Pages

Apr 9, 2022

William Goodell | విలియం గూడెల్

విలియం గూడెల్ జీవిత చరిత్ర



  • జననం : 14-02-1792
  • మరణం : ఫిబ్రవరి, 1867
  • స్వస్థలం : టెంపుల్టన్, మసాచుసెట్స్
  • దేశం : యునైటెడ్ స్టేట్స్
  • దర్శన స్థలము : కాన్‌స్టాంటినోపుల్ మరియు బీరూట్


సిలువ మార్గం శ్రమల మార్గం. దీనిని ఒక మిషనరీ జీవితం మరింత స్పష్టంగా మనకు కనుపరుస్తుంది. యుద్ధకాలంలో ప్రాణాలను దక్కించుకొనుటకు పారిపోవడం, తెగుళ్ళు మరియు విపత్తుల మధ్య నివసించడం, ఎదురయ్యే వ్యతిరేకతను మరియు హింసలను దీర్ఘశాంతముతో సహించడం, అనారోగ్యం, ప్రియమైన వారిని కోల్పోవడం, నిరంతరాయంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారడం, నలభై సంవత్సరాలు తనదుకాని పరదేశంలో... – కానీ ఏనాడూ వెనుకంజవేయలేదు! “నేను మీకు సొంతం, మీ వాడను నేను... మీకు చిత్తమైన స్థలమునకు నన్ను పంపుము; క్రైస్తవ ధైర్యమనెడి కవచమును నాకు ధరింపజేయుము, మీ రక్షణను గూర్చి ప్రకటించుటకు మిక్కిలి సంతోషముగా నేను భూదిగంతముల వరకు వెళ్తాను!; నా సేవ మీకు అవసరం లేదు. అయితే, మీకు సేవ చేసే భాగ్యమును నాకు దయచేయుమని వేడుకుంటున్నాను." అను మాటలు శ్రమల మధ్య కూడా ప్రభువును సేవించాలనే తన సమర్పణ నుండి ఎన్నడూ తొణకని విలియం గూడెల్ యొక్క ప్రార్థనలు.


అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ యొక్క మిషనరీయైన గూడెల్, 1823వ సంll జనవరి మాసంలో తన భార్య అబిగయేల్ మరియు ఇతర మిషనరీలతో కలిసి మాల్టా అనే దీవికి చేరుకున్నారు. అక్కడ వారు కొన్ని నెలల పాటు తూర్పు ప్రజల భాషలను అధ్యయనం చేస్తూ గడిపారు. పిమ్మట నవంబరు మాసం నాటికి వారు బీరూట్‌కు వెళ్ళి, అక్కడ నివసిస్తున్న అరబ్బులు, టర్కులు, యూదులు, గ్రీకులు, మెరోనైట్లు, ఫ్రాంక్‌లు మొదలైన వారి మధ్యలో సేవ చేశారు. కాబట్టి, వివిధ భాషలను అభ్యసించడం వారి దినచర్యగా మారింది. కాథలిక్ చర్చి నుండి నిరంతర వ్యతిరేకత, యుద్ధాలు మరియు తెగుళ్ళ మధ్య వారు 1828వ సంll వరకు అక్కడ సేవ చేశారు. తత్ఫలితంగా సిరియాలో మిషనరీ కార్యకలాపాలకు బీరూట్ ప్రధాన కార్యాలయంగా మారింది.


మాల్టాకు తిరిగి వచ్చిన తరువాత, 1830వ సంll నాటికి గూడెల్ క్రొత్త నిబంధనను అర్మేనో-టర్కిష్ భాషలోనికి అనువదించుటను పూర్తి చేశారు. తదుపరి 1831వ సంll లో కాన్‌స్టాంటినోపుల్‌కు వెళ్ళి అక్కడ ఒక మిషన్ ప్రారంభించుటకు అతను నియమించబడ్డారు. విపత్తులు, తెగుళ్ళు, యుద్ధాలు, గ్రీకులు మరియు కాథలిక్కుల నుండి వ్యతిరేకత, హింస మొదలగునవి కూడా వారి వెంటే వచ్చాయి. ఒకసారి జరిగిన అగ్ని ప్రమాదంలో వారు కలిగియున్నదంతా కోల్పోయారు. 1841వ సంll లో అతని కుమారుడు టైఫాయిడ్‌తో మరణించాడు. అదే సంవత్సరం గూడెల్ మొత్తం బైబిలు‌ను అర్మేనో-టర్కిష్‌ భాషలోకి అనువదించడం పూర్తిచేశారు. తదుపరి దానిని సవరించుటలో ఇరవై ఏళ్ళకు పైగా శ్రమించి 1863వ సంll లో సంపూర్తి చేశారు. అతను అక్కడ సేవ చేసిన కాలములోనే ప్రొటెస్టంట్ సంస్కరణ ఉద్యమాన్ని టర్కీ రుచి చూసింది. తాను సేవ చేసిన స్థలములలో అనేక పాఠశాలలను స్థాపించుటలో కూడా గూడెల్ ముఖ్యపాత్ర పోషించారు.


టర్కీ సామ్రాజ్యంలో 1823-51 వరకు, తిరిగి 1853-65 వరకు, నలభై సంవత్సరాల పాటు ఫలవంతమైన పరిచర్యను చేసిన తరువాత, 1865వ సంll లో అమెరికాకు తిరిగి వెళ్ళిన విలియం గూడెల్, తన తుది శ్వాస వరకూ దేవుని సేవలో సాగిపోయారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సర్వశక్తిమంతుడైన దేవునికి సేవ చేసే భాగ్యమును మీరు కోరుకుంటున్నారా?

ప్రార్థన :

"ప్రభువా, నేను మీ వాడను/దానను, మీకు చిత్తమైన స్థలమునకు నన్ను పంపుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment