Pages

Nov 10, 2021

Elka of Wai Wai | వైవైకు చెందిన ఎల్కా

వైవైకు చెందిన ఎల్కా | Elka of Wai Wai 





  • జననం: 1933
  • మహిమ ప్రవేశం: -
  • స్వస్థలం: కనాషెన్
  • దేశం: గయానా
  • దర్శన స్థలము: గయానా మరియు బ్రెజిల్

 అమెజాన్ అరణ్యాలలో నివసించే వై వై అనే ఒక క్రూరమైన తెగ యొక్క నాయకుడైన ఎల్కా, బ్రెజిల్ అడవులలోని అనేక తెగల ప్రజలను క్రీస్తు నొద్దకు నడిపించినవానిగా పేరుగాంచారు. వై వై తెగవారు మూఢ నమ్మకాలు కలిగినవారై అడవులలోని ఆత్మలకు భయపడుతుండెడివారు. మంచి శరీర దారుఢ్యం కలిగి శక్తిశాలిగా ఎంచబడిన ఎల్కా రెండు పదుల వయస్సులోనే ఆ తెగకు నాయకుడయ్యారు. అయినప్పటికీ, మాంత్రిక వైద్యునిగా మారుటకు ఆత్మలు తనను పిలుస్తున్నాయనే నమ్మకం అతనిలో కలిగింది. కాగా అతను అడవులలోని మంత్రతంత్రాలను నేర్చుకుని, ఆత్మలను పిలుచుట ద్వారా ప్రజల రోగాలను చాకచక్యంతో ఏదో ఒకవిధంగా నయం చేసేవారు. అయితే, మరణం తరువాత ఏమి సంభవించునోయనే భయము ఎల్లప్పుడూ అతనిని వెంటాడుతుండెడిది. దాని నుండి తనకు తాను విడుదలనొందలేకపోయారు ఎల్కా.
 శ్వేతజాతీయుల పట్ల ద్వేషాన్ని కలిగియున్నారు ఎల్కా. కావున అతను వారిని చిరునవ్వుతో ఆహ్వానించి, వారికిచ్చే పానీయాలలో విషం కలిపి, వారిని కొట్టి చంపేవారు. అయితే, ఒక రోజు నీల్ మరియు బాబ్ హాకిన్స్ అనే మిషనరీలు వారితోపాటు బహుమతులను తీసుకొని అక్కడికి వచ్చారు. వారు యేసు క్రీస్తు ప్రభువు వై వై ప్రజలను ప్రేమిస్తున్నాడనియు ఆ ప్రేమను బట్టి ఆయన వారి కొరకు మరణించాడనియు వారికి చెప్పారు. ప్రతిఫలము కొరకు మాత్రమే ప్రేమను కనుపరిచే వై వై ప్రజలకు ఈ విధమైన ప్రేమ ఎంతో క్రొత్తగా తోచింది. ఎల్కా వారిని మొదట పరిహసించారు కానీ మరణం తరువాత ఉన్న నిరీక్షణను గురించి వారు చెప్పినది విని సంతోషించారు.
 తదుపరి బహుమతుల పొందుట కొరకు బైబిలు గ్రంథమును స్థానిక భాషలోకి అనువదించడంలో సహాయం చేయుటకు ఎల్కా అంగీకరించారు. అందులో భాగంగా ఒక రోజు అతను "ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; ...ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము." (1 యోహాను 4:18,19) అనే వచనభాగాలను తర్జుమా చేస్తున్నప్పుడు అందులో వ్రాయబడిన మాటలు అతని హృదయాన్ని కదిలించాయి. తద్వారా అతను తన పాపాలను ఒప్పుకొని, తనను ఒక నూతన వ్యక్తిగా మార్చమని దేవునిని వేడుకొన్నారు. అతను ఆ విధంగా మారుటను గూర్చి అతని కుటుంబ సభ్యులు అతనిని అపహసించినప్పటికీ, త్వరలోనే వారు ఎల్కా యొక్క మారిన జీవితమును గ్రహించగలిగారు. త్వరలోనే ఆ తెగ మొత్తమూ యేసు క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించింది.
 హాకిన్స్ సోదరులలో ఒకరు స్వరాన్ని కోల్పోయినప్పుడు అతనికి బదులుగా ఎల్కా బోధించడం ప్రారంభించారు. త్వరలోనే ఇతర తెగలకు క్రీస్తును ప్రకటించాలనే భారం అతనిలో కలిగింది. తత్ఫలితంగా అతను గయానాలో చుట్టుప్రక్కల ఉన్న అడవులకు వెళ్ళి తమతో వైరం కలిగియున్న తెగల వారికి కూడా సువార్తను ప్రకటించారు. క్రీస్తును గూర్చిన సువార్త ఒక మాంత్రిక వైద్యుని మిషనరీగా మార్చటమే కాక, అతని ద్వారా అనేక తెగల వారి జీవితాలలో వెలుగును నింపింది.

ప్రియమైనవారలారా, మరణానంతరం ఉండే నిత్యజీవము యొక్క ఆ దీవెనకరమైన నిరీక్షణ మీరు కలిగియున్నారా?

"ప్రభువా, క్రీస్తులో ఉండే నిత్యజీవము యొక్క ఆ దీవెనకరమైన నిరీక్షణ యొద్దకు ఇతరులను నడిపించు భారమును నాకు దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment