Pages

Feb 12, 2022

Eleanor Ardel Vietti Life History

ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి  జీవిత చరిత్ర




  • జననం: 05-11-1927
  • మహిమ ప్రవేశం: తెలియదు
  • స్వస్థలం: ఫోర్ట్ వర్త్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: దక్షిణ వియత్నాం

ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి అమెరికాకు చెందిన మిషనరీ. ఆమె వియత్నాం యుద్ధం యొక్క అత్యంత క్లిష్టమైన సమయంలో వియత్నాంలో ప్రభువుకు సేవ చేశారు. ఆమె యొక్క యుక్తవయస్సులో ఒక తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ నుండి దేవుడు ఆమెను అద్భుతముగా స్వస్థపరచగా, దేవుని కేవలం ఆరాధించుట కంటే మరి అధికముగా ఆయనకు చేయుటకు తాను పిలువబడుతున్నట్లు ఆమె గ్రహించారు. ఆమె కళాశాలలో చదువుకుంటున్నప్పుడు ఆసుపత్రి భోజనశాలలో మధ్యాహ్న భోజనం చేయుటకు ముందు ఆహారము కొరకు ప్రార్థిస్తున్న ఒక యువతుల గుంపును ఆమె చూశారు. వారితో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం ‘క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్ చర్చ్‌’ అనే సంఘములో ఆమె సహవాసం కలిగియుండుటకు దారి తీసింది. ఆ చర్చిని సందర్శించే అనేక మంది మిషనరీల సాక్ష్యాలను వినిన వియెట్టి కూడా తన వైద్యశాస్త్ర చదువును పూర్తి చేసుకొనిన తరువాత మిషనరీ సేవకు తనను సమర్పించుకున్నారు.


కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, దేవుని పిలుపు యొక్క నిశ్చయతతో డాll ఎలియనోర్ వియత్నాంకు పయనమయ్యారు. ఆ సమయంలో వియత్నాం దేశంలో రాజకీయ అస్థిరత నెలకొనియుంది. అక్కడ ఆమె ‘బాన్ మీ థౌట్’ అనే ఆసుపత్రిలో ముదిరిన దశలో ఉన్న కుష్ఠు రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. అమెరికా వారికి వ్యతిరేకంగా ఉన్న గెరిల్లాలు కూడా ఆమె యొక్క ప్రేమా సంరక్షణలను పొందుకున్నారు. తన యొద్దకు వచ్చే రోగులను వారి మూఢ నమ్మకాల నుండి ఆమె సువార్త సహాయంతో విడిపించగలిగారు. ప్రజలకు ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధిని నిర్ధారించి, వారికి బాగుపడే అవకాశాలను మెరుగుపరచుటకు ఇంటింటిని దర్శించవలెనని ఆమె అరణ్యాలను దాటుకుంటూ ప్రయాణించారు. ఆమె ఆసుపత్రి ఆవరణలో ప్రార్థనా సమావేశాలు మరియు కూడికలు కూడా నిర్వహించారు.


1962వ సంll ఏప్రిల్ మాసంలో ఆమె అమెరికాలోని తన కుటుంబమును స్వల్ప సమయం సందర్శించి, ఒక నెలలోగానే మిషన్ కేంద్రమునకు తిరిగి వచ్చారు. 1962వ సంll మే 30 తారీఖున, ‘వియెట్ కాంగ్’ అనే ఒక విప్లవాత్మక రాజకీయ సంస్థ ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిపై దాడి చేసి దానిని దోచుకున్నారు. వారు బైబిళ్ళను ధ్వంసం చేశారు. తుపాకీతో బెదిరించి వారు ముగ్గురు మిషనరీలను తమతో తీసుకువెళ్ళారు. ఆ ముగ్గురిలో డాll ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి ఒకరు.


ఆమె అపహరించబడినప్పుడు వియెట్టి వయస్సు కేవలం 34 సంవత్సరాలు. అప్పటి నుండి ఆమె ఆచూకీ గురించి ఎటువంటి సమాచారం లేదు. 40 సంవత్సరాల పాటు శోధించిన తరువాత, 1991వ సంll లో అమెరికా ప్రభుత్వం ఆమెను “చనిపోయినట్లుగా భావించబడింది” అన్న జాబితాలో ఆమెను చేర్చింది.


కొన్నిసార్లు దేవుడు తన ప్రియమైన సేవకులైన వారి అంతం ఏమైనదని ప్రపంచానికి తెలియజేయడు. అటువంటివారు ఆనాటి హనోకు, మోషే మరియు ఆధునిక కాలంలో ఎలియనోర్ ఆర్డెల్ వియెట్టి అని చెప్పవచ్చునేమో!

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


ప్రియమైనవారలారా, భోజనం చేయుటకు ముందు మీరు ఆహారము కొరకు చేసే చిన్న ప్రార్థన కూడా ఒక వ్యక్తిని దేవుని వైపుకు నడిపించగలదని మీకు తెలుసా?

ప్రార్థన :


ప్రభువా, ఎటువంటి పరిస్థితులలో అయినా ప్రజలలో బహిరంగముగా ధైర్యముతో ప్రార్థించగలుగునట్లు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!


2 comments: