Pages

Nov 5, 2021

John Hands | జాన్ హ్యాండ్స్

జాన్ హ్యాండ్స్ | John Hands




  • జననం: 05-12-1780
  • మహిమ ప్రవేశం: 30-06-1864
  • స్వస్థలం: డబ్లిన్
  • దేశం: ఐర్లాండ్
  • దర్శన స్థలము: కర్ణాటక, భారతదేశం

 మూడు దశాబ్దాలకు పైగా కర్ణాటకలో ప్రభువుకు సేవ చేసిన జాన్ హ్యాండ్స్ అంతగా ప్రసిద్ధి చెందని మిషనరీలలో ఒకరు. ఇంగ్లాండులోని గోస్పోర్ట్‌లో తన విద్యాభ్యాసమును పూర్తిచేసుకొనిన జాన్, భారతదేశంలో కన్నడ మిషన్ కొరకు పరిచర్య చేయుటకు 1809 వ సంll లో లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) వారిచే నియమించబడ్డారు. వెంటనే భారతదేశానికి పయనమైన అతను, 1810వ సంll మే 5వ తారీఖున మద్రాసు చేరుకున్నారు. పిమ్మట అతను బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఒక మిషన్ కేంద్రమును స్థాపించగా, అది తదుపరి 30 సంవత్సరాల పాటు అతను జరిగించిన పరిచర్యకు కేంద్రంగా మారింది.

 కన్నడ భాషా అధ్యయనాన్ని ప్రారంభించిన అతను, అదే సమయంలో కన్నడ నిఘంటువును కూడా సంకలనం చేయడం ప్రారంభించారు. అంతేకాదు, కన్నడ సాహిత్య రచనల కొరకు ఈనాటికీ ఉపయోగించబడే కన్నడ వ్యాకరణ పుస్తకమును కూడా ప్రచురించారు జాన్. వీటన్నింటి వెనుక ఉన్న అతని అంతిమ లక్ష్యం ఏమంటే కన్నడ ప్రజలకు వారి మాతృభాషలో బైబిలును అందించడమే.

 మరి ముఖ్యముగా అతను ఎవరికైనా సరే విద్యను వారి మాతృభాషలో అందించవలెనని విశ్వసించారు. కావున అతను 1811వ సంll లో బళ్ళారిలోను మరియు చుట్టుపక్కల ప్రాంతాలలోను కన్నడ మీడియం పాఠశాలలను స్థాపించి, వాటిని ప్రసిద్ధి చేశారు. అంతేకాకుండా, కన్నడ భాషలోనే కూడికలను నిర్వహించే క్రైస్తవ సంఘమును కూడా అతను స్థాపించారు. ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతుండగా, భారతదేశానికి వచ్చిన కొన్ని సంవత్సరాలలోనే తన భార్యయైన శారా సిల్వర్‌స్మిమిత్‌ను కోల్పోయారు జాన్. తీవ్రమైన పరిచర్య భారం వలన మరియు అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాన్ కూడా చాలా బలహీనపడ్డారు. అటువంటి సమయంలో కూడా అతను బైబిలును కన్నడ భాషలోకి అనువదించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. మరికొందరు మిషనరీల సహాయంతో అతను కన్నడ బైబిలు అనువాదమును విజయవంతముగా పూర్తి చేసి 1831వ సంll లో దానిని ప్రచురించారు.

 అయితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడటంతో కోలుకొనుటకు అతను 1835వ సంll లో లండనుకు తిరిగి వెళ్ళారు. అక్కడి నుండి అతను రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్ళి, అక్కడి ఆంగ్లో-అమెరికన్ చర్చిలో కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశారు. అతను పూర్తిగా కోలుకొనలేకపోయినప్పటికీ, మిషన్‌ను కొనసాగించుటకు బళ్ళారికి తిరిగి వెళ్ళవలెనని అతని హృదయం ఎంతగానో ఆకాంక్షించింది. కాగా 1838వ సంll లో బళ్ళారికి తిరిగి వచ్చిన అతను, అక్కడ ఒక ముద్రణాలయమును స్థాపించగా, అది తరువాతి దశాబ్దాలలో క్రైస్తవ రచనా పరిచర్యలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యింది.

 ఏదేమైనప్పటికీ, అనారోగ్యం కారణంగా 1841వ సంll లో అతను భారతదేశం వదిలి వెళ్ళవలసి వచ్చింది. పిమ్మట లండన్‌లో ఒక మిషనరీ సొసైటీకి సలహాదారుగా సేవలందిస్తూ, తన తుది శ్వాస వరకు కూడా ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయారు జాన్ హ్యాండ్స్.

ప్రియమైనవారలారా, మీ పరిచర్య ద్వారా మీరు మరుగుపరచబడి, దేవుడే మహిమపరచబడుటకు మీరు ఇష్టపడుతున్నారా?

"ప్రభువా, ప్రజలలో నేను తక్కువ గుర్తింపు పొంది, మీరే మహిమపరచబడుదురు గాక. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment