క చిన్నతనంలోనే మరణించిన ఆమె తల్లియైన శారా హిగ్గిన్స్ ఆత్మీయపరంగా ఆమెకు మాదిరిగా నిలిచారు. "నాకు పదకొండేళ్ళ వయసు ఉన్నప్పుడు నా రక్షకుని గాయపడిన హస్తాలు నా హృదయ ద్వారమును సున్నితముగా తట్టుట నాకు స్పష్టముగా గుర్తుంది" అని తన రక్షణ అనుభవము గురించి వివరిస్తారు సూసన్.


క్రైస్తవ అనుభవం ప్రారంభంలో ఆమె మిషనరీ సేవ పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచారు. పాఠశాల చదువు పూర్తిచేసుకొనిన తరువాత ఆమె ఏదో ఒకరోజున దేవుడు తనను పరిచర్యకై పిలవవచ్చనే ఆలోచనతో ఆనందించేవారు. కొన్నిసార్లు క్రైస్తవాలయంలో కానుకల కొరకు ప్రకటించబడినప్పుడు, ఒక యవ్వన బాలికగా స్వంత డబ్బును కలిగిలేని ఆమె "నన్నే నేను అర్పించుకుంటున్నాను" అని వ్రాసి కానుకల పెట్టెలో వేయవలెనని ఉవ్విళ్ళూరేవారు. అయితే, ఆమె బిడియం మరియు దేవునికి సేవ చేయుటకు తాను అర్హురాలు కాదు అనే భావన మిషనరీ సేవకు సమర్పించుకొనకుండా ఆమెను నిరోధించాయి.


1878వ సంll లో ఒక రోజు ఆమె ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ (డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. - మహిళా విదేశీ మిషనరీ సొసైటీ) సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మహిళ సూసన్ వద్దకు వచ్చి, "మేము నిన్ను కొంతకాలం మిషనరీగా పంపగలమని అనుకుంటున్నాను" అని చెప్పింది. "ఎప్పుడైనా సరే" అనునది సూసన్ యొక్క తక్షణ ప్రతిస్పందన. త్వరలోనే, డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. సంస్థ ఆమెను జపాన్‌లోని యోకోహోమాలో పని చేయుటకు నియమించింది. అది క్రైస్తవులకు ఎంతో కష్టమైన ప్రదేశం.


1878వ సంll నవంబరు మాసంలో యోకోహామా చేరున్నారు సూసన్. వెంటనే ఆమె జపనీస్ భాషను నేర్చుకొనుట ప్రారంభించారు. ఆమె ఆంగ్లమును బోధించే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు మరియు పిల్లల కొరకు ఆదివారపు పాఠశాలను (సండే స్కూల్) కూడా నిర్వహించారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె జపనీస్‌ భాషలో బైబిలు తరగతులను కూడా నిర్వహించడం ప్రారంభించారు. ఆమె కేవలం క్రీస్తు కొరకు పిల్లలను సంపాదించుట పైనే తన దృష్టిని కేంద్రీకరించలేదు కానీ, వారి గృహములోను మరియు సమాజములోను వారు స్వతహాగా సాక్ష్యులుగా నిలబడుటకు వారిని ప్రేరేపించుట పై కూడా తన దృష్టి సారించారు. ఆమె పాఠశాల ప్రయోజనాల నిమిత్తం సమీప గ్రామాలను సందర్శించేవారు. ఆ సందర్భాలను ఆమె సువార్తను ప్రకటించుటకు అవకాశాలుగా ఉపయోగించుకున్నారు.


అయితే పరిచర్య చేసిన ఒక సంవత్సర కాలంలోనే ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. తన సమయం వచ్చిందని గ్రహించిన ఆమె తన చుట్టూ పిల్లలను సమకూర్చుకొని ఒక పాట పాడమని వారిని అడిగారు. పిల్లలు ఆఖరి చరణమును పాడుచుండగా దేవునిలో శాశ్వత విశ్రాంతిని పొందారు సూసన్ హిగ్గిన్స్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ కానుకల కంటే ఎక్కువగా దేవుడు మీ సేవనే కోరుకుంటున్నాడని ఎల్లప్పుడూ మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, నన్ను నేను మీకు అర్పించెదను. మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment