Pages

May 14, 2023

Francis Asbury | ఫ్రాన్సిస్ ఆస్బరీ

ఫ్రాన్సిస్ ఆస్బరీ గారి జీవిత చరిత్ర

  • జననం : 20-08-1745
  • మరణం : 31-03-1816
  • స్వదేశం : ఇంగ్లాండు
  • దర్శన స్థలము : అమెరికా


అమెరికన్ మెథడిజమునకు (అమెరికాలో మెథడిస్టు సంఘములకు మరియు సేవకు) పితామహుడు అయిన ఫ్రాన్సిస్ ఆస్బరీ, శ్రామిక తరగతికి చెందిన ఒక ఆంగ్లేయ కుటుంబములో జన్మించారు. చిన్నతనంలో అతను బిడియముగా ఉండేవారు మరియు ఆత్మపరిశీలనా స్వభావాన్ని కలిగియున్నారు. కాగా ఇతర విద్యార్థులు అతనిని గేలిచేస్తూ, ఆటపట్టిస్తుండేవారు. చివరికి అతను 12 సంll ల వయసులో చదువు మానివేసి, ఒక కమ్మరి యొద్ద సహాయకునిగా పనిచేశారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదనే భయమును అతనిలో బలముగా నాటిన అతని తల్లి, అతనిలో విశ్వాసానికి మొదటిగా పునాదులు వేశారు. పదునాలుగేళ్ళ వయసులో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆస్బరీ, అటు తరువాత దేవునిని సేవించుటకు తన జీవితమును సమర్పించుకున్నారు.


ఒకప్పుడు బిడియస్థునిగా ఉన్న అతను, ఇప్పుడు మెథడిస్టు సంఘములలో దేవుని వాక్యమును బోధించే మంచి బోధకులయ్యారు. ఇంగ్లాండులో సంచార బోధకునిగా కూడా సేవలందించిన అతను, సువార్త ప్రకటించుటకు గుఱ్ఱముపై అనేక మైళ్ళు ప్రయాణించేవారు. అమెరికాలో సేవ చేయుటకు జాన్ వెస్లీ నుండి పిలుపును అందుకొనిన ఆస్బరీ, 1771వ సంll లో ఉత్తర అమెరికాకు వెళ్ళారు. మొదట అతను ఫిలడెల్ఫియాలో ఉండి దేవుని వాక్యమును ఎంతో విరివిగా బోధించారు. యేసుక్రీస్తుపై విశ్వాసముంచుట ద్వారా రక్షణ కలుగుతుందనే సత్యమును ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడం తనకు దేవుడు నియమించిన బాధ్యత అని అతను భావించారు. అతను ప్రతి ఒక్కరినీ, అనగా స్త్రీ పురుషులను, అన్ని వయసులవారిని, అన్ని జాతులవారిని మరియు వివిధ నేపథ్యాలు కలిగినవారిని, సంధించవలెనని వాంఛించారు. అతను అక్కడ 45 సంllల పాటు చేసిన సేవ ద్వారా అమెరికాలో మెథడిస్టు సంఘములు ఎంతో వేగముగా విస్తరించాయి.


మిషనరీ సేవలో ఆస్బరీ అనుసరించిన పద్ధతి యేసుక్రీస్తు యొక్క శిష్యుల మాదిరిని పోలియున్నది. అతనికి ఇల్లు లేదు, ఒక కార్యాలయం లేదు, సిబ్బంది లేరు, ఎటువంటి సామాను లేదు. అతను కలిగియున్నదంతా కొన్ని పుస్తకములు మరియు అమెరికాలో వేలాది మైళ్ళు ప్రయాణించుటకు అతను ఉపయోగించే ఒక గుఱ్ఱము మాత్రమే. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతూ ఉన్నప్పటికీ, అతను 16,000 కంటే ఎక్కువ ఉపన్యాసాలు ప్రసంగించారు. అతను సంఘములలో ఒక క్రమమును ఏర్పరిచారు. ఒక సంఘము నుండి మరొక సంఘమునకు ప్రయాణిస్తూ పరిచర్య చేయుటకు, మరి ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాలలో ఆ విధముగా పరిచర్య చేయుటకు  సర్క్యూట్ రైడర్స్ బోధకులను కూడా నియమించారు. అంతేకాకుండా పిల్లలకు దేవుని వాక్యమును బోధించుటకుగాను సండే స్కూళ్ళను (ఆదివారపు బైబిలు పాఠశాలలను) మరియు వారికి చదవుటను, వ్రాయుటను నేర్పుటకు ఇతర పాఠశాలలను కూడా అతను ప్రారంభించారు.


1816వ సంll లో పరమ విశ్రాంతిలోకి ప్రవేశించేవరకు వృద్ధాప్యమందు కూడా కష్టతరమైన తన మిషనరీ ప్రయాణములను కొనసాగించారు ఫ్రాన్సిస్ ఆస్బరీ.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ స్నేహితులతో సువార్తను పంచుకొనుటకు మీ బిడియమును, సిగ్గును మీరు అధిగమించారా? 

ప్రార్థన :

"ప్రభువా, ఈ ప్రాపంచిక భారములను విడిచిపెట్టి, మీ యొక్క నిజమైన శిష్యునిగా నేను ఎదుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment