Pages

Nov 6, 2021

Midgley John Jennings | మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్

మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్ | Midgley John Jennings




  • జననం: 08-06-1806
  • మహిమ ప్రవేశం: 11-05-1857
  • స్వస్థలం: స్టీవనేజ్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: భారతదేశం

 ఈస్ట్ ఇండియా కంపెనీలో చాప్లిన్ అయిన మిడ్గ్లీ జాన్ జెన్నింగ్స్ ఢిల్లీలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. 1832వ సంll లో కాన్పూర్ చేరుకున్న అతను, మొదటిలో బ్రిటిష్ వారి మధ్య మాత్రమే పరిచర్య చేశారు. అయితే, తన స్వజనుల ఆత్మీయ అవసరాలకు మించి పరిచర్య చేయవలెనని క్రీస్తు ప్రేమ అతనిని బలవంతపరచగా, భారతీయ ప్రజల మధ్య పరిచర్య చేయుటకు ఆంక్షలు ఉన్నప్పటికీ, వారి మధ్యకు వెళ్ళి సువార్తను బోధించారు జెన్నింగ్స్.
 కాన్పూర్‌లో 20 సంll ల పాటు పరిచర్య చేసిన తరువాత 1851వ సంll లో అతను ఢిల్లీకి బదిలీ చేయబడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ మహమ్మదీయ విశ్వాసానికి బలమైన కోటగా ఉండేది మరియు క్రియాశీలకమైన క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలేవీ అక్కడ లేవు. కాగా ఢిల్లీ ప్రజల ఆత్మలను రక్షించుట కొరకు జెన్నింగ్స్ ఎంతో భారమును పొందారు. అయితే ఎవరి మద్దతు లేకుండా అక్కడ ఒంటరిగా ఉన్న కారణంగా అతను ఢిల్లీ అంతటా ప్రయాణించి, ఆ అన్యజనుల నగరమును దేవుడు దర్శించవలెనని వీధి మూలలలో నిలబడి ప్రార్థించేవారు. త్వరలోనే అతను ఉన్నత కులాలకు చెందిన ఇద్దరు ఉన్నత విద్యావంతులైన భారతీయులను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు. వారిలో ఒకరు గణితశాస్త్ర ఆచార్యులు రామ్ చంద్ర, మరొకరు ఢిల్లీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిపుణులైన చిమ్మన్ లై. ఆ విధంగా ఢిల్లీ చర్చి ఉద్భవించింది.
 తదుపరి జెన్నింగ్స్ విజ్ఞప్తి మేరకు ‘సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్’ (ఎస్.పి.జి.) అనే సంస్థ అక్కడ పరిచర్యను ప్రారంభించుటకుగాను ఇద్దరు మిషనరీలను పంపి, అవసరమైన నిధులను అందించింది. ఆ విధంగా ఆరంభమైన ఢిల్లీ మిషన్ భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన మిషన్ క్షేత్రాలలో ఒకటిగా మారింది.
 అయితే అటు పిమ్మట 1857వ సంll లో భయంకరమైన సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఐరోపాకు చెందిన ప్రతి ఒక్కరినీ సిపాయిలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. జాన్ జెన్నింగ్స్ అప్పుడు తన చిన్న కుమార్తె అన్నీ జెన్నింగ్స్‌తో కలిసి రెడ్ ఫోర్ట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆ అనూహ్యమైన దినాన, ఉగ్రరూపులైన సిపాయిలు అతని నివాసంలోకి దూసుకు వచ్చి తండ్రీకూతుళ్ళను ఇద్దరినీ కత్తులతో చంపేశారు. చిమ్మన్ లై కూడా క్రీస్తుపై తనకున్న విశ్వాసాన్ని తిరస్కరించనందుకుగాను అతని వైద్యశాలలో హత్య చేయబడ్డారు.
 అంతటితో ఢిల్లీ మిషన్ తుడిచి పెట్టుకుపోయిందా? అక్కడ చిందించబడిన ఆ హతసాక్షుల రక్తం వ్యర్థమేనా? లేదు! ఆ తిరుగుబాటు నుండి ఎలాగో తప్పించుకున్న రామ్ చంద్ర ఢిల్లీకి తిరిగి వచ్చి అన్యజనుల మధ్య ధైర్యంగా పరిచర్య చేయడం ప్రారంభించారు. మరింత మంది మిషనరీలు అక్కడికి వచ్చి మిడ్గ్లీ విత్తిన విత్తనానికి నీరు పోయగా, అది తరువాత సమృద్ధియైన ఆత్మీయ పంటను ఇచ్చింది.

ప్రియమైనవారలారా, మీకు సానుకూలమైన పరిస్థితులకు వెలుపల కూడా సువార్తను ప్రకటించుటకు
మీరు శ్రమించుచున్నారా?

"ప్రభువా, నా కుటుంబము, నా ఊరు మరియు నా క్రైస్తవ వర్గానికి వెలుపల వారి కొరకు కూడా భారమును కలిగియుండి, ప్రతి ఒక్కరికీ సువార్తను అందించుటకు నేను శ్రమించులాగున నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment