Pages

Oct 22, 2021

James Herbert Lorrain | జేమ్స్ హెర్బర్ట్ లోరైన్

జేమ్స్ హెర్బర్ట్ లోరైన్  | James Herbert Lorrain జీవిత చరిత్ర




  • జననం: 06-02-1870
  • మహిమ ప్రవేశం: 01-07-1944
  • స్వదేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం


1890వ సంll లో ప్రమాదకరమైన మిజో తెగలవారిచే అపహరించబడిన ఆంగ్లేయులకు చెందిన ఒక ఆరేళ్ల బాలికను గురించిన కథ వార్తాపత్రికలో ప్రచురించబడింది. దానిని చదువుతున్న ఒక క్రైస్తవ టెలిగ్రాఫిస్ట్ మిజో తెగలపై ఆగ్రహించలేదు గానీ, క్రీస్తు కొరకు వారి జీవితములను మార్చవలెననిన భారముతో నింపబడ్డారు. ఆ వ్యక్తి ఈశాన్య భారతదేశంలోని తెగల మధ్య తాను చేసిన పరిచర్యకు పేరుగాంచిన జేమ్స్ హెర్బర్ట్ లోరైన్.


లోరైన్ దేవునియందు భయభక్తులు కలిగిన యవ్వనస్థుడు మరియు లండన్‌ నగరంలో మంచి ఉద్యోగమును కలిగియున్నారు. అయితే, మిజో తెగల పట్ల అతను కలిగియున్న దేవుని ప్రేమ అతను తన ఉద్యోగమును విడిచిపెట్టి, వారి మధ్యకు వెళ్ళి పరిచర్య చేయుటకు అతనిని బలవంతపెట్టింది. కాగా, 1891వ సంll లో కలకత్తా చేరుకున్న లోరైన్, మిజో తెగల పట్ల అటువంటి భారమునే కలిగియున్న ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్‌ని కలుసుకున్నారు. వారిరువు కలిసి మిజోరాం చేరుకొనుటకు ఎంతో ప్రమాదకరమైన ప్రయాణమును చేపట్టారు.


త్రిపుర మీదుగా మిజోరాం చేరుకొనుటకు లోరైన్ చేసిన మొదటి ప్రయత్నం ఆ ప్రాంతాలలో తెగల మధ్య పోరాటాలు జరుగుతుండడం వలన సఫలం కాలేదు. చివరికి ఏదో ఒక విధంగా అతను ఐజ్వాల్‌కు సమీప గ్రామమైన కసలాంగ్‌కు చేరుకుని, ఐజ్వాల్‌ నగర వెలుపల తన గుడారము వేసుకున్నారు. తన పరమ యజమానుని యొక్క అడుగుజాడలలో నడుచుటకు ఎంచుకొనిన అతను, సువార్తతో ఆ ప్రజలను చేరుకొనుటకు అనేక నెలలు పాటు నగరము వెలుపల ఉండి శ్రమపడ్డారు. తీవ్రమైన అనారోగ్యం కూడా ఈ యువ మిషనరీని అడ్డుకొనలేకపోయింది. చివరికి 1894వ సంll జనవరి 11వ తారీఖున లోరైన్ ఐజ్వాల్‌లోకి ప్రవేశించారు. ఆ రోజును ఇప్పుడు మిజోరంలో “మిషనరీ దినము” గా జరుపుకుంటారు. ఆ తెగలపై అతను చూపిన ప్రభావం అటువంటిది.


ప్రారంభంలో మిజో తెగలు లోరైన్‌ని అనుమానించి, అతనితో ఎలాంటి సంబంధాలనైనా కలిగియుండుటకు తిరస్కరించారు. అయితే కొందరు తమ భాషయైన లుషాయ్ భాషను అలవోకగా మాట్లాడుతున్న ఈ శ్వేతజాతీయుని చూసి ఆకర్షితులయ్యారు. త్వరలో, సావిడ్జ్‌తో కలిసి ఆ భాషకు అక్షరమాలను రూపొందించి, సువార్తలను లుషాయ్‌ భాషలోకి అనువదించారు లోరైన్‌. దేవుని వాక్యం ప్రజలలో శక్తివంతంగా వ్యాపించింది. ఒకప్పుడు ఆటవికులుగా ఉన్న ఆ తెగలు ఇప్పుడు నమ్మకమైనవారిగా, అక్షరాస్యులుగా మరియు ప్రగతిశీల సమాజముగా మారారు.


లోరైన్ తన సోదరుడు రెజినాల్డ్ ఆర్థర్ లోరైన్‌తో కలిసి లాఖర్ తెగల మధ్య మొట్టమొదటిగా మార్గదర్శకమైన పరిచర్యలను నడిపించారు. రెండంచెలుగా ప్రజలలో మార్పును తీసుకువచ్చుటను అతను విశ్వసించారు. అదేమంటే, మొదట అన్యులైన వారిని క్రైస్తవులుగా మార్చడం, అటు పిమ్మట క్రైస్తవులుగా మారిన వారిని క్రైస్తవ నాయకులుగా తీర్చిదిద్దడం. అతని ప్రయత్నాల వలన నేడు మిజోరాం స్వదేశీ సంఘ నాయకులను కలిగి బహుగా అభివృద్ధి చెందుతున్న స్వయంప్రతిపత్త క్రైస్తవ సంఘములతో తూలలాడుతుంది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు మీ కోపమును అధిగమించి, మిమ్ములను బాధించిన వారికి సేవ చేయగలరా?

ప్రార్థన :

"ప్రభువా, నన్ను బాధించినవారిని వెంటనే క్షమించి, వారికి మీ ప్రేమను కనుపరచుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment