Pages

Jul 25, 2022

Ella Marie Maddock | ఎల్లా మేరీ మడాక్

ఎల్లా మేరీ మడాక్  జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: 1865
  • మహిమ ప్రవేశం: 1909
  • స్వస్థలం: ఓహియో
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


మిషనరీ నర్సుగా అర్హత పొందిన మొట్టమొదటి నుర్సులలో ఒకరైన ఎల్లా మేరీ మడాక్ 'డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్' (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థ తరపున భారతదేశంలో సేవచేశారు. ఆమె ఒక ఆదర్శప్రాయమైన క్రైస్తవ కుటుంబములో జన్మించారు. స్థానిక క్రైస్తవ సంఘములో క్రియాశీలక సభ్యులుగా ఉండే ఎల్లా మరియు ఆమె సోదరి మేరీ వివిధ పరిచర్యలలో నాయకత్వ పాత్రను పోషించేవారు. అయితే ఎల్లా యొక్క చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించుట వలన కుటుంబ బాధ్యత ఇంటిలో పెద్ద కుమార్తె అయిన ఆమె భుజాలపై పడింది. ఆమె తన ఉన్నత పాఠశాల విద్యను ముగించుకొని నర్సింగ్ కోర్సును అభ్యసించారు. తదుపరి అర్హత మరియు అనుమతి కలిగిన నర్సుగా ఓహియోలో పనిచేశారు.


చాలా సంవత్సరాలు నర్సుగా వృత్తిలో కొనసాగిన తరువాత, ఆమె చికాగోలోని మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్‌లో చేరి క్రియారూపకముగా మిషనరీ పని చేశారు. పిమ్మట ఆమె మిషనరీగా విదేశాలకు వెళ్ళి సేవ చేయుటకు దరఖాస్తు పెట్టుకొనగా, భారతదేశంలో, మరి ముఖ్యముగా భారతీయ మహిళల మధ్య మిషనరీ సేవను జరిగించుటకు ఆమె నియమించబడ్డారు. తద్వారా 1898వ సంll లో మధ్యప్రదేశ్‌లోని బినా అనే ప్రాంతమునకు చేరుకున్న ఎల్లా, అక్కడ స్థానిక భాషను అధ్యయనం చేస్తూ కొంత కాలం గడిపిన తరువాత, బిలాస్‌పూర్‌కు వెళ్ళి నర్సుగా సేవలందించారు. ఆ తర్వాత ఆమె ఒరిస్సాలోని హిందూ పుణ్యక్షేత్రమైన దేవ్ ఘడ్‌కు వెళ్ళి మహిళ మధ్య ఎంతో శ్రద్ధాసక్తులతో సేవ చేశారు. అక్కడ ఆమె వారికి వైద్య సేవలను అందించారు, కుష్ఠురోగుల కాలనీను బాధ్యతగా చూసుకున్నారు మరియు చిన్నపిల్లలు క్రీస్తులో ఎదుగుటకు సహాయపడ్డారు. అంతేకాకుండా దేవ్ ఘడ్‌ నగరానికి తీర్థయాత్రకు వచ్చే భక్తులతో సంభాషించి, సువార్తను పంచుకొనుటలో ప్రత్యేక శ్రద్ధ కనుబరిచారు. 


ఎంతో ఉత్సాహముతో పనిచేసే ఎల్లా, సాధారణముగా ఆమె శక్తికి మించి పనిచేసేవారు. కాగా ఆమెకు అననుకూలముగా ఉన్న వాతావరణ పరిస్థితులు మరియు శక్తికి మించిన శ్రమ వలన ఆమె శరీరం కృశించిపోయింది. ఒక ప్రాణాంతక వ్యాధి కారణంగా అనారోగ్యానికి గురైన ఆమె, చివరికి 1909వ సంll లో ప్రభువునందు నిద్రించారు. తన సోదరి ఎల్లా యొక్క పరిచర్య నుండి ప్రేరణ పొందిన మేరీ కూడా భారతదేశానికి వచ్చి కొంతకాలం మిషనరీ సేవను జరిగించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ జీవితం మీ సోదరీసోదరులను దేవుని సేవ కొరకై ప్రేరేపించేదిగా ఉన్నదా? 


ప్రార్థన :

"ప్రభువా, ఇతరులకు ఆశీర్వాదకారముగాను మరియు ప్రేరణగాను ఉండునట్లు నా జీవితమును మార్చుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment