Pages

Oct 31, 2021

Martin Luther | మార్టిన్ లూథర్

Martin Luther | మార్టిన్ లూథర్



ఒక్క ఆలోచన ప్రపంచ క్రైస్తవ్యాన్నే మర్చివేసింది,
ఆ ఆలోచనే క్రైస్తవ్యంలో ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాంది పలికింది, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్కరణోద్యమ నేత–మార్టిన్ లూథర్ (Martin Luther 1483-1546)

అక్టోబర్ 31 మార్టిన్ లూథర్ గారి జయంతి

ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది, అలాగే ప్రతి సంఘానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను రాసే వాళ్లు కొందరైతే దాన్ని తిరగరాసే వాళ్లు మరి కొందరు. కానీ ఆ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగల వ్యక్తులు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు, అలాంటి వారిలో మార్టిన్ లూథర్ ఒకరు.

2తిమోతి 3 :16-17 లో ఉన్న విధంగా

“ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కర్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును , తప్పు దిద్డుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది “.

16వ శతాబ్దంలో క్రైస్తవ సాధువుగా ఉండి ఆనాటి మత గురువుల వాక్య విరుద్ధ అక్రమాలపై సమరశంఖాన్ని పూరించి, వారి ఆగడాలను అరికట్టి సంఘ చరిత్రలో పెనుమార్పులు తెచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్. నేటి క్రైస్తవులు వెలుగును పొంది ఇంత గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించ గలుగుతున్నారంటే అది మార్టిన్ లూథర్ కృషి ఫలితమే. ఈ పోరాటంలో ఆయన ఎంతో చెమటోడ్చి, మరెన్నో ఇబ్బందులను,మరణాపాయాలను ఎదుర్కొని సంస్కరోణోద్యమాన్ని విజయపథం వైపు నడిపించాడు.

వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. పేదలకు సాయం చేసేవాడు,అవసరంలో ఉన్నవాళ్ళకి అప్పిచ్చేవాడు పాపపరిహార పత్రికల్ని కొనడం కంటే మంచి పని చేస్తున్నాడనే ఆర్థం ఈ సూక్తులు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది మార్టిన్ లూథర్. క్రైస్తవుడైనప్పటికి క్రైస్తవ్యంలో వాక్య విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలపై సమర శంఖారావం పూరించిన వ్యక్తిగా మార్టిన్ లూథర్ చరిత్ర పుటల్లో నిలిచారు.

మతంలో విప్లవాలు, సమాజంలో లిబరల్ భావాలు పెంచడానికి, ప్రజలను ఆలోచింపచేయడానికి గతకాలంలో సంస్కరణోద్యమాలు దోహదకారి అయ్యాయి. జీవితంలో అన్ని రంగాలపై వాక్య విరుద్దంగా మతం కారు మబ్బులాగా కమ్ముకుని ఉన్నప్పుడు మతాధికారులు, వారి వందిమాగదులు ఆడిందే ఆట. పాడిందే పాటగా రాజ్యమేలుతుండేది.

వారు చేసిన వాక్య విరుద్ధమైన అన్యాయాలు, అక్రమాల వల్ల క్రైస్తవ్యం ప్రతిష్ట అడుగంటింది. ప్రజలు భరించలేనంత దుర్మార్గత్వం ప్రబలినపుడు కొందరు చైతన్య వంతులైన మతాధికారులు, ప్రజలు తిరగబడ్డారు.అలా మతాలలో వచ్చిన తిరుగుబాటులు కాలక్రమేణా మూఢనమ్మకాలను అంతమొందించడానికి, ప్రజల అజ్ఞానాన్ని,నిస్సహాయతను తగ్గించడానికి తోడ్పడ్డాయి.

మధ్యయుగాలలో క్రైస్తవమార్గాన్ని మతంగా మార్చిన రొమాన్లు యూరప్ లో క్రైస్తవమతంలోని రోమన్ కేథలిక్ పోప్ అధికారం అధికంగా ఉన్నప్పుడు రాజులు సైతం పోప్ కు దాసోహం కావలిసి వచ్చింది. వాక్య విరుద్ధ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు వాటిల్లో ముఖ్యమైనవి క్రైస్తవ మతగురువులు,ముఖ్యంగా రోమన్ కేథలిక్కులు, పెళ్ళి చేసుకోకూడదని నియమం పెట్టారు. కాని, పిల్లల్ని కనకూడదని ఆంక్ష లేదు కనుక, పెద్ద మత గురువుల నుండి చిన్న వారి వరకు అవినీతికి, అక్రమాలకు ఆలవాలమై గంపెడు సంసారంతో ఉండేవారు.మాటలకి-చేతలకి ఎంతో వ్యత్యాసం ఉండేది.

15 వ శతాబ్దం లో మత యుద్దలైన క్రూసేడ్ లలో చివరికి మహమ్మదీయులదే పైచేయి అయి కాన్ స్టంటి నోపుల్ పట్టణం పతనం కావడంతో ఆధునిక యుగం ఆరంభమయింది.
దేవుని వాక్యానికి విధేయులై నీతికి నిజాయితీకి,దైవభక్తికి ప్రతీకగా ఉండ వలసిన మతగురువులు స్వార్థ చింతనకు, భోగలాల సత్వానికి, కుట్రలకు,కుతంత్రాలకు, ముఠా తగాదాలకు నిలయాలుగా మారారు.

మతాన్ని సంస్కరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవినీతి, అక్రమాలు క్రైస్తవ వటవృక్షం వేళ్లు తినడం ప్రారంభించాయి. మతగురువులకు ఎంతోమంది భార్యలు, పిల్లలు, తమ కుటుంబీలకు ఆస్తిపాస్తులు సమకూర్చడానికి వారు పడే తాపత్రయం ఇంతా అంతా కాదు. పోప్ ఇటాలియన్ కావడంతో వివిధ దేశాలలో అధిపతులు ఇటాలియన్లే అయ్యేవారు. వారి పెత్తనం అప్పుడే చిగురిస్తున్న జాతీయభావానికీ, స్వదేశాభిమానానికీ ఇబ్బందిగా మారింది.

యూరప్ లోని రాజుల నుండి, ధనవంతుల నుండి డబ్బు గుంజి పోప్ అనుచరులు రోమ్ లో అందమైన ఆకాశహర్మ్యాలను నిర్మించుకున్నారు.ఆశకు అంతం ఉండదు కదా. ఇంకా డబ్బు రాబట్టడానికి వాక్య విరుద్ధంగా పాప పరిహార పత్రాలు ప్రారంభించారు.

ఈనాడు మన రాజకీయ రంగంలో మోసగాళ్లు ప్రవేశించినట్లే, టెడ్జల్ అనే వ్యక్తి జర్మనీ అంతా పాప పరిహార పత్రాలు అమ్మి, మంచినీళ్లప్రాయంగా డబ్బు వసూలు చేసి, పోపుకు ధారాళంగా డబ్బు పంపడం ప్రారంభించాడు. చేసిన పాపం చెబితే పోతుంది అనే నానుడి. దాన్ని సంధర్బానుసారంగా వాడుకోవడానికి టెడ్జల్ ఏజంట్లు తయారయ్యారు చెయ్యబోయే పాపం ముందుగా పోపుకు డబ్బిస్తే పోతుందని అంటూ కొత్త పరిహార పత్రాలను సృష్టించారు. ఇక అక్కడి నుంచి మతంలో భక్తికి,ముక్తికి డబ్బే ప్రధాన సాధనమైంది.

ప్రజలు దైవ మార్గాన్ని మరిచి మతాంధకారంలో మగ్గిపోతున్న కాలంలో దానిని ఎలుగెత్తి చాటడానికి దేవుడు పంపిన ఓ నిలువెత్తు రూపం భూమి మీద కొచ్చింది. ఆ రూపమే మార్టిన్ లూథర్. వాక్య విరుద్దంగా పతనమవుతున్న మత వ్యవస్థను కళ్లారా చూసి చలించి పోయాడు. మతాధికారుల దుర్మార్గాల నుంచి ప్రజలను చైతన్యం చేసి నిజ దైవ మార్గంలో వాక్యానుసరంగా నడిపించాలని బృహత్తర బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు.

వాక్యా వ్యతిరేక మత మౌడ్యం జడలు విప్పి కాలనాగులా బుసలు కొడుతున్న కాలమది. ఎటుచూసినా మతాధికారుల దౌర్జన్యాలే. వారు చేస్తున్న అరాచకాలే. అలాంటి వాతావరణంలో 514 సంవత్సరాల క్రితం క్రీ. శ 1483 నవంబర్ 10 న జర్మనీలో ఎస్ బ్లేన్ లోని ఒక గని కార్మికుని కుటుంబంలో మార్టిన్ లూథర్ జన్మించారు. ఆయన తండ్రి రాగి గనుల్లో పనిచేసే కార్మికుడే అయినప్పటికీ మార్టిన్ ను ఉన్నత చదువులు చదివించాడు.

మార్టిన్ క్రీ.శ 1501లో ఎర్బర్ట్ విశ్వ విద్యాలయ విద్యార్థిగా విద్యను అభ్యసించాడు. అక్కడే ఉంటూ గ్రంథాలయంలో ఉన్న “బైబిల్”ను అవసోపన పట్టారు. లూథర్ తన 22వ ఏట ఎర్పర్ట్ లోని అగస్టీనియన్ క్రైస్తవమఠంలో చేరారు. ఆ తర్వాత ఆయన విటెన్ బర్గ్ విశ్వ విద్యాలయంలో చేరి మతధర్మ శాస్ర్తంలో డాక్టరేట్ సంపాదించాడు.
అ యూనివర్శిటీలోనే ప్రొఫెసర్ గా కొంత కాలం పనిచేశారు.

కొంతకాలంపాటు లూథర్ భక్తిశ్రద్ధలతో రోమ్ లోని పోప్ దగ్గరకు వెళ్లేవాడు. అయితే లూధర్ తానే దేవుని అనుగ్రహం పొందడానికి అనర్హుడనని భావించారు.కొన్ని సార్లయితే అపరాధ భావంతో నైరాశ్యంలో కుమిలిపోయే వారు.కానీ దేవుడు పాపులను ఎలా సృష్టిస్తాడనే దానిపై బైబిల్ ను ఔపోసన పట్టారు.దేవుని అనుగ్రహం కష్టపడి సంపాదించుకునేది కాదని బదులుగా అది విశ్వసించే వారికి ఉచితంగా కృపతో అనుగ్రహించబడుతుందని లూధర్ గ్రహించారు.

మతం కుళ్ళు కంపు, ధనదాహం కళ్లారా చూశాడు.పతనమైన మత వ్యవస్థ ను కళ్ళారా చూచిన లూధర్ పాప పరిహార పత్రాలు జర్మన్ రాజులకు,ధనవంతులకు అమ్మడాన్ని ప్రత్యక్షంగా చూచి, వారు చేస్తున్న దుర్మార్గాన్ని సహించ లేక పోయాడు.దేవుడు పాపులను ఎలా దృష్టిస్తాడనే విషయంలో లూథర్ కు కలిగిన అవగాహన రోమన్ క్యాథలిక్ చర్చితో ఆయనకు విరోధాన్ని తెచ్చిపెట్టింది. డబ్బు తీసుకుని పోపు అధికారంతో ఇవ్వబడే పాప పరిహార పత్రాలను అమ్మే దురాచారం మార్టిన్ కు ఆగ్రహం తెప్పించింది. మానవులు దేవునితో బేరసారాలు చేయలేరని చర్చి ఆర్థికంగా,సిధ్దాంత పరంగా,మత పరంగా దురాగతం చేస్తోందని ఆరోపిస్తూ 95 ప్రశ్నలను రూపొందించాడు.

గుటెన్ బర్గ్ చర్చి గోడపై 95 ప్రశ్నలతో దేవుడు పాపం చేసిన తరువాత క్షమిస్తాడు గాని, చెయ్య బోయే పాపా నికి రక్షణ కల్పించ మని డబ్బు ఇవ్వడమనే ఈ అడ్వాన్సు బుకింగ్ ఏమిటి? అని సూటిగా ప్రశ్నించాడు. రాజుల దగ్గరకు వెళ్లి విడమర్చి చెప్పాడు. పోప్ లూధర్ ను బుజ్జగించడానికి ప్రయత్నించాడు. కాని, దైవ విధేయుడైన లూధర్ ప్రలోభాలకు లోను కాలేదు సరికదా, పోప్ మోసంలో పడవద్దని ఎలుగెత్తి చాటాడు. అప్పుడప్పుడే ప్రబలుతున్న జర్మన్ జాతీయతా భావం లూధర్కు మరింత బలం చేకూర్చింది.

★లూధర్ ఆర్థికంగా దెబ్బకొట్టడంతో పోప్ అతనిని మతం నుండి బహిష్కరించాడు. అయినా అంతవరకు దైవాంశ సంభూతునిగా చెలామణి అయిన పోప్ బండారం బయట పడడంతో కథ అడ్డం తిరిగింది. జర్మన్ రాజులు సమావేశమై లూధర్ను మతంనుండి బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు.
★ ఈ రకంగా పోప్ను ప్రశ్నించిన వారంతా “ప్రొటెస్టాంటులయ్యారు”. దానితో క్రైస్తవ మతంలో పోప్ ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది.

లూధర్ బైబిల్ను స్వయంగా జర్మన్ భాషలోకి అనువదించారు. అంతకుముందు మనదేశంలో మత గ్రంథాలు సంస్కృతంలో ఉన్నట్లే, బైబిల్ ప్రజలకు అర్థంకాని లాటిన్లో ఉండేది. జర్మన్ భాషలో అప్పుడే వచ్చిన ప్రింటింగ్ ప్రెస్లో అచ్చువేసి ఇవ్వడంతో ప్రజలకు బైబిల్లో ఉన్న దేవునివాక్యం అర్ధమయ్యేసరికి పెద్ద విప్లవం వచ్చింది.

బైబిల్లోని వాక్యం అర్థం చేసుకోవడానికి మార్టిన్ ఓ పెద్ద విప్లవాన్నే సృష్టించాడు. మతాలకు చెందిన ఆస్తులను ప్రభుత్వమే కాపాడాలని పోప్ లు అందులో తల దూర్చరాదని గట్టిగా నొక్కి చెప్పారు.మార్టిన్ లూథర్ మాటలకు జనాలు, రాజులు ఆకర్షితులై ఆయన వెంటే నడిచారు. ఆ దెబ్బతో దైవ అవిధేయుడైన పోప్ తన ఆస్తులను సర్వం కోల్పోయాడు.

పోప్ విధానాలను వారి ఆగడాలను మార్టిన్ లూధర్ దుయ్యబట్టాడు. రోమన్ కేథలిక్ మతంలో గల ఉపవాసాలు, తీర్థయాత్రలు, దైవదూతలను పూజిం చడం, క్రైస్తవ మాస్ అనవసరం అని లూదర్ ప్రకటించాడు. మత గురువులు పెళ్ళిచేసు కోకుండా ఉండాలనే నియమం తప్పు అన్నాడు. తానే స్వయంగా ఒక నన్ ను పెళ్లిచేసుకున్నాడు.దైవసాక్షాత్కారానికి మతగురువుల మధ్యవర్తిత్వం అక్కరలేదని చెప్పాడు. పోప్ బదులు ఆయా దేశాలలో ప్రభుత్వమే మత ఆస్తులను సంరక్షించాలన్నాడు.

దానితో రాజులు, ప్రజలు పోప్ ను వదిలి, లూధర్ పక్షాన చేరారు. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు లూధర్ను లొంగదీసి అక్రమ సంపాదన పోప్ అనుభవిద్దా మనుకొంటే తన ప్రాబల్యాన్ని, వివిధ దేశాలలో మత ఆస్తులపై పెత్తనాన్ని కూడా పోప్ కోల్పోయాడు. దీనితో పోప్ లూధర్ను సమర్థించే రాజులతో 30 సంవత్సరాలు యూరప్ లో యుద్ధం చేశాడు. రక్తం ఏరులై పారింది.చివరకు రాజు ఏ మతం వాడు అయితే, ప్రజలు కూడా ఆ మతం వారు కావాలని సంధి కుదిరింది.రాజు ప్రొటెస్టాంటు అయితే, ప్రజలు కూడా అంతే కావాలన్నది ఆనాటి నినాదం. యథా రాజా, తథా ప్రజా అన్నది అక్షర సత్యమైంది. జనాన్ని గొర్రెలుగా భావించారు. ప్రజాస్వామ్య భావమే లేని సమాజం అది.

లూధర్ మాటల నుండి స్ఫూర్తి పొంది, మతం చేసే దారుణ దోపిడీని సహించేదిలేని రైతుల తిరుగుబాటును లూధర్ సమర్థించలేదు. లూధర్ జర్మన్ రాజులకు వత్తాసు పలికాడు.దానితో లక్షలాది మంది తిరుగుబాటుదారులను ఊచకోత కోశారు. మత సంబంధాల విషయంలో లూధర్కు విప్లవ భావాలు ఉన్నా, సామాజిక, ఆర్థిక సంబం ధాల విషయంలో విప్లవాత్మక భావాలు లేవు.

ఏ చర్చి గోడకైతే 29 సంవత్సరాల క్రితం క్రీ.శ 1517అక్టోబర్ 31 న లూదర్ పోప్ను ప్రశ్నిస్తూ,ప్రశ్నలంటించి క్రైస్తవ మతంలో గొప్ప విప్లవానికి కారకుడయ్యాడో, అదే ఊళ్ళో అంటే విటెన్ బర్గ్ లో క్రీ.శ1540 ఫిబ్రవరి 28 న లూధర్ మరణించాడు. మతం పేరట మారణహోమం లూధర్ అనంతరం కూడా కొనసాగింది. లూధర్ క్రైస్తవ మతంలో ఒక మహా విప్లవానికి కారకుడయ్యాడు. పోప్ ఆధిపత్యం అంతరించి, జాతీయ ప్రభుత్వం సహకారం ప్రొటెస్టాంటు వర్గానికి లభించింది. ఈ విధంగా మతంలో వచ్చిన విప్లవం రానురాను ప్రజాస్వామిక చైతన్యం పెంచడానికి, మత మౌఢ్యం నుండి బయటపడి చివరకు సెక్యులర్ పంథాలో వాక్యానుసరంగా క్రైస్తవ మార్గంలో యూరప్ పురోగమించడానికి మార్గం సుగమం చేసింది.

లూథర్, కాల్విన్, స్వింగ్లి వంటి వారిచేత పురికొల్పబడిన సంస్కరణ, మతాన్ని ఒక కొత్త కోణంలోంచి చూడడానికి దారి తీసింది, అది ప్రొటస్టెంటిజమ్ అని పిలువబడుతోంది. లూథర్ ప్రొటస్టెంటిజమ్ కు వారసత్వంగా వదిలేసిన గొప్ప ఆస్తి ఏమిటంటే, విశ్వాసం ద్వారా తీర్పుతీర్చబడడం అనే తన ప్రధాన బోధ.జర్మనీలోని ప్రభుత్వాలన్నీ ప్రొటస్టెంటు మతానికి లేదా క్యాథలిక్ విశ్వాసానికి మద్దతుగా నిలబడ్డాయి. ప్రొటస్టెంటిజమ్ వ్యాప్తి చెంది స్కాండినావియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్,నెదర్లాండ్స్ లో ప్రజల మద్దతును సంపాదించుకుంది. నేడు దాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారు కోట్లలో ఉన్నారు.

చాలామంది, లూథర్ విశ్వాసాలన్నింటిని విశ్వసించకపోయినా ఆయనను ఎంతో గౌరవిస్తారు.ఐస్లేబన్, ఎర్ఫర్ట్, విట్టెన్బర్గ్, వార్ట్బర్గ్ లో తన సరిహద్దుల్లో ఉన్న పూర్వపు జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 1983 లో లూథర్ 500 వ జయంతి చేసుకుంది. ఈ సోషలిస్ట్ రాష్ట్రం ఆయనను జర్మనీ చరిత్రలోను సంస్కృతిలోను ఒక విశిష్ఠమైన వ్యక్తిగా గుర్తించింది. అంతేకాదు 1980 లలోని క్యాథలిక్ మత పండితుడు ఒకాయన లూథర్ తర్వాత వచ్చిన వారెవ్వరూ ఆయనకు సాటికాలేకపోయారంటూ ఆయన కీర్తిని చాటి చెప్పారు.

మార్టిన్ లూథర్ లో నిశితమైన మేధ,అసాధారణమైన జ్ఞాపకశక్తి, పదాలలో ప్రావీణ్యత,అత్యున్నత కార్యశీలత ఉన్నాయి. ఆయనలో ఓర్పులేమి, కొంచెం నిర్లక్ష్యం వంటి లక్షణాలు కూడా ఉండేవి. చిన్నపాటి విషయాన్నిక్కూడా ఒక్కొక్కసారి ఉద్రేకపడేవారంటారు. లూదర్ 1546, ఫిబ్రవరిలో ఐస్లేబన్ లో మరణశయ్యపై ఉన్నప్పుడు, తను ఇతరులకు బోధించిన విశ్వాసాల విషయంలో ఆయన స్థిరంగా ఉన్నాడా అని ఆయన మిత్రులు అడిగితే అందుకాయన ఉన్నాను అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.
లూథర్ మరణించినా ఆయన అనుసరించిన విధానాల్ని మాత్రం చాలామంది ఇప్పటికీ ఆనుసరిస్తూనే ఉన్నారు.. ఆచరిస్తూనే ఉన్నారు…

ఇలాంటి రోషం కలిగిన యవ్వన దైవజనులు నేటితరంలో కూడా అవసరం…

Source :Truth Research Center of India

No comments:

Post a Comment