Pages

Apr 9, 2022

John de Britto | జాన్ డి బ్రిట్టో

జాన్ డి బ్రిట్టో జీవిత చరిత్ర



  • జననం : 01-03-1647
  • మరణం : 04-02-1693
  • స్వస్థలం : లిస్బన్
  • దేశం : పోర్చుగల్
  • దర్శన స్థలము : భారతదేశం

చాలా మంది మిషనరీలు దేవుని సేవ నిమిత్తం స్వదేశాన్ని విడిచిపెట్టారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ మాతృభూమిని మాత్రమే కాక, తమ కుటుంబం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు మరియు వేషధారణలను కూడా విడిచిపెట్టి, వారు సేవ చేస్తున్న పరదేశానికి అనుగుణంగా వారిని మలుచుకున్నారు. వారు ఆ విధంగా చేసింది ఏదో క్రొత్తదానిని అవలంబించాలన్న ఆకర్షణతో కాదు, అనేకులను లోకరక్షకుని వైపు ఆకర్షించుట కొరకు!

ఒక గొప్ప కుటుంబంలో జన్మించిన జాన్ డి బ్రిట్టోకు రాజ దర్బారులో ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతని హృదయం ఇహలోక కీర్తి వెంబడి వెళ్ళలేదు. చిన్న వయస్సులోనే ఫ్రాన్సిస్ జేవియర్ జీవితం అతనిపై లోతైన ముద్ర వేసింది. అది మిషనరీ మార్గాన్ని ఎంచుకొనుటకు అతని అడుగులకు మార్గ నిర్దేశం చేసియుండవచ్చు. కాగా 15 ఏళ్ళ వయసులో అతను "సొసైటీ ఆఫ్ జీసస్" లో చేరారు. చదువు పూర్తయిన తరువాత సెయింట్ ఆంటోనీ కాలేజీలో అతను బోధించడం ప్రారంభించినప్పటికీ, భారతదేశంలో మిషనరీగా సేవ చేయుటకు అంతర్గతంగా అతని ప్రణాళికలు కొనసాగుతున్నాయి. చిన్న వయస్సులోనే తన భర్తను కోల్పోయిన అతని తల్లి, అతనిని ఆపడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఏవీ కూడా అతనిని నిర్భధించలేక పోయాయి.



1673వ సంll లో గోవా చేరుకున్న అతను, అక్కడ కొంతకాలం స్థానిక భాషలను అధ్యయనం చేసిన పిమ్మట, క్లిష్టమైన పర్వతాలు మరియు అరణ్య మార్గాల గుండా మదురాకు కాలినడకన పయనమయ్యారు. అయితే అంతకంటే కష్టతరమైన అవరోధం అతని కొరకు వేచియుంది. అది భారతదేశ కుల వ్యవస్థ! దానిలోకి చొచ్చుకుపోవుటకుగాను అతను దేహానికి కాషాయ వస్త్రాన్ని, తలకు ఒక తలపాగాను మరియు కాళ్ళకు చెక్కతో చేసిన చెప్పులను ధరించి, కఠినమైన శాకాహారిగా మారి, తన పేరును ‘అరుళ్ ఆనందర్’ గా మార్చుకున్నారు. నిష్ఠ కలిగిన జీవితాన్ని జీవిస్తూ తనను ఒక సన్యాసిగా చిత్రీకరిస్తూ, అతను ఉన్నత కులాలకు చెందినవారి ఆత్మలను గెలుచుకోగలిగారు. అయితే అట్టడుగు వర్గాల వారిని ఏనాడూ నిర్లక్ష్యం చేయని బ్రిట్టో, 'పరియా' అనే తక్కువ కులం వారి మధ్య కూడా సేవ చేశారు.



ఫలవంతమైన పరిచర్యతో పాటు శ్రమలు కూడా పెరిగాయి. ఎంతో గొప్ప హింసను, చిత్రవధలను అనుభవించిన తరువాత అతను భారతదేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. తద్వారా లిస్బన్ నగరానికి తిరిగి వెళ్ళిన అతను, అక్కడ సుమారు రెండు సంll లు గడిపిన పిమ్మట 1690వ సంll లో మరొకసారి తనకు ప్రియమైన దేశానికి ప్రయాణమయ్యారు. ఈ పర్యాయం అతను మరలా తిరిగి వెళ్ళలేదు. రామ్‌నాథ్ (రామనాథపురం) యొక్క రాజు అతనిని బంధించి, అతనికి శిరచ్ఛేదనం చేయబడవలెనని ఆదేశించాడు. 'పోర్చుగీస్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్' అని భారతీయులచే పిలువబడే జాన్ డి బ్రిట్టో, ఆ ప్రజల కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేశారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

 ప్రియమైనవారలారా, మీ ప్రభువు కొరకు మీరేమి త్యాగం చేశారు? 

ప్రార్థన :

"ప్రభువా, సమస్తమును నష్టముగా ఎంచుకొని, మీ ఉన్నతమైన పిలుపును చేరుకొనుటకు గురి యొద్దకే నేను పరుగెత్తునట్లు నాకు కృప దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment