Pages

Oct 22, 2021

John Cutting Berry | జాన్ కటింగ్ బెర్రీ

జాన్ కటింగ్ బెర్రీ | John Cutting Berry జీవిత చరిత్ర




  • జననం: 16-01-1847
  • మహిమ ప్రవేశం: 09-02-1936
  • జన్మస్థలం: మెయిన్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: జపాన్

క్రైస్తవుల పట్ల వ్యతిరేకత ఉన్న పరదేశంలో ఒక మిషనరీగా ఉండి గౌరవమర్యాదలను అందుకొనడం అంత సులభమైన విషయం కాదు. అమెరికాకు చెందిన ఒక వైద్య మిషనరీ అయిన జాన్ కటింగ్ బెర్రీ జపాన్ ప్రభుత్వం ఇచ్చే గౌరవార్థమైన అవార్డు అయిన “ఆర్డర్ ఆఫ్ ది సేక్రెడ్ ట్రెజర్‌” (3వ తరగతి) ను అందుకున్నారు. జపానీయులు అతని జీవిత చరిత్రను ప్రచురించారు. జపానీయులు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి గురించి వ్రాసిన మొట్టమొదటి జీవిత చరిత్ర ఇది. వారు అతనిని జపాన్‌లో జైలు సంస్కరణ పితామహునిగా పరిగణిస్తారు.


తన నాలుగేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన బెర్రీ, పదకొండేళ్ళ వయస్సు నుండి తన జీవనం కొరకు పని చేయడం ప్రారంభించారు. అతనికి ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను నడుపుతున్న ఓడ తుఫానులో చిక్కుకుంది. అయితే ఆ ఉపద్రవం నుండి అతను ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, తనను కాపాడుటలో దేవుడు ఒక ఉద్దేశ్యమును కలిగియున్నాడని తలంచిన బెర్రీ, తన మిగిలిన జీవితమును దేవుని సేవ చేయుటకు సమర్పించుకున్నారు.


అనేక ఇతర మిషనరీల వలెనే బెర్రీ కూడా ప్రజలకు ఆత్మీయ స్వస్థతను చేకూర్చే ఒక మార్గంగా వారి శారీరక వేదనకు ఉపశమనం కలిగించుటకు ఎంచుకున్నారు. వైద్యశాస్త్రంలో పట్టభద్రులయ్యాక అతను 1872వ సంll లో జపాన్‌కు వచ్చారు. అక్కడ అతను కోబ్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఆఫ్ కోబ్ యొక్క మెడికల్ డైరెక్టర్‌గా పనిచేశారు. వారికి తాను బైబిలు నుండి చదివి వినిపించుటకు పేదవారు గనుక అంగీకరించినట్లయితే అతను తన సేవలను వారికి ఉచితముగానే అందించేవారు. కోబ్‌లో అతను పేదవారి కొరకు ఒక క్లినిక్‌ను కూడా స్థాపించారు. జపాన్ దేశ వైద్యులతో కలిసి అతను సంద అనే ప్రాంతములో జపాన్ యొక్క మొట్టమొదటి ధార్మిక ఆసుపత్రిని  స్థాపించారు.


1873వ సంll లో అతను కోబ్‌లోని చెరసాలను సందర్శించడం జరుగగా, అక్కడి ఖైదీల దారుణమైన పరిస్థితులను చూసి కనికరముతో చలించిపోయారు. ఆ తరువాత అతను జైలు వ్యవస్థను సంస్కరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనేక ఇతర మిషనరీలు అతని అడుగుజాడలను అనుసరించగా, ఇది జపాన్‌లో జైలు సంస్కరణ ఉద్యమానికి బీజమయ్యింది. అంతేకాకుండా, అతను ఒసాకా, క్యోటో, హైగో మరియు హరిమాలోని చెరసాలలను కూడా సందర్శించి, వాటిపై నివేదికలు తయారుచేయగా, అవి జపాన్ జైలు వ్యవస్థలో మార్పులకు దోహదపడ్డాయి.


జపాన్‌లో పలు ప్రాంతాలలో నిర్విరామంగా పనిచేసిన పిమ్మట, 1894వ సంll లో అమెరికాకు తిరిగి వచ్చారు బెర్రీ. 88 సంll ల వయస్సు వరకూ వైద్య సేవలను అందిస్తూనే ఉన్న అతను, పేదల పట్ల ఎల్లప్పుడూ కనికరమును కలిగియుండేవారు. 89 ఏళ్ళ మంచి వృద్ధాప్యమందు ఈ లోకములో తన పరుగును ముగించి ప్రభువునందు విశ్రమించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు పాపం అనే తుఫాను నుండియు నిత్యమరణమనే ఉపద్రవం నుండియు రక్షించబడ్డారు. మిమ్ములను రక్షించుటలో దేవుని ఉద్దేశ్యమేమైయున్నదో మీరు గ్రహించారా?

ప్రార్థన :

"ప్రభువా, నన్ను రక్షించినందులకు వందనములు. నా మిగిలిన జీవితమును మీ సేవ చేయుటకే జీవించెదను. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment