Pages

Feb 12, 2022

William Butler Life History

విలియం బట్లర్ జీవిత చరిత్ర




  • జననం: 30-01-1818
  • మహిమ ప్రవేశం: 18-08-1899
  • స్వస్థలం: డబ్లిన్
  • దేశం: ఐర్లాండ్
  • దర్శన స్థలము: భారతదేశం మరియు మెక్సికో

ఐర్లాండుకు చెందిన మెథడిస్టు మిషనరీయైన విలియం బట్లర్ భారతదేశం మరియు మెక్సికోలలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచారు. చిన్నతనం నుండి కూడా అతను తాను కలిగియున్న ఆత్మీయ జ్ఞానమునకై వారి క్రైస్తవ సంఘముచే మంచి ప్రశంసల నందుకొనెడివారు. అయితే, ఒక రోజు అతను ఒక మెథడిస్టు సంఘమును దర్శించడం జరుగగా, అక్కడ తన ఆత్మీయ జ్ఞానం తనను పరలోకమునకు తీసుకువెళ్ళదని అతను గ్రహించారు. ఆ రోజున అతను తన పాపముల గురించి పశ్చాత్తాపపడి క్రీస్తును తన హృదయములోకి చేర్చుకున్నారు. వెనువెంటనే, సేవ కొరకైన దేవుని పిలుపుకు అతను విధేయత చూపి, ఒక మెథడిస్టు సంఘములో పరిచర్య చేయుటకు 1850వ సంll లో బోస్టన్ నగరమునకు వెళ్ళారు.


అతను అక్కడ ఉన్న సమయంలో డాll డర్బిన్ అనే వ్యక్తి భారతదేశంలో పరిచర్య చేయమని విలియంను కోరారు. కాగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినవారై 1855వ సంll లో తన భార్యయైన క్లెమెంటినా రోవ్‌తో కలిసి కలకత్తా చేరుకున్నారు విలియం. కలకత్తాలో కాళీపూజ వైభవంగా జరుగుతున్న సమయం అది. భయంకరమైన విగ్రహారాధన యొక్క ఆ దృశ్యం అతనిలో భారతీయుల కొరకు మరింత భారమును కలిగించింది. ఆ సమయంలో చెలరేగుతున్న సిపాయిల తిరుగుబాటు గురించి అవగాహనలేని విలియం, బరేలీలో ఒక మిషన్ కేంద్రమును స్థాపించవలెననే ఉద్దేశ్యంతో కలకత్తా నుండి ఉత్తర భారతదేశానికి వెళ్ళారు.


బరేలీలో బ్రిటిష్ సైన్యం అతనికి చెప్పినదేమంటే ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ మిషనరీ సేవ చేయుటకు ప్రయత్నించడం పిచ్చిపని అని. కానీ, ధైర్యసాహసాలతో కూడుకొనిన ఈ మిషనరీ, “ప్రసంగించడం నా బాధ్యత అయ్యా; నా ప్రాణము గురించి నా యజమాని చూసుకుంటాడు.” అని బదులిచ్చారు. జోయెల్ అనే వ్యాఖ్యాత సహాయంతో బరేలీ మరియు లక్నోలలో మిషనరీ పనిని ప్రారంభించారు విలియం. అయితే, పదేపదే హెచ్చరికలు మరియు ఆదేశాలు రావడంతో, విశ్వాసుల భద్రత నిమిత్తమై విలియం అక్కడినుండి నైనితాల్‌కు వెళ్ళారు.


సిపాయిల తిరుగుబాటు అణచివేయబడిన పిమ్మట తిరిగి బరేలీకి వచ్చిన విలియం, 1865వ సంll వరకు అక్కడ మిషనరీ పరిచర్యను కొనసాగించారు. తరువాత అనారోగ్యం కారణంగా బట్లర్ దంపతులు అమెరికాకు తిరిగివెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారు విదేశాలలో మిషనరీ సేవను ఎంతగానో ప్రోత్సహించారు. 1873వ సంll లో ఒక మెథడిస్టు మిషన్‌ను స్థాపించుటకు మెక్సికోకు వెళ్ళారు విలియం. తరువాత అతని కుమారుడు జాన్ బట్లర్ దానిని తదుపరి నలభై సంవత్సరాలు కొనసాగించారు.

భారతీయుల కొరకు అతను కలిగియున్న భారం 1883వ సంll లో అతను తిరిగి భారతదేశానికి వచ్చేలా చేసింది. అయితే ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అతను కొన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండగలిగారు. దాదాపు యాభై సంవత్సరాల పాటు అలుపెరుగక దేవునిని సేవించిన పిమ్మట 1899వ సంll లో పరమందు ప్రభు సన్నిధానమును చేరుకున్నారు విలియం బట్లర్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 


ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుట అనే మీ బాధ్యతను నెరవేర్చుటలో మీరు నమ్మకంగా ఉన్నారా?

ప్రార్థన :


ప్రభువా, సువార్త ప్రకటించుటకు సమయమందును అసమయమందును నేను సిద్ధముగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!



No comments:

Post a Comment