Pages

Apr 7, 2022

George Uglow Pope | జార్జ్ ఉగ్లో పోప్

జార్జ్ ఉగ్లో పోప్ జీవిత చరిత్ర




  • జననం : 24-04-1820
  • మరణం : 11-02-1908
  • స్వస్థలం : ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపం
  • దేశం       : కెనడా
  • దర్శన స్థలము : భారతదేశం


జార్జ్ ఉగ్లో పోప్ కెనడాకు చెందిన ఆంగ్ల క్రైస్తవ మిషనరీ. వర్తకుడు అయిన అతని తండ్రి తన వర్తకమును విడిచిపెట్టి కెనడాలోని నోవా స్కోటియాకు మిషనరీగా వెళ్ళారు. తదుపరి వారి కుటుంబం 1826వ సంll లో ఇంగ్లాండు‌కు వెళ్లింది. అక్కడ బరీ మరియు హొక్స్టన్‌లలో ఉన్న వెస్లియన్ పాఠశాలలలో జార్జ్ యొక్క విద్యాభ్యాసం సాగింది. చిన్నతనంలోనే మద్రాసులోని తమిళుల మధ్య జరుగవలసిన పరిచర్యను గురించి ఒక మిషనరీ మాట్లాడుచుండగా జార్జ్ వినడం జరిగింది. వెను వెంటనే అతను తమిళ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అతను 1839వ సంll లో మద్రాసులోని వెస్లియన్ మిషన్‌లో చేరినప్పుడు అతనికి కేవలం 19 సంవత్సరాలు.


1841వ సంll లో అతను సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ (ఎస్. పి. జి.) (సువార్త విస్తరణ సంఘము) లో చేరగా, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్యూటికోరిన్ జిల్లాలోని సాయర్పురం ప్రాంతమునకు అతను మిషనరీగా నియమించబడ్డారు. 1844వ సంll లో పాదిరిగా నియమించబడిన అతను, తదుపరి మిషన్ యొక్క ప్రాంతీయ సూపరింటెండెంట్ (పర్యవేక్షకులు) అయ్యారు. సువార్తను వివిధ ప్రాంతములకు మోసుకువెళ్ళుటకు అతను కలిగియున్న శక్తి సామర్థ్యములు మరియు ప్రేమకు హద్దులు లేవు. కాగా అవి ఎంతో గొప్ప ఫలితములను ఇచ్చాయి. నూతన మిషనరీలకు మరియు సేవకులకు శిక్షణనిచ్చుటకై అతను అక్కడ ఒక సెమినరీని స్థాపించారు. తిరునెల్వేలి ప్రాంతంలో కూడా జార్జ్ పరిచర్య చేశారు. 1845వ సంll లో అతని భార్య మరణించగా, మద్రాసులో కొంతకాలం సేవను కొనసాగించిన పిమ్మట అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళారు.


1851వ సంll లో భారతదేశానికి తిరిగి వచ్చిన అతను, ఎస్.పి.జి. క్రింద తంజావూరులో పనిచేయుటకు బాధ్యతలు చేపట్టారు. అయితే, శారీరక బలహీనతల కారణముగా ఎస్.పి.జి. నుండి విరమించుకొని, సాయర్పురం, ఉదకమండలం (ఊటీ) మరియు బెంగుళూరులలో పాఠశాలలను స్థాపించడంపై దృష్టి సారించారు. అతను ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు మరియు క్రమశిక్షణ గలవారు. కాగా, భారతీయ విద్యావ్యవస్థలో క్రమబద్ధమైన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టినవానిగా జార్జ్ ఘనత పొందారు. రచనా సామర్థ్యం కూడా కలిగియున్న అతను, "తిరుక్కురల్" మరియు "తిరువాసగం" వంటి అనేక ప్రాముఖ్యమైన తమిళ సాహిత్య రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. 1881వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి, అక్కడ ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక కళాశాలలో బోధనను కొనసాగించారు. ‘పోప్ అయ్యర్’ అని గౌరవార్థకముగా పిలువబడే జి. యు. పోప్ 88 సంll ల వృద్ధాప్యంలో తన ప్రభువును చేరుకున్నారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సువార్త ప్రకటించుట కొరకు ఎటువంటి నూతన విధానములను మీరు సాధన చేస్తున్నారు? 


ప్రార్థన :

"ప్రభువా, సువార్తను ప్రకటించుటలో నూతన విధానములను అవలంబించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment