Pages

Nov 4, 2021

Mary Bird | మేరీ బర్డ్

మేరీ బర్డ్  | Mary Bird




జననం: 1859
మహిమ ప్రవేశం: 16-08-1914
స్వస్థలం: డర్హామ్
దేశం: ఇంగ్లాండు
దర్శన స్థలము: జుల్ఫా మరియు ఇస్ఫహాన్, ఇరాన్

మేరీ రెబెక్కా స్టీవర్ట్ బర్డ్ ఇరాన్‌లో ప్రభువుకు సేవ చేసిన బ్రిటిష్ మిషనరీ. తనకు ఐదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి యొక్క ఒక మిషనరీ స్నేహితుని ద్వారా ఆఫ్రికా గురించి వినిన మేరీ, ఆ చిన్న ప్రాయంలోనే తన జీవితమును మిషనరీ సేవకై సమర్పించుకున్నారు. ఆనాటి సమర్పణ పట్ల ఆమె ఎంత నమ్మకముగా ఉన్నారంటే దాని కొరకు తాను ఇష్టపడిన వ్యక్తితో వివాహ ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించారు.

 కొన్ని నెలల పాటు లండన్‌ నగరంలో మిషనరీ శిక్షణ పొందిన పిమ్మట, 1891వ సంll లో పర్షియాకు పయనమయ్యారు మేరీ. అక్కడ ప్రారంభములో కొన్ని రోజులు స్థానిక భాషలను నేర్చుకొనిన ఆమె, త్వరలోనే మహిళలకు వైద్య సహాయం అందించుటకుగాను ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. ఇది సువార్త ప్రచారానికి కేంద్రంగా మారింది. ఏ పరిస్థితినైనా సందర్భానుసారంగా సువార్త ప్రకటనకు అవకాశముగా మలచే ఆమె విధానాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

  1893వ సంll లో ఒకసారి ఒక మహిళ చికిత్స పొందేందుకు తన ఎనిమిదేళ్ళ కుమార్తెతో ఆ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ మహిళ రాత్రి సమయంలో తాను సహాయం కొరకు పిలిచినప్పటికీ తన కుమార్తె స్పందించడం లేదని మేరీకి ఫిర్యాదు చేసింది. తన తల్లికి స్పందించకపోవుటకు కారణమేంటని ఆమె కుమార్తెను మేరీ అడుగగా, ఆ బాలిక చీకటి అంటే తనకు భయంగా ఉండుట వలనని బదులిచ్చింది. వెంటనే మేరీ యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, ఆమెకు ఒక స్నేహితునిగా తోడుగా ఎలా ఉంటాడో ఆ బాలికకు చెప్పారు. మరునాటి ఉదయం ఆ మహిళ మేరీని ఎంతగానో ప్రశంసించారు. కోలుకొనిన తరువాత ఆసుపత్రి నుండి వెళ్ళిపోతున్నప్పుడు, ఆమె తన గ్రామంలోని ఇతర పిల్లలకు కూడా యేసు క్రీస్తు స్నేహితునిగా ఉండగలడా అని మేరీని అడిగింది.

  చికిత్స చేసిన తరువాత ప్రతి రోగి కొరకు ప్రార్థించేవారు మేరీ. మేరీ ప్రార్థనల వలన అబ్బాస్ అనే ఒక యుక్తవయస్సు బాలునిలో ఎంత గొప్ప నిరీక్షణ నిండుకొనినదంటే, తాను కోలుకొనిన తరువాత బైబిలు తరగతులను నిర్వహించుటకు అతను తన ఇంటి ద్వారాలను తెరిచాడు. ఒకసారి ఒక ముస్లిం స్త్రీ బైబిలులోని సత్యమును గురించి వారికి చెప్పుటకు ఆమె ముందుగానే ఎందుకు రాలేదని ఆమెను ప్రశ్నించింది. ఇది ముస్లిం దేశాలలో మిషనరీ పనిని చేపట్టులాగున ఇతర దైవభక్తి గల స్త్రీలను ప్రోత్సహించుటకు మేరీని ప్రేరేపించింది.

  ఈ పరిచర్య అంతా స్థానిక ముల్లాల నుండి ఎదురైన తీవ్ర వ్యతిరేకత మరియు బెదిరింపుల మధ్య జరిగించారు మేరీ. విషం ఇచ్చి ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ వెనుకంజ వేయక పర్షియన్ మహిళల మధ్య తన వైద్య సేవను మరియు సువార్త పనిని కొనసాగించారు మేరీ. అక్కడి ప్రజలచే ‘ఖేనుమ్ మరియమ్’ అని ఆప్యాయంగా పిలువబడే మేరీ బర్డ్, టైఫాయిడ్ జ్వరం కారణంగా 1914వ సంll లో తుది శ్వాస విడిచారు.

ప్రియమైనవారలారా, మీ ప్రభువును సేవించుటకు ఇహలోక సంబంధ ప్రేమాప్యాయతలను త్యాగం చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

"ప్రభువా, ఈ లోకములో ఎటువంటి బంధం లేదా అనుబంధము కన్నా మీకు మరియు మీ పనికే నేను ప్రాధాన్యతనిచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment