Pages

Jul 26, 2022

Miles Bronson | మైల్స్ బ్రోన్సన్

మైల్స్ బ్రోన్సన్ జీవిత చరిత్ర



  • జననం: 20-07-1812
  • మహిమ ప్రవేశం: 09-11-1883
  • స్వస్థలం: న్యూయార్క్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం


మైల్స్ బ్రోన్సన్ ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. 1836వ సంll లో పట్టభద్రులైన పిమ్మట అతను బాప్తిస్టు సంఘముచే సేవ కొరకైన నియామక అభిషేకమును పొందారు. వెనువెంటనే అతను భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు ‘అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్’ వారిచే నియమించబడ్డారు. 


తదుపరి బర్మాకు వెళ్ళవలెననే దర్శనంతో మైల్స్ 1838వ సంll లో అస్సాంలోని సాదియాకు వచ్చారు. అయితే అతని పట్ల దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. నాతాన్ బ్రౌన్ మరియు ఓ.టి. కట్టర్‌ అనే మరో ఇద్దరు మిషనరీలతో కలిసి అతను అక్కడి స్థానికుల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తరువాత అస్సాంలో ఉన్న జైపూర్ అనే ప్రాంతమునకు వెళ్ళిన అతను, అక్కడ నోక్టే తెగ యొక్క మాండలికమైన నోక్టే భాషను నేర్చుకున్నారు. నోక్టే తెగవారు అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్‌సాంగ్‌లో నివసిస్తున్న ‘నాగ’ తెగ యొక్క జాతికి చెందినవారు. వారు ఉప్పు వ్యాపారం నిమిత్తం అస్సాంలోని జైపూర్‌కు వచ్చేవారు. కాగా క్రీస్తు ప్రేమతో నింపబడిన మైల్స్, ఈ నోక్టే తెగల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు.


నామ్‌సాంగ్‌ చేరుకొనుటకు దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లను దాటుకుంటూ ఎన్నో సవాళ్ళతో కూడుకొనిన ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టారు మైల్స్. అతను ఆంగ్లేయుల గూఢాచారి అయ్యుండవచ్చునని స్థానికులు అతనిని పలుమార్లు అనుమానించారు. వారి గ్రామ శివార్లలో రెండు రోజులు గడిపిన తరువాత, వారి భాష నేర్చుకోవాలనే ఆసక్తిని వినయపూర్వకముగా వ్యక్తం చేసిన మైల్స్ చివరకు గ్రామ నాయకుడైన ఖోన్‌బావో యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. క్రమక్రమంగా అతను వారికి నిత్య జీవ మార్గమును మరియు నాగరిక జీవితమును బోధించారు. సువార్తకు సంబంధించిన రచనలను నోక్టే భాషలోకి అనువదించిన అతను, స్థానిక పిల్లలకు పాఠశాలలను కూడా స్థాపించారు.


అంతేకాకుండా అనేక అస్సామీ మాండలికాలకు మైల్స్ గొప్ప సహకారమును అందించారు మరియు వాటికి ఒక రూపమును చేకూర్చి, సాహిత్య వ్యక్తీకరణను అభివృద్ధి పరచారు. అతను మొట్టమొదటి అస్సామీ-ఆంగ్ల నిఘంటువును ప్రచురించారు. అందునుబట్టి అస్సామీలు ఈనాటికి కూడా కృతజ్ఞులైయున్నారు. అంతేకాకుండా అతను అస్సామీ భాషలోనికి బైబిలును అనువదించడం కూడా ప్రారంభించారు.


కొండ ప్రాంత వాతావరణమును తట్టుకొనుట అతని దేహమునకు ఎంతో కఠినముగా ఉన్నప్పటికీ మరియు దాని కారణముగా అతని సోదరి రోడా మరణించినప్పటికీ వెనుకంజవేయని మైల్స్, 1879వ సంll వరకు కూడా ఈశాన్య భారత పరిచర్యలో ముందుకు సాగిపోయారు. పిమ్మట అమెరికాకు తిరిగి వెళ్ళిన అతను, 1883వ సంll లో ప్రభువునందు నిద్రించారు. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధిక శాతం కలిగియున్న మతముగా క్రైస్తవ మతము మారుటలో మైల్స్ చేసిన పరిచర్య పునాదిగా నిలుస్తుంది. అయితే ఈనాడు అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు నిషేధించబడినవిగా ఉన్నాయని మీకు తెలుసా?


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, భారతదేశం యొక్క కోత విస్తారముగా ఉన్నది. పనిచేయుటకు మీరు సిద్ధమేనా? 


ప్రార్థన :

"ప్రభువా, సువార్త పరిచర్య కొరకై అరుణాచల్ ప్రదేశ్ యొక్క ద్వారములను తెరువుము. ఆమేన్!"  

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment