హ్యారీ ఐరన్‌సైడ్ | Harry Ironside
- జననం: 1876
- మహిమ ప్రవేశం: 1951
- స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
హ్యారీ ఐరన్‌సైడ్ అమెరికాకు చెందిన ఒక బోధకుడు, బైబిలు వేదాంతవేత్త మరియు రచయిత. అతనికి 14 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను బైబిలును 14 సార్లు చదివారు మరియు బైబిలులోని అనేక వచనాలను కంఠస్థం చేశారు. అతనికి 10 సంll ల వయస్సు ఉన్నప్పుడు తన తల్లితో పాటు అతను లాస్ ఏంజిల్స్‌లో నివసించుటకు వెళ్ళారు. అక్కడ వారి ఇంటికి సమీపంలో ఆదివారపు బైబిలు పాఠశాల (సండే స్కూల్) లేదు. కావున ఐరన్‌సైడ్ ఆ ప్రాంతంలోని పిల్లలను సమకూర్చి తానే స్వయంగా వారికి బైబిలు కథలను చెప్పేవారు. కాలక్రమేణా ఆ సండే స్కూలులో పిల్లల సంఖ్య అరవైకి చేరుకుంది. కొన్నిసార్లు పెద్దలు కూడా అక్కడ హాజరయ్యేవారు.
ఐరన్‌సైడ్ ఒకవైపు పరిచర్య చేస్తున్నప్పటికీ అతను ఒక మతపరమైన వ్యక్తిగా ఉన్నారే గానీ, క్రీస్తును కలిగిలేరు. ఒక రోజు ఒక సంచార సువార్తికుడు “నీవు తిరిగి జన్మించావా?” అని అతనిని సూటిగా అడిగిన ప్రశ్నకు అతని వద్ద సమాధానం లేదు. అప్పుడు అతను రక్షించబడకుండా దేవుని గురించి బోధించుటకు నోరు తెరిచే హక్కు తనకు లేదని గ్రహించారు. ఒక రోజు రాత్రి అతను సామెతలు 1: 24-32 చదువుతున్నప్పుడు, అతను మోకరించి "ప్రభువా, నన్ను రక్షించుము!" అని ప్రార్థించారు. ఆ అనుభవం తర్వాత యవ్వనస్థుడైన ఐరన్‌సైడ్ నిర్మలమైన మనస్సాక్షితో రక్షణ సైన్యముతో (‘సాల్వేషన్ ఆర్మీ’) కలిసి తన పరిచర్యను ప్రారంభించారు. 18 సంll ల వయస్సు వచ్చేటప్పటికి అతను సంవత్సరానికి 500 కంటే ఎక్కువ ప్రసంగాలనిచ్చే బోధకుడయ్యారు.
హెలెన్ స్కోఫీల్డ్‌తో వివాహం జరిగిన తరువాత ఐరన్‌సైడ్ ఓక్లాండ్‌కు వెళ్ళారు. అది చాలా సంవత్సరాల పాటు వారి పరిచర్యకు కేంద్రంగా ఉంది. అక్కడ పరిచర్య కొరకు ద్వారములు తెరిచి ఉన్నాయి. అదే సమయంలో దేవుడు వారిని కొన్ని కఠినమైన పరిస్థితులు మరియు వారి విశ్వాసమునకు కలిగిన పరీక్షల గుండా నడిపించాడు. అనేక సార్లు ఆ చిన్న కుటుంబం ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఉండేది. ఒకసారి వారు మిన్నెసోటాలో పరిచర్య జరిగించి తిరిగి వస్తున్నప్పుడు, ఓక్లాండ్ చేరుకోవడానికి వారి యొద్ద ధనము లేదు మరియు ఎటువంటి సహాయమూ అందలేదు. కావున వారు ఉటా అనే ప్రాంతము వద్ద ఆగిపోవలసి వచ్చింది. తన పిల్లలకు ఆహారమిచ్చుటకు మరియు అద్దె చెల్లించుటకు కావలసిన 40 సెంట్లు (సుమారు 1.50 రూపాయలు) కూడా అతని వద్ద లేని స్థితి వచ్చింది. ఆ రాత్రి అతను ఆరుబయట ఒక పెద్ద జన సమూహానికి బోధించి, నిరుత్సాహపడుతూ తిరిగి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతని యొద్దకు పరుగెత్తుకు వచ్చి, కొన్ని నాణములు ఇచ్చి, వెళ్ళిపోయారు. అతను వాటిని లెక్కించగా అవి ఖచ్చితంగా 40 సెంట్లు ఉన్నాయి! దేవుడు నమ్మదగినవాడు!
ఐరన్‌సైడ్ 1930వ సంll నుండి 1948వ సంll వరకు చికాగోలోని మూడీ చర్చిలో పాదిరిగా సేవలందించారు. అదే సమయంలో అతను అమెరికా అంతటనూ మరియు ప్రపంచవ్యాప్తంగాను పర్యటించి ప్రసంగిస్తూనే ఉన్నారు. అనేక శారీరక రుగ్మతలను ఎదుర్కొంటున్నప్పటికీ వెనుకంజ వేయక పరిచర్యను కొనసాగించి దేవుని సేవలో ముందుకు సాగిపోయిన హ్యారీ ఐరన్‌సైడ్, పరిచర్య నిమిత్తం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో తనువు చాలించారు.
🚸 *ప్రియమైనవారలారా, మీరు క్రీస్తును కలిగియున్నారా లేక మతపరమైన వ్యక్తిగా ఉన్నారా?* 🚸
🛐 *"ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగినవాడవు! నీ విశ్వాస్యతకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను కూడా నీకు నమ్మకముగా జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
No comments:
Post a Comment