Pages

Feb 12, 2022

James Kershaw Best British Missionary Life History

జేమ్స్ కెర్షా బెస్ట్ జీవిత చరిత్ర




  • జననం: 22-08-1811
  • మహిమ ప్రవేశం: 05-04-1889
  • స్వదేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: దక్షిణ భారతదేశం


జేమ్స్ కెర్షా బెస్ట్ ఒక బ్రిటిష్ మిషనరీ. అతను భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న క్రిస్టియానగరంలో తాను చేసిన సేవకు పేరుగాంచారు. క్రిస్టియానగరం అనునది నిజానికి తమిళనాడులోని అధియకురిచి అనే గ్రామం. ఇక్కడ రెవ. క్రిస్టియన్ కోలాఫ్ సేవ చేశారు. కాగా ఆయన గౌరవార్థం గ్రామస్థులు తమ గ్రామానికి క్రిస్టియానగరం అని పేరు పెట్టారు. ఈ ప్రాంతానికి 1844వ సంll లో ‘ది సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గోస్పెల్ ఇన్ ఫారెన్ పార్ట్స్’ (ఎస్.పి.జి.) సంస్థవారు జేమ్స్ కెర్షా బెస్ట్‌ను పరిచర్యకై పంపించారు.


యవ్వనంలో ఉన్నప్పుడు బిషప్ స్పెన్సర్ యొక్క పరిచర్య ద్వారా ప్రేరణ పొందిన కెర్షా, తన జీవితమును సేవకు సమర్పించుకున్నారు. 1844వ సంll లో అతను భారతదేశానికి వచ్చి క్రిస్టియానగరంలో సేవ చేయడం ప్రారంభించారు. అక్కడ కోలాఫ్ వేసిన పునాదులపై పరిచర్యను కట్టుట ప్రారంభించిన అతను, గ్రామాలలో సువార్తను ప్రకటించుటపై తన దృష్టిని కేంద్రీకరించారు. హిందువుల యొక్క బెదిరింపులు మరియు వ్యతిరేకత మధ్య విశ్వాసుల యొక్క ప్రేమ మరియు దేవుని యొక్క వాగ్దానాలు అతనిని సేవలో ముందుకు నడిపించాయి.


క్రిస్టియానగరం యొక్క సమగ్ర అభివృద్ధి కొరకు కూడా కెర్షా దర్శనమును కలిగియున్నారు. కాగా అతను నిధులు సేకరించి బాలుర మరియు బాలికల పాఠశాలలను నిర్మించారు. అతను స్థాపించిన పాఠశాలలు నేటికీ నిలిచియున్నాయి. అంతేకాదు, అతను మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన కార్యక్రమాలను ప్రారంభించగా, ఇది తిన్నెవెల్లి (తిరునెల్వేలి) జిల్లాలో సామాజిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ కాలంలోని అత్యంత సౌందర్యవంతమైన నిర్మాణాలలో ఒకటిగా నిలిచే సెయింట్ మార్క్ చర్చిని నిర్మించిన ఘనత కూడా జేమ్స్ కెర్షాకే దక్కుతుంది.


కెర్షా యొక్క విజయవంతమైన పరిచర్య కష్టాలు కన్నీరు లేకుండా ఏమీ లేదు. 1847వ సంll లో, అతని భార్యయైన మేరీ ఆన్ ఒక అమ్మాయికి జన్మనివ్వగా, ఆ బిడ్డ వెంటనే మరణించింది. మరుసటి సంవత్సరం మరో అమ్మాయి పుట్టినప్పటికీ, వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆ బిడ్డ కూడా చనిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత వారికి మూడవ సంతానముగా ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బిడ్డ కూడా తొమ్మిది నెలల తర్వాత 1853వ సంll లో మరణించాడు. పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోయిన ప్రతిసారీ ఎంతగానో విలపించారు ఆ మిషనరీ దంపతులు. మంచి వైద్య సదుపాయాలు ఉన్న ఇంగ్లాండులోనే ఉండి ఉంటే తమ పిల్లలు బ్రతికియుండేవారనే ఆలోచనలు అనేకమార్లు వారి మనసులో మెదిలాయి. అయినప్పటికీ, ముగ్గురు పిల్లలను కోల్పోయిన తర్వాత కూడా ఎన్నడూ వెనుదిరిగి చూడని మేరీ చిరునవ్వుతో తన భర్తను ప్రోత్సహించారు.


ఆరోగ్యపరమైన సమస్యలతో 1856వ సంll లో కెర్షా తన స్వస్థలానికి తిరిగివెళ్ళారు. కోలుకొనిన తరువాత ఐరోపాలో మిషనరీ సేవను కొనసాగించిన జేమ్స్ కెర్షా బెస్ట్, 1899వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా ఆ సేవలో ముందుకు సాగిపోయారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


ప్రియమైనవారలారా, నిరుత్సాహకరమైన పరిస్థితులతో పోరాడేందుకు మీరు దేవుని వాగ్దానాలు మరియు విశ్వాసుల సహవాసము పై ఆధారపడుతున్నారా? 


ప్రార్థన :

ప్రభువా, ఎదురయ్యే నిరుత్సాహకరమైన పరిస్థితులను అధిగమించి, పరిచర్యలో స్థిరముగా నిలబడగలుగుటకు నాకు బలమును దయచేయుము. ఆమేన్!


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment