Pages

Jul 26, 2022

Patricia St. John | ప్యాట్రిసియా సెయింట్ జాన్

ప్యాట్రిసియా సెయింట్ జాన్ జీవిత చరిత్ర



  • జననం: 1919
  • మహిమ ప్రవేశం: 1993
  • స్వదేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: మొరాకో


ప్యాట్రిసియా సెయింట్ జాన్ మొరాకో దేశంలో సేవ చేసిన ఒక మిషనరీ నర్సు. సువార్తను గురించి ఆమె చేసిన రచనలకు కూడా పేరొందారు ప్యాట్రిసియా. ఆమె తల్లిదండ్రులు కూడా మిషనరీలుగా దక్షిణ అమెరికాలో సేవచేసి, 1919వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. కాగా దైవికమైన పరిస్థితుల మధ్య పెరిగిన ప్యాట్రిసియా చిన్నప్పటి నుండి కూడా మిషనరీ పరిచర్య వైపు మొగ్గుచూపారు. చాలా చిన్న వయస్సులోనే ఆమె యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ నగరంలో నర్సుగా పనిచేశారు ప్యాట్రిసియా. మొరాకోలో జరుగుచున్న వైద్య మిషనరీ పరిచర్యలో తనతో కలుసుకొనుమని ఆమె సోదరుడి నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ప్యాట్రిసియా టాంజియర్స్‌కు  వెళ్ళారు. అక్కడ స్థానిక ముస్లిం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల మధ్య ఆమె పనిచేశారు. ముస్లిం మహిళలు మగ వైద్యుని యొద్దకు వెళ్ళుటకు అనుమతించబడేవారు కాదు. అందువలన ప్యాట్రిసియా ఆ మహిళలకు సేవలందించుటకుగాను తన స్వంత ఇంటినే చిన్న వైద్యశాలగా ఉపయోగించారు. త్వరలోనే ఆమె స్థానిక మహిళల యొక్క నమ్మకమును సంపాదించుటయే కాక, వారిలో అనేకమంది ఆత్మలను కూడా క్రీస్తు కొరకు సంపాదించారు.


తమ స్వజనులే క్రీస్తును అంగీకరించుచున్నారని చూసిన ముస్లింలు ఆమెను బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పారు. కాబట్టి ఆమె  రువాండాకు వెళ్ళి, అక్కడ కూడా అదే రీతిని పరిచర్య జరిగించారు. అయితే కొంతకాలం తరువాత ఆమె తిరిగి టాంజియర్స్‌కు వచ్చి, అక్కడ ఒక నర్సింగ్ శిక్షణా పాఠశాలను స్థాపించారు. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వకుండా ఊరకనే కూర్చొనలేడు. అది  ప్యాట్రిసియా విషయంలో కూడా నిజమైంది. అందువలన, మొరాకో ప్రభుత్వం ఆమె సోదరుని ఆసుపత్రిని మరియు ఆమె యొక్క నర్సింగ్ శిక్షణాలయమును రెండింటినీ స్వాధీనం చేసుకొని, వారిరువురూ దేశం విడిచి వెళ్ళవలెనని ఆదేశించింది. 27 సంవత్సరాలు మొరాకోలో సేవ చేసిన పిమ్మట 1975వ సంll లో ఇంగ్లాడుకు తిరిగి వచ్చారు ప్యాట్రిసియా. తరువాత ఆమె బీరుట్ మరియు ఇథియోపియాలోని కొన్ని ప్రాంతములకు వెళ్ళి, బీదల మధ్యను మరియు ఆకలితో అలమటించుచున్న వారికిని చివరి వరకూ సేవలందించారు.


ప్యాట్రిసియా ఆకట్టుకునే విధముగా కథలు చెప్పగలరు. ఆమె తన రోజువారీ అనుభవాలను చిన్న చిన్న కథలుగా మలిచి, పిల్లలకు మరియు యవ్వనస్థులకు దేవుని ప్రేమను మరియు శక్తిని తెలియజేయుటకు ఉపయోగించేవారు. మిషనరీ పరిచర్యలో కూడా ఆమె మతాధికారుల కొరత వలన క్రొత్తగా జన్మించిన విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి దెబ్బతినకుండా చూచుకున్నారు. తానే స్వయంగా బైబిలు యొక్క సత్యాలను సరళముగాను, అదేసమయంలో సమర్థవంతముగాను వారికి నేర్పించారు. ఆమె రచించిన “ట్రెజర్స్ ఆఫ్ ది స్నో” మరియు “ది టాంగిల్‌వుడ్స్' సీక్రెట్” వంటి పుస్తకాలు ఎంతో మంది చిన్నారులను క్రీస్తు వద్దకు నడిపించాయి.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, యేసు క్రీస్తును గురించి ఇతరులకు చెప్పవలసిన ఆవశ్యకతను మరియు దాని ప్రాముఖ్యతను మీరు గ్రహించారా?


ప్రార్థన :

"ప్రభువా, ఏమీ చేయకుండా కూర్చునే నా స్వభావమును క్షమించి, చురుకుగా సువార్తను మోసుకువెళ్ళే వ్యక్తిగా ఉండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment