Pages

Apr 9, 2022

Dietrich Bonhoeffer | డీట్రిక్ బాన్‌హోఫర్

డీట్రిక్ బాన్‌హోఫర్ జీవిత చరిత్ర



  • జననం      :    04-02-1906
  • మరణం     :    09-04-1945
  • స్వస్థలం      :    వ్రోట్స్వావ్ 
  • దేశం         :    పోలాండ్
  • దర్శన స్థలము    : జర్మనీ


    డీట్రిక్ బాన్‌హోఫర్ ఒక వేదాంతవేత్త, లూథరన్ సంఘ పాదిరి, రచయిత మరియు జర్మనీలోని "కన్ఫెసింగ్ చర్చి" వ్యవస్థాపకులలో ఒకరు. అతను నామకార్థ క్రైస్తవ్యపు పరిస్థితులలో పెరిగారు. ఏదేమయినప్పటికీ, దేవుని సేవ చేయుటకు ఆకర్షితులై, పద్నాలుగు సంవత్సరాల వయస్సులో తాను దైవ సేవకుడు అవ్వాలని  నిశ్చయించుకున్నారు. 1927వ సంll లో బెర్లిన్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత న్యూయార్క్ నగరంలోని ‘యూనియన్ థియోలాజికల్ సెమినరీ’ అనే వేదాంత కళాశాలలో శిక్షణ పొందుటకు అతను అమెరికా వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు అణగారిన సమాజములో మార్పు తీసుకొని వచ్చుటలో క్రైస్తవ సంఘము ఎంత శక్తివంతమైనదో అతను గ్రహించారు. ఇది దేవునికి సేవ చేయడంలో ఒక నూతన దృక్పథమును అతనిలో కలిగించింది.


    ఆ సమయంలోనే హిట్లర్ అధికారంలోకి రాగా, అది యూదుల శ్రమలకు నాంది పలికింది మరియు క్రైస్తవ సంఘములో తప్పుడు సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది. జర్మనీ ప్రజలు క్రీస్తు యొక్క సంఘములో ప్రవేశించుటకు హిట్లర్ పరిశుద్దాత్ముని మార్గమని విశ్వసించిన చాలా మంది క్రైస్తవ సంఘ నాయకులు ఆ విధంగా బోధించడం ప్రారంభించారు. డీట్రిక్ అటువంటి తప్పుడు బోధలను తిరస్కరించి, సంఘములోనికి చొరబడుతున్న 'నాజీయిజం' గురించి విశ్వాసులను హెచ్చరించారు. యూదులకు కలుగుతున్న హింసను వ్యతిరేకించవలెనని క్రైస్తవ సంఘముకు అతను తిరిగి తిరిగి చేసిన విజ్ఞప్తులు నాజీయిజముకు మద్దతునిచ్చే సంఘ నాయకుల మందగిలిన చెవులకు వినబడనట్లుగానే ఉన్నాయి. అటువంటి సంఘటనల వలన వేదన చెందిన డీట్రిక్, మరికొందరితో కలిసి "కన్ఫెసింగ్ చర్చ్" ను స్థాపించారు. ఈ సంఘం హిట్లర్ యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడినది.


    తన పరిచర్యపై వ్యతిరేకత పెరుగుతున్న సమయములో అతను జర్మన్ భాషను మాట్లాడే ప్రొటెస్టంట్ సంఘములో పరిచర్య చేయుటకు రెండు సంవత్సరాల పాటు లండన్ వెళ్ళారు. తరువాత జర్మనీకి తిరిగి వచ్చిన అతను, అబద్ధ బోధనలకు వ్యతిరేకంగా కన్ఫెస్సింగ్ చర్చి చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అయితే, అతని వేదాంత కళాశాల మూసివేయబడింది, బోధించుటకు అతనికివ్వబడిన అధికారపూరిత అనుమతి (లైసెన్స్) రద్దు చేయబడింది మరియు అతను ప్రసంగించడం లేదా ప్రచురించడం నిషేధించబడింది. కాగా రహస్యముగా పరిచర్య జరిగిస్తున్నందుకుగాను మరియు యూదులను తప్పించుటలో పాలుపంపులు కలిగియున్నందుకుగాను చివరికి అతను బంధించబడ్డారు. రెండు సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన అతను, చెరసాలలో ఉన్న సమయములో ఖైదీల మధ్య సంతోషముగా పరిచర్య చేశారు మరియు ఎంతో ముఖ్యమైన వేదాంతపరమైన వాదనలను లిఖించారు. తదుపరి ఆ రచనలు జర్మన్ చర్చి యొక్క పురోగతికి ఆకృతినిచ్చాయి. హిట్లర్‌కు విధేయునిగా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయుటకు డీట్రిక్ నిరాకరించడంతో అతనికి ఉరిశిక్ష విధించబడింది. అతని యొక్క ఆఖరి మాటలు ఏవనగా, "ఇది ముగింపు — నాకు మాత్రం జీవిత ఆరంభం".

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు నామకార్థపు క్రైస్తవ జీవితమును విడిచిపెట్టి, ఆత్మీయపరముగా ఆసక్తి గలవారై దేవుని కొరకు జీవిస్తున్నారా?

ప్రార్థన :

"ప్రభువా, ఆరోగ్యకరమైన సిద్ధాంతములో ఎదుగుటకు నాకు సహాయము చేసి, అబద్దపు బోధనల నుండి నన్ను కాపాడుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment