Pages

Apr 7, 2022

Alexander Duff | అలెగ్జాండర్ డఫ్

అలెగ్జాండర్ డఫ్ జీవిత చరిత్ర




  • జననం : 15-04-1806
  • మరణం : 12-02-1878
  • స్వస్థలం : పెర్త్‌షైర్
  • దేశం       : స్కాట్లాండు
  • దర్శన స్థలము : భారతదేశం


ఒక రోజు ఒక ప్రముఖ మిషనరీ భారతదేశంలో మిషనరీ సేవను గురించి స్కాట్లాండ్ చర్చిలో విజ్ఞప్తి చేశారు. అయితే ఎటువంటి స్పందన రాలేదు. ఆ ప్రసంగం మధ్యలోనే అతనికి గుండెపోటు వచ్చి మూర్ఛపోయారు. అయినప్పటికీ, వైద్యుల సలహాలను కూడా పక్కనపెట్టి, తన ప్రసంగాన్ని ముగించుటకు అతను మళ్ళీ వెళ్ళి వేదిక మీద నిలబడ్డారు. అప్పుడు అతను "విక్టోరియా రాణి భారతదేశానికి వెళ్ళుటకు ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు అని పిలిచినట్లయితే వందలాది మంది యువకులు స్పందిస్తారు. కానీ, రాజులకు రాజైన యేసు ప్రభువు పిలుస్తుంటే మాత్రం ఎవరూ ముందుకురారు" అని చెప్పినప్పటికీ నిశ్శబ్దం మాత్రమే జవాబయ్యింది. కాగా ఆ మిషనరీ ఇలా ముగించారు, “మంచిది, కాబట్టి, నేను వృద్ధాప్యములో ఉన్నప్పటికీ తిరిగి భారతదేశానికి వెళ్తాను. అక్కడ గంగా నది ఒడ్డున పడుకొని, నా తనువు చాలిస్తాను. తద్వారా వారిని ప్రేమిస్తున్న ఒక వ్యక్తి స్కాట్లాండులో ఉన్నారని భారతదేశ ప్రజలకు తెలియజేస్తాను”. ఆ మాటలతో ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ “నేను వెళ్తాను! నేను వెళ్తాను!” అనే అనేక మంది యువకుల గొంతులు వినిపించాయి. ఆ ప్రసంగమిచ్చిన ప్రముఖ మిషనరీ మరెవరో కాదు, డాll అలెగ్జాండర్ డఫ్.


స్కాట్లాండులోని పెర్త్‌షైర్‌కు చెందిన అలెగ్జాండర్ ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించారు. సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అతను, ఆర్ట్స్ మరియు వేదాంతశాస్త్రములలో పట్టం పొందారు. చదువుకుంటున్న రోజులలో అక్కడ అతను ఒక విద్యార్థి మిషనరీ సొసైటీని స్థాపించారు. చదువు పూర్తిచేసుకొనిన తరువాత చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ తరుఫున భారతదేశానికి వెళుతున్న మొదటి మిషనరీగా అతనికి వచ్చిన అవకాశాన్ని అతను జారవిడువలేదు. సముద్రయానములో రెండుమార్లు ఓడ ప్రమాదముల నుండి బయటపడిన అలెగ్జాండర్, 1830వ సంll లో తన భార్యతో కలిసి భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకున్నారు.


ఆరంభములో తన శక్తి సామర్థ్యాలన్నింటినీ పాఠశాలలను స్థాపించుటలోనే వినియోగించారు అలెగ్జాండర్. ఉన్నత కుల హిందువులను మరియు ముస్లింలను చేరుకొనుటకు మార్గమును సిద్ధపరిచే సువార్త సాధనం విద్య అని అతను దృఢంగా విశ్వసించారు. స్థానిక మత విశ్వాసాలను సవాలు చేయుటకుగాను బైబిలు పఠనములను విజ్ఞానశాస్త్రముతో సమీకరించి, క్రైస్తవ తత్వజ్ఞానముతో కూడుకొనిన పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కాటిష్ చర్చ్ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయం మొదలగునవి భారతదేశంలో విద్యారంగములో అతను చేసిన కృషికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అతని యొక్క సేవలు భారతదేశానికి వెలుపల కూడా విస్తరించాయి. అతను అమెరికా, ఐరోపా మరియు ఆఫ్రికా ఖండములంతటా ప్రసంగిస్తూ సువార్త యొక్క పరిధులను విస్తరింపజేశారు మరియు వివిధ ప్రాంతాలలో మిషనరీలను నియమించారు. ఈ లోకములో క్రీస్తు కొరకు వేలాది మంది ఆత్మలను సంపాదించి, క్రీస్తును సేవించుటకు వందలాది మంది సేవకులకు శిక్షణనిచ్చిన అలెగ్జాండర్ డఫ్, 1878వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, అజ్ఞానమనే చీకటిని పారద్రోలుటకు మీవంటి వారు ముందుకు రావలసిన ఆవశ్యకం లేదా?

ప్రార్థన :

"ప్రభువా, మీ కొరకు మండుచున్న దివిటీ వలె నన్ను ప్రజ్వలింపజేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment