Pages

Apr 9, 2022

James Calvert | జేమ్స్ కాల్వర్ట్

జేమ్స్ కాల్వర్ట్ జీవిత చరిత్ర



  • జననం : 03-01-1813
  • మరణం : 08-03-1892
  • స్వస్థలం : పికరింగ్, యార్క్‌షైర్
  • దేశం       : ఇంగ్లాండు 
  • దర్శన స్థలము : ఫిజి దీవులు మరియు దక్షిణాఫ్రికా


యార్క్‌షైర్‌కు చెందిన మెథడిస్టు మిషనరీయైన జేమ్స్ కాల్వర్ట్, ఫిజీ దీవులలో చేసిన సేవకు పేరుగాంచారు. అతనికి పదునాలుగు ఏళ్ళ వయస్సు ఉన్నపుడు అచ్చువేసి, పుస్తకాలను బైండ్ చేసే ఒక వ్యక్తి వద్ద సహాయకునిగా చేరి, ఏడు సంll ల పాటు అక్కడ పనిచేశారు. ముద్రణ మరియు పుస్తకాల తయారీలో అప్పుడు అతను సంపాదించిన నైపుణ్యం తరువాతి కాలంలో అతను చేసిన పరిచర్యలో విస్తృతంగా ఉపయోగించబడింది. 1837వ సంll లో అతను 'హొక్స్టన్ థియోలాజికల్ కాలేజీ' లో చేరారు. కానీ మిషనరీలైన జాన్ హంట్ మరియు థామస్ జాగర్లతో అతనిని కూడా ఫిజి దీవులకు పంపినందు వలన అతని వేదాంత విద్యాభ్యాసం మధ్యలోనే నిలిపివేయబడింది. వారందరూ 1838వ సంll డిసెంబరు మాసంలో ఫిజి ద్వీపమైన లకెంబాకు చేరుకున్నారు.


అక్కడి స్థానిక భాషలో కాల్వర్ట్ చాలా త్వరగా ప్రావీణ్యం సంపాదించారు. నరమాంస భక్షకుల మధ్య జీవించడం మరియు దేవుని ప్రేమతో వారికి సేవ చేయడం అంత సులభమైన కార్యం కాదు. అంతేకాకుండా, స్వదేశం నుండి పంపబడవలసిన సరుకులు సక్రమంగా సరఫరా చేయబడేవికావు, పైగా ఆరోగ్య సమస్యలు. వాటన్నింటిలోనూ అతని భార్యయైన మేరీ ఫౌలర్ ఒక గొప్ప సహకారిగా అతని వెనువెంట నిలిచి, పరిచర్యలో అమూల్యమైన సేవలను అందించారు.


1848వ సంll లో ఫిజీలోని మరొక ద్వీపమైన వివా ద్వీపములో సేవ చేయుటకు కాల్వర్ట్‌ నియమించబడ్డారు. అతని పరిచర్యలో పేర్కొనదగిన ఒక విషయం ఏమిటంటే ఫిజి సంయుక్త ద్వీపాల రాజైన రతు సెరు థకోంబౌ మారుమనస్సు పొంది క్రైస్తవునిగా మారడం. ఫిజీ ద్వీపాలలో రెండు విభాగాలలో అతను అందించిన సేవలు ప్రత్యేకమైనవిగాను, ముఖ్యమైనవిగాను పేర్కొనవచ్చు. ఒకటి ఫిజి ప్రజలకు బైబిలును అందించడం, రెండవది స్థానిక యుద్ధాలలో మరియు అక్కడ స్థిరపడిన విదేశీయులకు మరియు స్థానికులకు మధ్య తలెత్తే విభేదాలలో మధ్యవర్తి పాత్రను పోషించడం. ఫిజి భాషలోకి డేవిడ్ హాజిల్‌వుడ్ అనువదించిన పాత నిబంధన యొక్క ప్రతులను తీసుకొని 1855వ సంll లో అతను ఇంగ్లాండు‌కు తిరిగి వెళ్ళారు. అక్కడ ఫిజి భాషలోని క్రొత్త నిబంధన యొక్క 10,000 కాపీలను మరియు ఫిజి బైబిలు యొక్క 5000 కాపీలను ఉత్పత్తి చేయుటలో సహకారమందించారు. తదుపరి 1861వ సంll లో తిరిగి ఫిజికి వచ్చిన కాల్వర్ట్‌, 1865వ సంll జనవరి మాసం వరకు అక్కడ సేవ చేశారు.


1872వ సంll లో దక్షిణాఫ్రికాలో పనిచేయడానికి నాయకత్వ నైపుణ్యాలు కలిగిన మిషనరీ అవసరమని తెలుసుకొనిన కాల్వర్ట్, ఆ అవసరతను తీర్చుటకై స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అక్కడి క్రైస్తవ సంఘములలో శ్వేతజాతీయులు ఆరాధన కూడికలో ఆఫ్రికావారితో కలిసి కూడుకొనుటకు అంగీకరించేవారు కాదు. అటువంటి అసమానతలతో నిండియున్న సంఘములో కాల్వర్ట్ ప్రేమా సహనములతో పరిచర్య చేశారు. కొన్ని సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో సేవ చేసిన తరువాత 1881వ సంll లో అతను స్వదేశానికి తిరిగి వచ్చారు. తదుపరి 1886వ సంll లో ఫిజీ దీవులను మరొక పర్యాయం దర్శించారు. తన జీవితాంతం దేవుని సేవలో కొనసాగిన జేమ్స్ కాల్వర్ట్, 1892వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు చేరుకున్నారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు కలిగియున్న తలాంతులు మరియు నైపుణ్యాలను ఆయన పరిచర్యలో ఉపయోగించుటకు వాటి పట్ల దేవుడు ప్రణాళికను కలిగియున్నాడని మీరు గ్రహించగలుగుతున్నారా?

ప్రార్థన :

"ప్రభువా, సమాజములోను మరియు మీ సంఘములోను శాంతిసమైక్యతలను నెలకొల్పుటకు నాకు భారము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment