Pages

Nov 11, 2021

Henry Watson Fox | హెన్రీ వాట్సన్ ఫాక్స్

హెన్రీ వాట్సన్ ఫాక్స్  | Henry Watson Fox





  • జననం: 01-10-1817
  • మహిమ ప్రవేశం: 14-10-1848
  • స్వస్థలం: వెస్టో, డర్హామ్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శనము: తెలుగు ప్రజలు, భారతదేశం

 హెన్రీ వాట్సన్ ఫాక్స్ 1817వ సంll లో ఇంగ్లాండులోని వెస్టోలో జన్మించారు. డర్హామ్ గ్రామర్ స్కూలులో చదువుకొనిన అతను, విద్యాభ్యాసమును కొనసాగించుటకు యుక్త వయస్సులో రగ్బీ స్కూలుకు వెళ్ళారు. అతను రగ్బీ స్కూలులో చదువుకుంటున్న రోజులలో అప్పుడే వృద్ధి చెందుతున్న అతని క్రైస్తవ విశ్వాసం బలపడింది. ఏలయనగా, ఆ పాఠశాల ప్రార్థనా మందిరంలో డాll ఆర్నాల్డ్ ఇచ్చే క్రైస్తవ విలువల యొక్క సరళమైన బోధన హెన్రీ హృదయంపై లోతైన ముద్ర వేసింది. అంతేకాకుండా హెన్రీ నివసిస్తున్న ఇంటి యజమానియైన బోనమీ ప్రైస్ చేసిన ఒక ఉపన్యాసం అతని క్రైస్తవ మత విశ్వాసమును పటిష్ఠ పరిచింది. ఆక్స్‌ఫర్డ్‌లోని వధమ్ కాలేజీలో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన పిమ్మట, 1840వ సంll డిసెంబరు మాసంలో డీకనుగా నియామక అభిషేకం పొందారు హెన్రీ. తదుపరి 1841వ సంll లో చర్చి మిషనరీ సొసైటీ అతనిని భారతదేశంలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగు ప్రజలకు మిషనరీగా నియమించింది.

తన భార్యయైన ఎలిజబెత్ మరియు మరొక మిషనరీ ఆర్. టి. నోబెల్‌తో కలిసి 1841వ సంll జూలై మాసంలో మద్రాసు చేరుకున్నారు హెన్రీ. మచిలీపట్నంలో ఒక పాఠశాలను నడిపించిన నోబెల్, ఉన్నత కులాల ప్రజలపై దృష్టి కేంద్రీకరించగా, బోధించు పరిచర్యను చేపట్టిన హెన్రీ, తక్కువ కులాల వారిపై దృష్టి నిలిపారు. అతను సంచరించుచూ సువార్తను ప్రకటించుటను మొదలుపెట్టి గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించారు. అతను మచిలీపట్నం మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో మాత్రమే కాకుండా తూర్పు గోదావరి ప్రాంతం మరియు పశ్చిమ కృష్ణా జిల్లాలోని సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించి సువార్తను ప్రకటించారు.

హెన్రీ యొక్క మిషనరీ పరిచర్య కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆ స్వల్ప వ్యవధి కూడా వివిధ కారణాల వలన పలుమార్లు భంగపరచబడింది. అనారోగ్యం కారణంగా అతను 1843-44 సంll ల మధ్య కొంతకాలం నీలగిరి కొండలలో నివసించవలసి వచ్చింది. 1845వ సంll లో అతని భార్య యొక్క అనారోగ్యం కారణంగా అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయితే, వారు మద్రాసులో సముద్రయానం ప్రారంభించిన కొద్ది సమయంలోనే అతను ఆమెను కోల్పోయారు. అతను తిరిగి భారతదేశానికి వచ్చినప్పటికీ, క్షీణించిన అతని ఆరోగ్యం 1848వ సంll లో మళ్ళీ అతనిని ఇంగ్లాండుకు తిరుగుముఖం పట్టించింది. చివరి వరకు కూడా దేవుని సేవించుటకు వెనుకంజవేయక ప్రయత్నించిన ఈ నమ్మకమైన దేవుని సేవకుడు, చివరకు 1848వ సంll అక్టోబరు మాసం 14వ తారీఖున తన తుది శ్వాస విడిచారు. అతని సేవ కేవలం పరిమిత కాలం మాత్రమే కొనసాగి, పలుమార్లు భంగపరచబడినప్పటికీ, ఒకే దృష్టిని కలిగియున్న హెన్రీ వాట్సన్ ఫాక్స్, తాను దేని నిమిత్తమై పిలువబడ్డారో ఆ గురి నుండి ఏనాడూ వైదొలగ దానిపైనే తన లక్ష్యముంచారు.

ప్రియమైనవారలారా, ఏది ఏమైనా, ఏమి ఎదురైనా, ఒకే దృష్టితో ఒకే గురితో మీరు ముందుకు సాగెదరా?

"ప్రభువా, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నీవే నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నావు. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!

No comments:

Post a Comment